బీసీ నాయకత్వాన్ని తయారు చేసే ఫ్యాక్టరీ టీడీపీ.



*బీసీ నాయకత్వాన్ని తయారు చేసే ఫ్యాక్టరీ టీడీపీ


*


*జగన్ పాలనలో బాగుపడింది ఆ నలుగురు రెడ్లే*


*జీఎస్డీపీని మించి రాష్ట్రంలో అప్పులు*


*వైసీపీ ప్రభుత్వంలో లబ్ధిపొందింది జగన్ కంపెనీలే*


*పన్నుల రూపంలో రక్తం తాగుతున్న సీఎం జగన్* 


*జయహో బీసీ వర్క్ షాప్ లో చంద్రబాబు నాయుడు*


*జయహో బీసీ ప్రచార రథాలు ప్రారంభించిన టీడీపీ అధినేత*


అమరావతి (ప్రజా అమరావతి):-‘‘బీసీ నాయకత్వాన్ని తయారు చేసిన ఫ్యాక్టరీ, యూనివర్సిటీ టీడీపీ. ఎమ్మెల్యేలు, ఎంపీలుగా దీర్ఘకాలిక నాయకత్వాన్ని టీడీపీ తయారు చేసింది. వెనకబడిన వర్గాలను పైకి తీసుకురావడమే నా లక్ష్యం. ఉన్నత స్థాయిలో ఉండే ప్రతి వందమందిలో యాభైమంది బీసీలే ఉండేలా చేసే బాధ్యత నాది’’ అని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జయహో బీసీ కార్యక్రమంలో చంద్రబాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ...‘‘పన్నుల రూపంలో జగన్ బలహీన వర్గాల రక్తం తాగుతున్నాడు. జీఎస్డీపీని మించి అప్పులు చేస్తున్నాడు. రూ.13 లక్షల కోట్ల అప్పులు చేశాడు. ఈ అప్పులు జగన్ తీరుస్తాడా.? ఈ అప్పులన్నీ మనమే కట్టాలి. జనాభాలో 50 శాతం బలహీన వర్గాలే ఉన్నాయి కాబట్టి రూ.6.5 లక్షల కోట్లు బీసీలే కట్టాలి. బీసీలకు న్యాయం చేయకపోవడమే కాకుండా చేసిన అప్పులో 50 శాతం బీసీల నెత్తిన పెట్టాడు. నాకు గుర్తింపు వచ్చింది వెనకబడిన వర్గాలతోనే. నన్ను నమ్మి, కష్టాల్లో అండగా నిలిచి స్ఫూర్తినిచ్చిన బీసీలను జీవితంలో మర్చిపోలేను. జగన్ పాలనలో రెడ్లు కూడా బాగుపడలేదు. నలుగురు రెడ్లే బాగుపడ్డారు. పెద్దిరెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి మాత్రమే బాగుపడ్డారు. వీరు బాగుపడితే రాష్ట్రంలోని రెడ్లంతా బాగుపడినట్లేనా. రైతులుగా ఉన్న రెడ్లు తీవ్రంగా నష్టపోయారు. రెడ్డి సామాజికవర్గంలోనూ వ్యాపారులు, కాంట్రాక్టులు నష్టపోయారు.

*వైసీపీ ప్రభుత్వంలో లబ్ధిపొందింది జగన్ కంపెనీలే*

అబద్ధాలు చెప్పడంలో జగన్ దిట్ట. తాను చెప్పింది ఎదుటివాళ్లు నమ్మాలనే ఉద్దేశంతోనే జగన్ కళ్లు ఆర్పుతూ అబద్ధాలు చెప్తుంటాడు. వైసీపీ ప్రభుత్వంలో లబ్ధిపొందింది జగన్ కంపెనీలు మాత్రమే. సాక్షి పత్రిక, టీవీ మాత్రమే బాగుపడ్డాయి తప్ప..ఎవరూ బాగుపడలేదు. ఈ ప్రభుత్వంలో బీసీలు బాగు పడిన దాఖలాలు లేవు. పేదలను ఆర్థికంగా చిదిమేశాడు. ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. బుద్ధి, జ్ణానం లేకుండా విద్యుత్ ఛార్జీలు పెంచాడు. చెత్తపైన చెత్తపన్ను వేసిన చెత్త సీఎం జగన్ మాత్రమే. జగన్ పనైపోయింది..మళ్లీ గెలిచే అవకాశం లేదు. రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలి..తెలుగుజాతికి పూర్వ వైభవం రావాలి. నేను అవకాశం ఇస్తాను..నాయకులుగా తయారు కావాల్సిన బాధ్యత మీది. జనాభాలో 50 శాతం బీసీలు ఉన్నారు. బీసీలకు రాజకీయ ప్రాధాన్యత, ఆర్థిక వెసులు బాటు లేదని గుర్తించి న్యాయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్, టీడీపీ మాత్రమే. బీసీలను ఎన్టీఆర్ వెన్నుతట్టి లేపారు. మీ కష్టాలు అర్థం చేసుకుని ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టిన మహానాయకుడు ఎన్టీఆర్. బీసీలను రాజకీయ చైతన్యం పరచడంతో పాటు ప్రాధాన్యత కూడా ఇచ్చారు. ఈ వేదికపై నా పక్కన బీసీలు కూర్చున్నట్లుగా వైసీపీలో బీసీలు కనబడతారా.? 

