తుఫానును సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు పూర్తి సన్నద్ధంగా ఉన్నాం కేబినెట్ కార్యదర్శికి వివరించిన సిఎస్.

 తుఫానును సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు పూర్తి సన్నద్ధంగా ఉన్నాం కేబినెట్ కార్యదర్శికి వివరించిన సిఎస్.



విజయవాడ,1డిశంబరు (ప్రజా అమరావతి): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారనున్న ఉందని దానిని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని ముందు జాగ్రత్తలతో పూర్తి సన్నద్ధంగా ఉన్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డి  కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబకు వివరించారు.తుఫాను కారణంగా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై శుక్రవారం ఢిల్లీ నుండి కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ ఒడిషా, ఎపి,తమిళనాడు,పుదుచ్చేరి రాష్ట్రాల సిఎస్ లతో వీడియో సమావేశం నిర్వహించారు.

విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి ఈ వీడియో సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర,జిల్లా స్థాయిల్లో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేశామని,ఇప్పటికే జిల్లా కలెక్టర్లను పూర్తి అప్రమత్తం చేశామన్నారు. వాతావరణ శాఖ అంచనా ప్రకారం అల్పపీడనం తుపానుగా మారనుందని దాని ప్రభావంతో రానున్న రెండు మూడు రోజుల్లో దక్షిణ కోస్తా ఆంధ్ర జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు,మిగతా కోస్తా జిల్లాల్లో ఒక మాదిరి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.4వ తేదీ సోమవారం చెన్నై- మచిలీపట్నంల మధ్య తుఫాను తీరాన్ని తాకే అవకాశం ఉందని ఆసమయంలో 80 నుండి 100 కి.మీల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అన్నారు.


తుఫాను కారణంగా శనివారం ఉదయం నుండి మత్స్య కారులు ఎవరూ సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని ఇప్పటికే హెచ్చరించామని సిఎస్ జవహర్ రెడ్డి చెప్పారు. తుఫాను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా 2 ఎన్డీఆర్ఎఫ్,6 ఎస్డిఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచామని కేబినెట్ కార్యదర్శికి సిఎస్ వివరించారు.


అదే విధంగా పౌరసరఫరాల విభాగం ద్వారా వివిధ నిత్యావసర సరుకులను పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచామని అన్నారు.నీటి పారుదల,ఆర్ అండ్బి, పంచాయితీ రాజ్ శాఖలను పూర్తిగా అప్రమత్తం చేసి బలహీనంగా ఉన్న వివిధ ఏటి గట్లు,వంతెనలు తదితర ప్రాంతాల్లో ప్రత్యేక ముందుస్తు చర్యలు తీసుకోవాల్సిందిగా ఇప్పటికే ఆయా అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. అలాగే రక్షిత మంచినీటి సరఫరా,విద్యుత్,టెలికం, మున్సిపల్,వైద్య ఆరోగ్య తదితర శాఖల అధికారులను కూడా పూర్తిగా అప్రమత్తం చేశామని చెప్పారు.తుఫాను ప్రభావంతో ఎలాంటి పరిస్థితులు తలెత్తినా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా పూర్తి సన్నధ్ధతతో ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.జవహర్ రెడ్డి కేబినెట్ కార్యదర్శికి వివరించారు.


ఈవీడియో సమావేశంలో కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ మాట్లాడుతూ తుఫాను వల్ల ప్రాణ,ఆస్థి నష్టాలను కనిష్ఠ స్థాయికి తెచ్చేందుకు పూర్తి అప్రమత్తంగా ఉండాలని నాలుగు రాష్ట్రాల సిఎస్ లకు సూచించారు.ఎన్డిఆర్ఎఫ్,కోస్టు గార్డు,నేవీ ఎయిర్ ఫోర్స్, టెలికం తదితర కేంద్ర ప్రభుత్వ శాఖలు ఏజెన్సీలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయంతో ఉండి వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ఆయన ఆదేశించారు.


ఈ వీడియో సమావేశంలో డిజిపి కె.వి.రాజేంద్రనాధ్ రెడ్డి, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మరియు సిసిఎల్ఏ జి.సాయి ప్రసాద్,అదనపు డిజి శాంతి భద్రతలు ఎస్.బాగ్చి, ఎస్ఇబి డైరెక్టర్ రవి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.


కాగా 1వతెదీ ఉదయం నాటికి రాష్ట్రం లోని ఎస్పిఎస్ నెల్లూరు జిల్లాలోని ఇందుకూరు పేటలో 76.2 మీ.మీలు,నెల్లూరు అర్బన్ 66.4మి.మీలు,కోవూరు 60, నెల్లూరు గ్రామీణం 57.8, పొదలకూరు 46.8,దగదర్తి 46.4,తోటపల్లి గూడూరులో 42.8 మీ.మీల వర్షపాతం నమోదైంది.అదే విధంగా తిరుపతి జిల్లా బుచ్చినాయుడు ఖండ్రిగలో 54.8,సూళ్లూరుపేటలో 53.8, నాగలపురం మండలంలో 45.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.



Comments