జగన్ ఐదేళ్ల పాలన అంతా మాఫియానే.

 *జగన్ ఐదేళ్ల పాలన అంతా మాఫియానే


*


*అవినీతి, అసమ్మతి.. ఎమ్మెల్యేల తిరుగుబాటు*


*ఆర్థిక స్థితిని బట్టి అభ్యర్థుల ఎంపిక దారుణం*


*ప్రజలంటే గౌరవం లేదు... రాజ్యాంగ వ్యవస్థలంటే లెక్కలేదు*


*ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు తీరని అన్యాయం*


*పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు*


విజయవాడ  (ప్రజా అమరావతి): జగన్ ఐదేళ్ల పాలన అంతా మాఫియానే అని పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ లో శనివారం ఆయన మీడియాతో మాడ్లాడుతూ.. ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించారు. పాలన అంతా అవినీతి, అసమ్మతి, సొంత పార్టీ  ఎమ్మెల్యేల తిరుగుబాటులతోనే సాగిందని విమర్శించారు. సీఎం జగన్ చెప్పిందే వేదం అన్నట్లు రాజుల కాలం పాలనలా సాగిందని వాపోయారు. ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధంగా ఏకపక్ష నిర్ణయాలతో వ్యవస్థలను దిగజార్చారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఉద్యోగుల బదిలీలు ఉండేవని... కొత్తగా వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, ఎంపీలను పక్క నియోజకవర్గాలకు బదిలీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. నీతి, నిజాయితీలకు విలువ లేకుండా... వారి ఆర్థిక స్థితిని బట్టి అభ్యర్థులను ఎంపిక చేయడం దారుణమైన విషయం అని చెప్పారు. బీసీలంటే బ్యాక్ బోన్ అంటూ ఒక పక్క..నా దళితులు అంటూ మరో పక్క.. కపట ప్రేమ చూపే సీఎం జగన్, ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీ నియోజకవర్గాల్లోనే ఎమ్మెల్యేల బదిలీలు చేస్తున్నారని పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు స్పష్టం చేశారు. ఎస్సీలకు చెందిన 28 ముఖ్య పథకాలను తీసేసిన జగన్, బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారి కార్యాలయాల్లో కనీసం కుర్చీలు కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త జీవోలతో వైద్య విద్యను బడుగు, బలహీన వర్గాలకు దూరం చేసిన ఘనత కూడా ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. అదే విధంగా పేదలకు ప్రాణ వాయువు అందించే.. ఆరోగ్య శ్రీ బకాయిలు కూడా చెల్లించడం లేదని పేర్కొన్నారు. కాంట్రాక్టర్లకు కూడా బకాయిలు చెల్లించడం లేదని చెప్పారు. ఇదేనా సామాజిక న్యాయం, రాజ్యాంగ స్పూర్తి అంటూ ఆయన ప్రశ్నించారు. గడిచిన నాలుగున్నరేళ్లుగా రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆడుకుంటూ... ఇప్పుడు కొత్తగా ఆడుదాం ఆంధ్రా అంటున్నారని ఎద్దేవా చేశారు. మద్యపాన నిషేధం అంటూ అధికారం చేపట్టిన సీఎం జగన్... గ్రామ, గ్రామానా కిళ్లీ కొట్లలో కూడా మద్యం అందుబాటులోకి తెచ్చారని పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు. అదే విధంగా ఇసుక, మట్టి, గ్రావెల్ వంటి వాటిని ప్రజా ప్రతినిధులు ఆదాయ వనరులుగా చూస్తూ కొల్లగొడుతున్నారని తెలిపారు. అన్నవరం నుంచి కాకినాడ వెళ్లేప్పుడు ఒక్క కొండ కూడా లేకుండా అన్నీ తవ్వేసారని, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని ఆయన చెప్పారు. పోలవరం, హోదా, రాజధాని విషయంలో ఎటువంటి అభివ్రుద్ధి లేకుండానే ఐదేళ్లు గడిపేశారని తెలిపారు. సీఎం జగన్ ప్రభుత్వం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బడుగులకు ఎటువంటి లాభం లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో చాలా దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయని తెలిపిన పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు... రాష్ట్ర ప్రభుత్వం సుమారు 11 లక్షల కోట్ల రూపాయిల అప్పు చేసిందని కొందరు చార్టెడ్ ఎకౌంటెంట్లు, అడ్వకేట్లు వెల్లడించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేవి లేవని పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం, లావేరు మండలానికి చెందిన రిపోర్టర్ దామోదర్ ఆత్మహత్య చేసుకుంటూ... తన ఆత్మహత్యకు కారణం ఎమ్మెల్యే ఒత్తిడే చెప్పారన్నారు. బాధిత కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ అధ‌్యక్షులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సొంత పేపర్ రిపోర్టర్ ను ఎమ్మెల్యే వేధించిన తీరు గురించి బాధిత కుటుంబ సభ్యులు వివరించిన వీడియోలను పీసీసీ అధ్యక్షులు ప్రదర్శించారు. దామోదర్ ఆత్మహత్యపై విచారణ చేయాలని కాంగ్రెస్ పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెడుతున్నారని, భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 


