రైతులను అన్ని విధాల ఆదుకుంటాం.*రైతులను అన్ని విధాల ఆదుకుంటాం


*


*తేమశాతంతో సంబంధం లేకుండా ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకోవాలి*


*సబ్సిడీపై మినుము విత్తనాలు అందించాలి*


*అధికారులను ఆదేశించిన మంత్రి కారుమూరి*


పామర్రు, గూడూరు, మచిలీపట్నం, బంటుమిల్లి: డిసెంబర్ 6 (ప్రజా అమరావతి);


మిచౌంగ్ తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతాంగాన్ని అన్ని విధాల ఆదుకుంటామని, అధైర్య పడవద్దని రాష్ట్ర పౌర సరఫరాల మరియు వినియోగదారుల శాఖ మంత్రి  శ్రీ కారుమూరి వెంకట నాగేశ్వరరావు రైతులకు భరోసా నిచ్చారు.


బుధవారం మంత్రి పామర్రు, గుడూరు, బందరు, పెడన, బంటుమిల్లి మండలాల్లో పర్యటించి దెబ్బతిన్న వరి పొలాలు, ధాన్యం రాశులు  పరిశీలించి రైతులతో మాట్లాడి పంట నష్టం గురించి, రైతుల సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. 


తొలిత మంత్రి  పైడిముక్కల మండలం గోపవానిపాలెం, పామర్రు మండలం కొండిపర్రు రైతులను, అనంతరం గూడూరు మండలం తరకటూరు రైతులను, బందరు మండలం సుల్తానగరం, అరిసెపల్లి రైతులను బంటుమిల్లి మండలం ఆర్తమూరు, బాసిన పాడు రైతులను మంత్రి కలుసుకుని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆరబెట్టిన ధాన్యం రాశులు పరిశీలించారు.


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మిచోంగ్ తుఫాన్ అకాల వర్షాలకు పంట దెబ్బతిన్న రైతాంగానికి అండగా ఉంటామన్నారు. ఎన్యుమరేషన్ బృందాలు ప్రతి గ్రామంలో పర్యటించి పంట నష్టం వివరాలు నమోదు చేసుకుని, అంచనాలు రూపొందించి, రైతులకు పంటల భీమా, ఇన్పుట్ సబ్సిడీ ప్రయోజనాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు.


తేమశాతంతో సంబంధం లేకుండా రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.


రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు ఆన్ లైన్లో 1.37 లక్షల మెట్రిక్ టన్నులు, ఆఫ్ లైన్ లో 1.10 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని, ఇప్పటివరకు రైతులకు రు.1070 కోట్ల రూపాయలు చెల్లింపులు చేసినట్లు తెలిపారు. ధాన్యం విక్రయించిన రైతులకు వేగంగా చెల్లింపులు చేస్తామని, రెండు, మూడు రోజులకోసారి రైతులకు చెల్లింపులు చేసేలా చర్యలు తీసుకుంటామని, రవాణా, హమాలీ చార్జీలు సత్వరమే చెల్లించుటకు చర్యలు తీసుకుంటామన్నారు.


కౌలుదారి రైతులు సొసైటీల ద్వారా ధాన్యం విక్రయించాలని మంత్రి సూచించారు. అట్టి వారికి సొసైటీల ద్వారా చెల్లింపులు చేయడం జరుగుతుందన్నారు.


 అక్కడక్కడ మినుము పంట కూడా నీట మునిగి దెబ్బతిన్నదనీ ఆదుకోవాలని రైతులు మంత్రిని కోరగా, సబ్సిడీపై మినుము విత్తనాలు మళ్లీ రైతులకు అందించుటకు చర్యలు

 తీసుకుంటామన్నారు.


ఈ పర్యటనలో తరకటూరు వద్ద గూడూరు ఎంపీపీ సంఘ మధుసూదన్ రావు, జడ్పిటిసి వేముల సురేష్ రంగబాబు మంత్రిని కలిసి రైతుల సమస్యలు వివరించారు.


ఉయ్యూరు ఆర్డిఓ, జిల్లా పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఇంచార్జ్ రాజు,  డీఎస్ఓ పార్వతి, ఆయా మండలాల తాసిల్దార్లు రెవెన్యూ సిబ్బంది మంత్రి వెంట ఉన్నారు.

Comments