తుపాను బాధిత రైతులకు పెట్టుబడిలో సగం పరిహారం అందించాలి: ప్రత్తిపాటి.

 *తుపాను బాధిత రైతులకు పెట్టుబడిలో సగం పరిహారం అందించాలి: ప్రత్తిపాటి


*


*తుపానుకు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన ప్రత్తిపాటి*

చిలకలూరిపేట (ప్రజా అమరావతి);

మిగ్‌జాం తుపాను ధాటికి సర్వం కోల్పోయిన రైతన్నలకు పెట్టుబడిలో సగమైన పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు. ఎకరాకు సగటున 40వేల నుంచి 50వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టి నష్టపోయిన రైతులకు అందులో సగమైన ఉపశమనం అందిస్తే తప్ప మళ్లీ కోలుకునే పరిస్థితి లేదన్నారు. రుణమాఫీ చేసే అవకాశాన్ని కూడా పరిశీలించాలని సూచించారు. నోటికాడికి వచ్చిన పంట నీటిపాలైందని.. ఇప్పుడు ప్రభుత్వం ఆదుకోక పోతే ఆత్మహత్యలే దిక్కనే  నిర్వేదంలో రైతులు ఉన్నారన్నారు. ముందస్తు హెచ్చరికలు, నష్ట నివారణ చర్యలు విషయంలో ప్రభుత్వ వైఫల్యంతోనే భారీగా పంట నష్టం వాటిల్లిందని ఆరోపించారు. నేలకొరిగిన పంటల్ని చూసి రైతులంతా కన్నీరుమున్నీరు అవుతుంటే సీఎం జగన్‌ ఉలుకుపలుకు లేకుండా తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చొని అధికారులకు ఆదేశాలిచ్చి చేతులు దులిపేసుకున్నారని మండిపడ్డారు. నాదెండ్ల మండలం చిరుమామిళ్ల, యడ్లపాడు మండలం లింగారావుపాలెం, గణేశునివారిపాలెం, సందెపూడి, తుర్లపాడు, చిలకలూరిపేట గ్రామీణ మండలం వేలూరు, కుక్కపల్లివారిపాలెంలో పర్యటించిన ప్రత్తిపాటి స్థానిక తెదేపా, జన సేన నాయకులతో కలసి దెబ్బతిన్న వరి, పొగాకు, శనగ, మిరప, పత్తి, మినుము తదితర పంటలను పరిశీలించారు. రైతులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం వేలూరులో మీడియాతో మాట్లాడిన ప్రత్తిపాటి తుపానుతో విపరీతమైన వర్షం, గాలులకు వ్యవసాయ, ఉద్యాన పంటలు బాగా దెబ్బ తిన్నాయ్నారు. కర్షకులు ఇంతకష్టాల్లో ఉంటే వారిని పలకరించి భరోసా కల్పించాల్సిన బాధ్యత మంత్రులు, స్థానిక శాసనసభ్యులపై లేదా అని ప్రశ్నించారు. జిల్లాలో మొత్తం అధికార పార్టీకి చెందిన శాసనసభ్యులే ఉన్నారని.. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఇప్పుడు వారంతా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఎప్పుడు ఏ ఆపద వచ్చినా ఆదుకునే వారన్నారు. ఈ-క్రాప్ నమోదు అంటూ జగన్‌రెడ్డి రైతులను నమ్మించాడని.. ఎన్ని ఎకరాలు ఈ-క్రాప్ బుకింగ్ చేశారు.. ఎకరానికి ఎంత నష్ట పరిహారం ఇస్తారనే ప్రకటన ఇంతవరకూ ప్రభుత్వం నుంచి లేదన్నారు. స్థానిక అవినీతి మంత్రి ఎక్కడో ఉన్నారో కూడా తెలియని పరిస్థితి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిలకలూరిపేట నియోజకవర్గంతో పాటు ఉమ్మడి గుంటూరు జిల్లాలో నెలకొన్న పరిస్థితులను సీఎం దృష్టికి తీసుకెళ్దామన్న ఆలోచన కూడా ఆమె చేయలేదన్నారు.  రజిని పుణ్యమా అని ఆరోగ్యశాఖ కాస్తా అనారోగ్యశాఖగా మారిందని ఎద్దేవా చేశారు. జ్వరాలు ప్రబలి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. నాదెండ్ల మండలం కనపర్రులో సగంమందికి డెంగీ జ్వరాలు సోకాయని... అయినా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. రైతులతో పాటు ఇళ్లు కోల్పోయి నిరుపేదలకు తక్షణం పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు ప్రత్తిపాటి. డబ్బులు దోచుకోవడానికి రజినికి ప్రజలు ఓట్లు వేయలేదని.. ఇప్పటికే చాలా దోచేశారని, చిలకలూరిపేటలో గెలిచే పరిస్థితిలో లేదని తెలిసే మరో నియోజకవర్గ వెతుకులాటలో ఉన్నారని ఎద్దేవా చేశారు. రైతులను ఆదుకోలేని ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు.


*జనసేన నేత తోట రాజా రమేశ్*

రాష్ట్రంలో రైతులను చూస్తుంటే గుండె తరుక్కుపోతుందని చిలకలూరిపేట నియోజకవర్గ జనసేన సమన్వయకర్త తోట రాజా రమేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల కష్టాలను చూస్తే కన్నీళ్లు వస్తున్నాయని పేర్కొన్నారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా సహాయక చర్యలు చేపట్టాలని జనసేన తరఫున డిమాండ్ చేసినట్లు తెలిపారు. కానీ అధికారులు ఎక్కడా సహాయక కేంద్రాలు ఏర్పాటు చేసిన దాఖలాలు లేవన్నారు. పరిపాలన చేతగాని, అవగాహన లేని సీఎం, మంత్రులను ప్రజలు ఎన్నుకోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని అన్నారు. తుపాను ప్రభావంతో అన్ని రకాల పంటలు దెబ్బతిని ఒక్కో రైతు రూ.లక్షల్లో నష్టపోయారని వ్యాఖ్యానించారు. తుపాను ప్రభావంతో గత మూడ్రోజులుగా కురిసిన వర్షాలతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే స్థానిక మంత్రి రజిని కనీసం పరామర్శించకుండా అందుబాటులో లేకుండా పోయారని విమర్శించారు.ఈ క్రమంలో చిలకలూరిపేట నియోజకవర్గం సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు గారు, రాష్ట్ర పార్టీ నాయకులు షేక్ కరీముల్లా గారు, పార్టీ సీనియర్ నాయకులు  జగన్నాథ రెడ్డి గారు, పార్లమెంట్ రైతు అధ్యక్షులు మద్దూరి వీరారెడ్డి గారు, నాదెండ్ల మండలం అధ్యక్షులు బండారుపల్లి సత్యనారాయణ గారు, చిలకలూరిపేట రూరల్ మండలం అధ్యక్షులు జువాజీ మదన్ మోహన్ గారు, ఎడ్లపాడు మండలం అధ్యక్షులు కామినేని సాయిబాబు గారు, నియోజకవర్గ రైతు అధ్యక్షులు అంబటి సోంబాబు గారు, రాష్ట్ర రైతు నాయకులు గుర్రం నాగ పూర్ణచంద్రరావు గారు, మద్దినీడు శివరామకృష్ణ గారు, కట్టా వేణు గారు పలువురు నాయకులు విచ్చేశారు.

Comments