*జయహో బీసీ చారిత్రాత్మకం*

జయహో బీసీ ద్వారా ఒక చారిత్రామ్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. చరిత్ర తిరిగి రాయడానికే మనమంతా ఇక్కడ సమావేశమయ్యాం. 40 రోజుల్లో ప్రజల్లో ఉండి ఏయే కార్యక్రమాలు చేయాలో నిర్ణయించి చైతన్యం తీసుకురావాలి. బీసీలకు లేని నైపుణ్యం ఏంటి..లేని నాయకత్వం ఏంటి.? ఏ పనైనా చేయగలిగేది మా బీసీలే. ఒక మనిషి అందంగా ఉండాలంటే బట్టలు శుభ్రంగా ఉతికేది, హెయిర్ కటింగ్ చేసేది కూడా బీసీలే. దేవుడు ఎలా ఉన్నాడో చూడాలన్నా చేసి చూపించేది బీసీ శిల్పులే. ఉండటానికి ఇళ్లు కట్టేది కూడా బీసీలే. పెళ్లి జరగాలంటే ముందు గుర్తువచ్చేది స్వర్ణ కారుడు. మంగళసూత్రానికి ఆర్డర్ పెట్టిన తర్వాతే పెళ్లి పనులు ప్రారంభమవుతాయి. వైసీపీలో నాయకుని ఎదగనివ్వరు..చెడుపని చేయించి నాయకున్ని చెడగొట్టి బానిసత్వం చేయిస్తున్నారు. 

*రిజర్వేషన్ల కోతతో బీసీలకు అన్యాయం*

స్థానిక సంస్థల్లో బీసీలకు 20 శాతం రిజర్వేషన్లు ఎన్టీఆర్ ప్రవేశపెడితే దాన్ని 34 శాతానికి నేను పెంచాను..లక్షల మందిని నాయకులుగా తయారు చేశాం. నాయకుడిగా ఒక అవకాశం కల్పిస్తేనే తన ప్రతిభను చూపించుకునే అవకాశం వస్తుంది. అవకాశం రాకపోతే ఏ వ్యక్తి కూడా నాయకుడిగా చెలామని అవ్వలేడు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక 34 శాతం ఉన్న రిజర్వేషన్లు 24 శాతానికి తగ్గించింది..దీంతో 16,500 మంది మంది పదవులు కోల్పోయారు. వెనకబడిన వర్గాలను దేశంలో పైకి తీసుకురావడానికి ఆలోచించింది పూలే అయితే..దాన్ని ఆచరించిన వ్యక్తి ఎన్టీఆర్. నేనొచ్చాక బీసీలను ఆర్థికంగా ఏ విధంగా పైకి తీసుకురావాలో ఆలోచించాను. వడ్డెరలకు ఎన్టీఆర్ క్వారీలను కేటాయించారు. రజకుల కోసం ప్రత్యేకంగా దోబీఘాట్లు కట్టించి ఆధునీకరణకు నాంది పలికాం. 

