ఆర్టీసీ హౌస్ లో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములుకి నివాళులు.

 విజయవాడ (ప్రజా అమరావతి);ఆర్టీసీ హౌస్ లో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములుకి నివాళులు


ఆర్టీసీ ప్రధాన కార్యాలయం ఆర్టీసీ హౌస్ లో ఈ రోజు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి సంస్థ ఎం.డి. శ్రీ సిహెచ్. ద్వారకా తిరుమల రావు, ఐ.పి.ఎస్ పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి శ్రీ పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.  

సంస్థ డిప్యూటీ సి. పి. ఎం. (ఏ) శ్రీ జయశంకర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ  అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు రాష్ట్ర అవతరణ కోసం చేసిన కృషిని వివరించారు.  

సంస్థ ఎం.డి. శ్రీ సిహెచ్. ద్వారకా తిరుమల రావు, ఐ.పి.ఎస్. మాట్లాడుతూ, ఈ రోజు ధన్యజీవి శ్రీ శ్రీరాములు గారి వర్ధంతి అధికారికంగా జరుపుకుంటున్నామని తెలిపారు. 

దేశం కోసం ఎందరో దేశభక్తులు స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారని, అదే విధంగా పరాయి రాష్ట్ర పాలన నుండి తెలుగు వారికి ప్రత్యేకంగా ఒక రాష్ట్రం కావాలని పోరాటం జరిపిన మహనీయుడు శ్రీ పొట్టి శ్రీరాములు అని వ్యాఖ్యానించారు. అహింసా, సత్యం అనే నినాదంతో పిలుపునిచ్చిన గాంధీ గారి బాటలో నడిచి నిరాహార దీక్షతో అందర్నీ కదిలించి, ఆంధ్ర రాష్ట్ర అవతరణకు బీజం వేసిన గొప్ప నాయకుడు శ్రీ పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. 

మద్రాసులో విద్యాభ్యాసం పూర్తి చేసిన శ్రీ పొట్టి శ్రీరాములు రైల్వే ఉద్యోగాన్ని సైతం విడిచి సబర్మతి ఆశ్రమంలో చేరారని, 1942 సంవత్సరంలో సత్యాగ్రహం, 'క్విట్ ఇండియా' ఉద్యమాల్లో పాల్గొని జైలు శిక్షను సైతం  అనుభవించారని తెలిపారు. ఏనాడూ ఆయన పదవులకోసం, కీర్తి ప్రతిష్ఠల కోసం పోరాడలేదని పేర్కొన్నారు.  మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రాంతం పట్ల వివక్ష చూపిస్తుందని ద్వజమెత్తి, మద్రాసు నగరంపై ఆంధ్రులకు కూడా హక్కు ఉన్నదని భావించి పోరాటం చేసారన్నారు. 1952 అక్టోబరు 19వ తేదీన నిరాహారదీక్షకు పూనుకుని చివరకు 1952 డిసెంబర్ 15వ తేదీన ప్రాణత్యాగం చేశారని తెలిపారు. ఆయన మరణానంతరం కేవలం 5 రోజులకే ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు అంగీకారం జరిగిందని, ఆయన త్యాగాన్ని స్మరించుకోవడం అందరి బాధ్యత అని తెలిపారు. ఆయన త్యాగ ఫలానికి నిదర్శనంగా నెల్లూరు జిల్లాకు ఆయన పేరు పెట్టడం కూడా జరిగిందన్నారు. భాషా ప్రయుక్త  రాష్ట్రాలు ఏర్పడడానికి ఆయన నాంది పలికారని, ఆయన పోరాట స్పూర్తి అందరికీ ఆదర్శంగా నిలిచిందన్నారు. 

ఈ కార్యక్రమంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఏ) శ్రీ కే.ఎస్.బ్రహ్మానంద రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఓ) శ్రీ కోటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈ) శ్రీ పి. కృష్ణ మోహన్,  ఎఫ్.ఏ & సి.ఏ.ఓ. శ్రీ రాఘవ రెడ్డి, విజిలెన్స్ (ఏ.డి.) శ్రీమతి శోభామంజరి, వివిధ అసోసియేషన్ల ప్రతినిధులు,  ఆర్టీసీ హౌస్ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. చివరగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ పర్సనల్ ఆఫీసర్ శ్రీ పి. వి. రమణ ధన్యవాదాలు  తెలిపారు. 

Comments