అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేసి భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల‌ను విజ‌య‌వంతం చేయండి* - ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు


ఎన్‌టీఆర్ జిల్లా, డిసెంబ‌ర్ 01 (ప్రజా అమరావతి);


*అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేసి భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల‌ను విజ‌య‌వంతం చేయండి*

- ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు- జ‌న‌వ‌రి 3 నుంచి ఏడో తేదీ వ‌ర‌కు భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌లు

- రోజూ 50 వేల నుంచి ల‌క్ష మంది భ‌క్తులు వ‌చ్చేందుకు అవ‌కాశం

- చివ‌రి రెండురోజుల్లో ల‌క్ష నుంచి 1.50 ల‌క్ష‌ల మంది వ‌చ్చే అవ‌కాశం

- డిసెంబ‌ర్ 26న క‌ల‌శ‌జ్యోతి మ‌హోత్స‌వం నిర్వ‌హ‌ణ‌

- క‌లెక్ట‌ర్ డిల్లీరావు వెల్ల‌డి


అధికారులు స‌మ‌న్వ‌యంతో వ్య‌వ‌హ‌రిస్తూ బృంద స్ఫూర్తితో భవానీ భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఆధ్యాత్మిక వాతావ‌ర‌ణంలో భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌లను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో భవానీ దీక్షా విరమణల‌కు చేప‌ట్టాల్సిన ఏర్పాట్లపై శుక్ర‌వారం దేవాదాయ, రెవెన్యూ, పోలీస్, వైద్య, ఆరోగ్య, అగ్నిమాపక, నగరపాలక సంస్థ, విద్యుత్, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ, మత్స్యశాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ న‌వంబ‌ర్ 23 నుంచి 27 వ‌ర‌కు అమ్మ‌వారి మండ‌ల దీక్ష‌లు, అదేవిధంగా డిసెంబ‌ర్ 13 నుంచి 17వ తేదీ వ‌ర‌కు అర్ధ‌మండ‌ల దీక్ష‌లు భ‌క్తులు తీసుకుంటార‌ని వివ‌రించారు. జ‌న‌వ‌రి 3 నుంచి 7వ తేదీ వ‌ర‌కు అయిదు రోజుల పాటు భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌లు ఉంటాయ‌ని.. రోజుకు సుమారు 50 వేల నుంచి లక్షలోపు భవానీ భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారన్నారు. చివ‌రి రెండు రోజుల్లో దాదాపు ల‌క్ష నుంచి ల‌క్షా 50 వేల మంది భవానీ భక్తులు రానున్న దృష్ట్యా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. 


డిసెంబ‌ర్ 26వ తేదీన సాయంత్రం 6.30 గంట‌ల నుంచి క‌ల‌శ‌జ్యోతి ఉత్స‌వం జ‌రుగుతుంద‌ని.. ఈ ఉత్స‌వానికి దాదాపు 10 వేల మంది జ్యోతులు తీసుకొని ఆల‌యానికి చేరుకునే అవ‌కాశ‌మున్నందున త‌గిన ఏర్పాట్లు చేయాల‌ని సూచించారు. ద‌స‌రా ఉత్సవాలలోను విజయవంతం చేసిన తరహాలో భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల కార్య‌క్ర‌మాన్ని కూడా విజ‌య‌వంతం చేసేందుకు ఏర్పాట్లు చేయాల‌న్నారు. క్యూ మార్గంలో వాటర్ ఫ్రూప్ షామియానాలు, కోయిర్ మ్యాట్లు, తాత్కాలిక విద్యుత్ అలంకరణ, తాగునీరు త‌దిత‌ర ఏర్పాట్లు చేయాల‌న్నారు. పబ్లిక్ అడ్రసింగ్ సిస్టం ద్వారా భక్తులకు నిరంతరం సూచనలు అందించాలన్నారు. అధిక సంఖ్య‌లో తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలన్నారు. ఆల‌యం చుట్టుప‌క్క‌ల మాత్ర‌మే కాకుండా న‌గ‌రానికి వ‌చ్చే వివిధ ర‌హ‌దారుల వెంబ‌డి వైద్య శిబిరాల‌తో పాటు విశ్రాంతి ప్రాంగ‌ణాల‌ను ఏర్పాటు చేయాల‌ని సూచించారు. భ‌క్తుల‌కు అవ‌స‌రం మేర‌కు బ‌స్సుల‌ను సిద్ధంగా ఉంచుకోవాల‌న్నారు. ఘాట్‌ల వ‌ద్ద స్నానానికి, గిరిప్ర‌దక్షిణ‌, అమ్మవారి దర్శనం, హోమ గుండం ఏర్పాట్లు, ఇరుముళ్ల విరమరణ, ల‌డ్డూ ప్రసాదం పంపిణీ, అన్న‌ప్ర‌సాదం పంపిణీ త‌దిత‌రాల‌కు ఏర్పాట్లు చేయాల‌న్నారు. ఎర్ర వ‌స్త్రాలు వ‌దిలే ప్రాంతంలో ప్ర‌త్యేక పాయింట్లు ఏర్పాటుచేయాల‌న్నారు. పోలీసు శాఖ‌తో స‌మ‌న్వ‌యం చేసుకొని ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాట్లు చేయాల‌ని.. ముఖ్య‌మైన ప్రాంతాల్లో 255 సీసీటీవీల‌ను ఏర్పాటు చేయాల‌న్నారు. విభిన్న ప్ర‌తిభావంతుల సౌక‌ర్యార్థం ప్ర‌త్యేక ఏర్పాట్లు చేయాల‌న్నారు. పారిశుద్ధ్యానికి సంబంధించి ప్ర‌త్యేక టీమ్‌ల‌ను సిద్ధం చేసి.. ఎప్ప‌టిక‌ప్పుడు పారిశుద్ధ్యానికి చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. ఇండియ‌న్ రెడ్‌క్రాస్‌తో పాటు సేవాద‌రుల స‌ర్వీసుల‌ను ఉప‌యోగించుకొని కార్య‌క్ర‌మం స‌జావుగా జ‌రిగేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ డిల్లీరావు సూచించారు. 


*భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల‌కు ప్ర‌ణాళికాయుత ఏర్పాట్లు: ఆల‌య ఈవో కేఎస్ రామ‌రావు*

ద‌స‌రా ఉత్స‌వాల త‌ర‌హాలోనే భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల‌ను విజ‌య‌వంతం చేసేందుకు ప్ర‌ణాళికాయుత ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు శ్రీ దుర్గామ‌ల్లేశ్వ‌ర స్వామివార్ల దేవ‌స్థానం ఈవో కేఎస్ రామ‌రావు తెలిపారు. తొలుత ఈవో స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశంలో దీక్షా విర‌మ‌ణ‌ల‌కు చేస్తున్న ఏర్పాట్ల‌ను ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్ ద్వారా వివ‌రించారు. అనంత‌రం మాట్లాడుతూ మొత్తం మూడు హోమ గుండాలు ఏర్పాటు చేయ‌నున్నామ‌ని.. అదే విధంగా సీత‌మ్మ‌వారి పాదాలు, పున్న‌మి ఘాట్‌, భ‌వానీ ఘాట్ వ‌ద్ద మొత్తం 800 వ‌ర‌కు ష‌వ‌ర్లు ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. గ‌త అన‌భ‌వాల‌ను దృష్టిలో ఉంచుకొని ల‌డ్డూ ప్ర‌సాదానికి కొర‌త లేకుండా ఈసారి ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు ఈవో రామ‌రావు వెల్ల‌డించారు. ఆద్యంతం ఆధ్యాత్మిక వాతావ‌ర‌ణంలో దీక్షా విర‌మ‌ణ‌లు జ‌రిగేలా వివిధ శాఖ‌ల అధికారుల‌తో స‌మ‌న్వయం చేసుకోనున్న‌ట్లు తెలిపారు.

స‌మావేశంలో జాయింట్ క‌లెక్ట‌ర్ డా. పి.సంప‌త్‌కుమార్‌, స‌బ్ క‌లెక్ట‌ర్ అదితిసింగ్‌, ఆల‌య ఈఈలు కోటేశ్వ‌ర‌రావు, ఎల్‌.ర‌మ‌, ఏఈవోలు పి.చంద్ర‌శేఖ‌ర్‌, ఎన్‌.ర‌మేష్‌, పి.సుధాక‌ర్‌, జంగం శ్రీనివాస్‌, సూప‌రింటెండెంట్లు వై.హేమ‌దుర్గ‌, ఇరిగేష‌న్ ఈఈ కృష్ణారావు, మ‌త్స్య‌శాఖ ఏడీ చ‌క్రాణి త‌దిత‌రుల‌తో పాటు విజ‌య‌వాడ మునిసిప‌ల్ కార్పొరేష‌న్, పోలీస్ త‌దిత‌ర శాఖ‌ల అధికారులు పాల్గొన్నారు.


Comments