*ఆదరణ పథకంతో బీసీలకు చేయూత*

బీసీలకు చేయూతనిచ్చేందుకుసమైక్యాంధ్రలోనే ఆదరణ పథకం ప్రవేశపెట్టాం. ఆధునిక పనిముట్లు అందించాం..వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి లక్షల మందికి 90 శాతం సబ్సీడీతో పరికరాలు అందించాం. 5 లక్షల మందికి బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందించాం. కానీ నాలుగున్నరేళ్లలో బీసీలకు ఒక్క రూపాయి అయినా ఈ ప్రభుత్వం మీకు ఇచ్చిందా.? వైఎస్ రాజశేఖర్ రెడ్డికి కూడా నేను సవాల్ చేసేవాన్ని..కార్పొరేషన్ చైర్మన్ కు కుర్చీ కూడా లేకుండా చేసి ఏం చేశారని ప్రశ్నించేవాన్ని. రాష్ట్రంలోని 125 కులాలకు ఆర్థిక సాయం చేసింది టీడీపీనే. బీసీలకు వృత్తుల వారీగా ఇవ్వాలనుకుని తెచ్చిన పరికరాలను ఈ ప్రభుత్వం గోడౌన్లలో తుప్పపట్టిస్తోంది. ఆదరణ పనిముట్లు మీకు ఇవ్వడానికి ఈ ముఖ్యమంత్రికి మనసు రావడం లేదు. తుప్పు పట్టించడానికైనా సిద్ధపడ్డారు తప్ప మీకు ఇవ్వడానికి మాత్రం చేతులు రావడం లేదు. కూర్చోవడానికి కుర్చీలు కూడా లేని కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు..అవి నాలుక గీసుకోవడానికి కూడా పనికి రావు. ఏం ఉద్ధరించారని ఇప్పుడు సాధికార యాత్ర చేస్తున్నారు.? టీడీపీ హయాంలో వెయ్యి ఖర్చు చేసి కోట్లు ఆదరణ ద్వారా పనిముట్లు అందించాం..ఆ పథకాన్ని పూర్తిగా రద్దు చేశారు. 

*ఏ మొహంతో సాధికార యాత్ర చేస్తారు.?*

బీసీ సబ్ ప్లాన్ ద్వారా ఐదేళ్లలో రూ.37 వేల కోట్లు ఖర్చు చేశాం. తాను అధికారంలోకి వస్తే యేడాదికి రూ.15 వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు..ఒక్క రూపాయి అయినా బీసీలకు ఖర్చు చేశాడా.? యేడాదికి రూ.15 వేల కోట్లు ఇస్తానని చెప్పి, ఇవ్వకుండా సాధికార యాత్ర చేసే హక్కు ఎవరిచ్చారు.? రూ.75 వేల కోట్లు బీసీలకు జగన్ అప్పు ఉన్నాడు. అవి ఖర్చు చేసిన తర్వాత ఓట్లు అడగాలి.  తాను మాట తప్పననే సీఎం బీసీలకు ఎక్కడ న్యాయం చేశాడు.? మన ప్రభుత్వం పెళ్లి కానుక రూ.35 వేలు ఇస్తే నేనొచ్చి రూ.50వేలు ఇస్తా అన్నాడు..దాన్ని వదిలేశాడు. బెస్ట్ అవెయిలబుల్ స్కూళ్లు, స్టడీ సర్కిల్స్, విదేశీ విద్య రద్దు చేశాడు. మనం కట్టిన బీసీ భవనాలు పూర్తి చేయలేనోడు మూడు రాజధానులు కడతాడా.? మూడు రాజధానుల ముచ్చట కూడా తీరిపోయింది. ఎన్ఎఫ్ఢీబీ ద్వారా సబ్సీడీలు రద్దు చేశాడు. చంద్రన్న బీమా రద్దు చేశాడు. మత్య్సకారుల పాలిట శాపంగా 217 జీవో తెచ్చి ఇష్టం వచ్చిన వాళ్లకు సొసైటీలు అంటూ చెరువులు అప్పగించారు. మత్య్సకారులకు చేప పిల్లల పెంపకానికి అందించే సాయాన్ని విస్మరించాడు. 

*అడుగడుగునా బీసీలకు నమ్మకద్రోహమే*

రజకులకు వాషింగ్ మెషీన్లు, మత్య్సకారుల బోట్ల ఆధునీకరణ కూడా రద్దు చేశాడు. మహిళలకు ఇచ్చే పారిశ్రామిక రాయితీలు రద్దు చేశాడు. నేత కార్మికులకు ట్రైనింగ్, నూలు కొనుగోలుకు రాయితీలు కూడా రద్దు చేశాడు. చేనేతలకు మగ్గాలు ఇచ్చే కార్యక్రమాన్ని రద్దు చేశాడు. ఆప్కో ద్వారా చేనేత వస్త్రాలు కొనుగోలు చేసే కార్యక్రమాన్ని రద్దు చేశాడు. ఈత, తాటి చెట్ల పంపకాల ప్రోత్సాహకాన్ని నిలిపేశారు. కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం ప్రారంభిస్తే వాటిని పాడుబెడుతున్నారు. బీసీలకు అన్ని కాంట్రాక్టు పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తానని చేయలేదు. బీసీ కార్పొరేషన్ కు నిధులిచ్చి ఆర్థిక పరిపుష్టి కృషి చేస్తామని చెప్పి నిర్వీర్యం చేశాడు. చేపల వేట సమయంలో చనిపోతే బీమా ద్వారా రూ.10లక్షలు ఇస్తానన్నాడు..ఇచ్చాడా.? సాధారణ మరణం వారికి వైఎస్ఆర్ బీమా ద్వారా రూ.5 లక్షలిస్తానన్నాడు..అది కూడా ఇవ్వలేదు. చేనేతలకు రూ.24 వేలు యేడాదికి ఇస్తానన్నాడు..4 లక్షల మంది ఉంటే 80 వేల మందికిచ్చి చేనేత కార్మికులకు అన్నీ ఇచ్చానని ఉపన్యాసాలు ఇస్తున్నాడు. పేపర్లకు ప్రకటనల కోసమే అవి కూడా చేస్తున్నాడు. 