*అంగన్ వాడీ, పారిశుద్ధ్య కార్మికులకు న్యాయం చేయాలి*


పాదయాత్ర చేసేప్పుడు అందరికీ న్యాయం చేస్తానన్న జగన్... అధికారం చేపట్టి ముఖ్యమంత్రి అయిన తరువాత బడుగు, బలహీన, ఉద్యోగ వర్గాలకు కూడా అన్యాయం చేస్తున్నారని పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు మండిపడ్డారు. అంగన్ వాడీ, పారిశుద్ధ్య, వార్డు వాలంటీర్లకు ఇప్పుడు మొహం చాటేస్తున్నారని తెలిపారు. వైసీపీది నకిలీ కాంగ్రెస్ అని.. ఇప్పటికైనా ప్రజలు అసలు సిసలైన కాంగ్రెస్ గుర్తించి హస్తం గుర్తుకు ఓటేయాలని ఆయన విజ్నప్తి చేశారు. తమ న్యాయ పరమైన డిమాండ్ల కోసం సమ్మె బాట పట్టిన వారికి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.


*8,9 తేదీల్లో మాణిక్కం ఠాకూర్ పర్యటన*


ఏపీకి కొత్త ఇన్ఛార్జ్ గా నియమితులైన మాణిక్కం ఠాకూర్ జనవరి 8,9 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారని పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు. ఆ రెండు రోజులు విజయవాడలో మండల అధ్యక్షుల నుంచి కార్యనిర్వహక అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లా, నగర అధ్యక్షులు ఇతర పీసీసీ కార్యవర్గ సభ్యులు, ఏఐసీసీ సభ్యులు అందరూ ఓరియంటేషన్ లో పాల్గొని ఎన్నికలకు సమాయత్తం అవుతారని వెల్లడించారు. జనవరి 4వ తేదీన అందరు పీసీసీ అధ్యక్షులతో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో ఢిల్లీలో సమావేశం ఉంటుందని తెలిపారు. ఈ నెల 28వ తేది కాంగ్రెస్ పార్టీ 139వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నాగ్ పూర్ లో కార్యక్రమం నిర్వహించామని, సేవాదళ్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈనెల 29 వతేదీ కాకినాడలో కార్యక్రమం నిర్వహించామని ఆయన తెలిపారు. అదే విధంగా డిసెంబర్ 31వ తేది మాజీ మంత్రి జేడీ శీలం ఆధ్వర్యంలో క్రిష్టియన్లు, దళిత క్రిష్టియన్లకు చెందిన 15 సంస్థలతో విజయవాడలో సమావేశం అవుతున్నామని వివరించారు. పార్టీ బలోపేతానికి, పూర్వ వైభవానికి అన్ని విధాలా క్రుషి చేస్తున్నామన్నారు.


*షర్మిల త్వరలోనే పార్టీలోకి వస్తారు*


తనకున్న సమాచారం మేరకు త్వరలోనే వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు. షర్మిలతో పాటు పార్టీలోకి ఎవరు వచ్చినా తప్పక ఆహ్వానిస్తామని చెప్పారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని కూడా త్వరలోనే కలుస్తానని అన్నారు. తనకు పలువురు ఎమ్మెల్యేలు, మాజీలు, ఎమ్మెల్సీలు టచ్ లో ఉన్నారని స్పష్టం చేసిన పీసీసీ అధ్యక్షులు, ‎ఏఐసీసీ పెద్దలు, పార్టీ హైకమాండ్ తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా నడుచుకుంటామని పేర్కొన్నారు. ఇప్పటికే సీపీఐ నారాయణతో మాట్లాడామన్న ఆయన, భావ సారుప్యత కలిగిన పార్టీలు, సంస్థలు, వ్యక్తులతో కలిసి ముందుకు వెళ్తామని తెలిపారు. అదే విధంగా డీకే శివకుమార్, మాజీ సీఎం చంద్రబాబు మధ్య జరిగినవి రాజకీయ సంబంధిత చర్చలే అయి ఉంటాయని, ఏదేమైనా సెక్యులర్ పార్టీలతో ముందుకు వెళ్లాలా.. మతోన్మాద పార్టీల కొమ్ము కాయాలా అనేది... చంద్రబాబు, జగన్ లే నిర్ణయించుకోవాలని ఒక ప్రశ‌్నకు సమాధానంగా చెప్పారు. పీసీసీ జనరల్ సెక్రటరీ బైపూడి నాగేశ్వరావు అచ్చు వేయించిన...  139 సంవత్సరాల కాంగ్రెస్ చరిత్రలో.. పార్టీకి సేవలందించిన ఏఐసీసీ అధ్యక్షులు చిత్ర మాలికను పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు ఆవిష్కరించారు. కార్యక్రమంలో కార్యనిర్వహక అధ్యక్షులు సుంకర పద్మశ్రీ, ఉపాధ్యక్షులు మీసాల రాజేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిలు మేడా సురేష్, షేక్ నాగూర్, విజయవాడ నగర అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు, ఎన్టీఆర్ జిల్లా అధ‌్యక్షులు బుర్రా కిరణ్ తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.

Comments