*రూ.10 ఇచ్చి..100 కొట్టేయడం సంక్షేమమా.?*

పది రూపాయలు చేతిలో పెట్టి వంద దోచుకుంటూ దానకర్ణుడిలా చంకలు గుద్దుకుంటున్నాడు. ఆదాయం పెరిగి..ఖర్చులు తగ్గించడమే సంపద సృష్టి. నేను బటన్ నొక్కుతున్నా అంటున్నాడు..బొక్కుడు విషయం మాత్రం చెప్పడు. సాయంత్రానికి తనకెంత ఆదాయం వచ్చిందో చూసుకుంటున్నాడు తప్ప ప్రజలకు ఏం మేలు జరిగిందో ఆలోచించడు. రైతు, కార్మికుడు, నిరుద్యోగి, ఎవ్వరికైనానా మేలు జరిగిందా.? రూ.13 లక్షల కోట్లు అప్పులు చేసి కూర్చున్నాడు. అగ్రకులాల వారు కావాలంటే ఇతర రాష్ట్రాలకు, దేశాలకు వెళ్లిపోతారు. కానీ బడుగు, బలహీన వర్గాలు మాత్రమే ఇక్కడ ఉంటాయి. 

*వైఫల్యాలపై మాట్లాడితే తప్పుడు కేసులా?*

ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడితే కేసులు పెడుతున్నారు. అచ్చెన్నాయుడుతో బోణీ చేసి, హోదాను బట్టి కేసులు పెట్టాడు. కొల్లు రవీంద్ర, కూన రవికుమార్, బండారు సత్యనారాయణ, కళా వెంకట్రావుపై అక్రమంగా కేసులు పెట్టారు. వేల మంది బీసీలపై అక్రమంగా కేసులు పెట్టారు. శ్రీకాళహస్తిలో మునిరాజమ్మ అనే మహిళ లోకేష్ పాదయాత్రలో స్వాగతం పలికడమే పాపంగా చూసి ఆమె కొట్టుపై బియ్యపు మధుసూధన్ రెడ్డి పడ్డాడు..కానీ ఆమె ప్రాణంపోయినాసరే అని గట్టిగా ఎదురు నిలబడి పోరాడింది. ఆమె నీతి, నిజాయితీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. 38 మంది ఎమ్మెల్యేలను మార్చాడంట..ట్రాన్స్ ఫర్లు చేశాడంట. మనింట్లో చెత్త ఇక్కడ ఉండకూడదు కానీ పక్కింట్లో ఉండాలంట. మార్చిన 38 మందిలో 25 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలే ఉన్నారు..ఎందుకంటే వారు చులకన కాబట్టి. బియ్యపు రెడ్డి, పెద్దిరెడ్డిని, ద్వారంపూడిని ఎందుకు మార్చలేదు.? బట్టలిప్పిన(గోరంట్ల మాధవ్) అతన్ని కూడా ఎక్కడికి పంపాడో అర్థంకాలేదు. ఒక నాయకున్ని తయారు చేయడం కష్టం..కానీ ఆ నాయకున్ని దీర్ఘకాళికంగా సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దడం పార్టీల బాధ్యత. 42 ఏళ్లుగా యనమల రామకృష్ణుడు పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నందుకు గర్వపడుతున్నా. ఎర్రన్నాయుడుకు కేంద్రంలో మంత్రిగా కూడా చేశారు. 

*జగన్ పాలనలో బీసీల ఊచకోత*

వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో 300మంది బీసీలను పొట్టనబెట్టుకన్నారు..టీడీపీకి చెందిన 74 మంది కార్యకర్తలను దారుణంగా చంపేశారు. ఒక్క పల్నాడులోనే 16 మందిని చంపారు. మాచర్లలో జై జగన్ అని అంటే వదిలేస్తామని చంద్రయ్యను బెదిరిస్తే ప్రాణంపోయినా అనను అంటే గొంతుకోసి ప్రాణాలు తీశారు. నా కుటుంబ సభ్యుడిని కోల్పోయానని బాధపడ్డా...చంద్రయ్య పాడె మోశాను. ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అవినీతి, అరాచకంపై పోరాడిన నందం సుబ్బయ్య చంపేశారు..ఈ ఎమ్మెల్యేను ఎందుకు మార్చలేదు..ఎందుకు మార్చలేవు.? మిగతావాళ్లు అయితే మార్చేవాడు. బీసీలకు రక్షణ చట్టాన్ని తీసుకొస్తాం..నా బీసీల జోలికి వస్తే ఆ రోజే వారి పనిపడతాం. 54 సాధికార కమిటీలు వేశాం..వారి ఆర్థిక పరిస్థితులు అధ్యయనం చేయండి..టీడీపీ వచ్చాక వారిని మరింత ఆదుకునే బాధ్యత టీడీపీ తీసుకుంటుంది. 42 ఏళ్లుగా బీసీలకు టీడీపీ చేసినదానికంటే వచ్చే 5 ఏళ్లలోనూ ఎక్కువ ప్రయోజనం చేకూర్చి మీ రుణం తీర్చుకుంటాం. విదేశీ విద్య, బెస్ట్ అవెయిలబుల్ స్కూళ్లు, స్కిల్ డెవలెప్మెంట్ సెంటర్లు, స్టడీ సెంటర్లు ఏర్పాటు చేస్తే అన్నింటినీ తేసేశారు. ఏ కులమైనా, ఏమతమైనా, ప్రాంతమైనా బాగుపడాలంటే అక్కడి వ్యక్తుల రాజకీయంగా పైకి వస్తే చైతన్యం పెరుగుతుంది. 

*పేదరికం లేని సమాజమే నా ఆలోచన*

అంచలంచెలుగా బీసీలకు పెద్దపీఠ వేసింది టీడీపీ..బీసీలను అంచలంచెలుగా వేధించింది వైసీపీ. జగన్ మాటలు కోటలు దాటుతాయి..చేష్టలు గడప దాటని నీతిలేనిది వైసీపీ. క్షేత్రస్థాయిలోకి వెళ్లినప్పుడు బీసీల్లో పలుకుబడి ఉన్నవాళ్లను పిలిచి వారి ఆలోచన తీసుకోండి. పేదరికం లేని సమాజమే నా ఆలోచన. పేదలు ఎక్కువగా ఉండేది బీసీ వర్గాలలోనే. పది రూపాయలు ఇచ్చి వంద లాగేసుకోవడం జగన్ చేసే పని..పది రూపాయలు ఇచ్చి వంద సంపాదించేలా చేసేది నేను నా మనస్థత్వం. తెలివి కొందరి సొంతం కాదు. ప్రపంచంలోనే ఎక్కువ ఆదాయం సంపాదించేవారు తెలుగువాళ్లు..దానికి కారణం తెలుగుదేశం నాడు వేసిన పునాది. ప్రతి వ్యక్తిని పేదరికం నుండి ఎందుకు తీసుకురాకూడదన్నదే పీపీపీపీ(పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టనర్షిప్) విధానం. సమర్థవంతమైన నాయకత్వం మీ ఇంటికి కూడా ఆస్తిగా మారతుంది. వంద రోజులు పార్టీకోసం, రాష్ట్రం కోసం, వెనకబడిన వర్గాల కోసం పని చేయండి. మీమ్మల్ని ఆర్థికంగా, రాజకీయంగా పైకి తీసుకొచ్చే బాధ్యత టీడీపీ తీసుకుంటుంది. సమర్థులను పైకి తీసుకొచ్చే విధంగా నేను చూసుకుంటాను.’’ అని చంద్రబాబు నాయుడు అన్నారు. 

*జయహో బీసీ ప్రచార రథాలు ప్రారంభం*

జయహో బీసీ ప్రచార రథాలను పార్టీ కార్యాలయం వద్ద జెండా ఊపి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. 25 పార్లమెంట్లుకు గాను ఒక్కో పార్లమెంట్ కు 2 రథాల చొప్పున ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో బీసీ నేతలు పర్యటించి బీసీలకు టీడీపీ గతంలో ఏం చేసింది..మళ్లీ అధికారంలోకి రాగానే ఏం చేయబోతోంది..బీసీలకు జగన్ చేసిన అన్యాయాన్ని గురించి క్షేత్రస్థాయిలో వివరించనున్నారు.

Comments