అంబేద్కర్ స్మృతివనం కు అంచనాలకు మించి జనం.


అంబేద్కర్ స్మృతివనం కు అంచనాలకు మించి జనం


19న జరిగే ప్రారంభోత్సవానికి భారీగా తరలివచ్చే అవకాశం

పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి నాగార్జున ఆదేశం

అమరావతి, జనవరి 4 (ప్రజా అమరావతి): దేశంలోనే మరెక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన అంబేద్కర్ స్మృతివనం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణకు అన్ని ప్రాంతాల నుంచి అంబేద్కర్ అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చే అవకాశం ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. ఈ నెల 19న జరిగే ఈ కార్యక్రమంలో ప్రజలకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తెలెత్తకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

విజయవాడలోని స్వరాజ్ మైదాన్ లో ప్రభుత్వం నిర్మించిన అంబేద్కర్ స్మృతివనం, 125 అడుగుల విగ్రహాలను ఈనెల 19న ప్రారంభించనున్న నేపథ్యంలో గురువారం రాష్ట్ర సచివాలయంలో ఈ కార్యక్రమ ఏర్పాట్లను సంబంధిత అధికారులతో నాగార్జన సమీక్షించారు. ఈ కార్యక్రమం కోసమే జనభాగీధారి పేరిట అన్ని ప్రాంతాల నుంచి జనసమీకరణ కోసం జరుగుతున్న ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. దేశంలో మరెక్కడా లేనంత ఎత్తులో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటుగా స్మృతివనంలో అంబేద్కర్ జీవిత విశేషాలను తెలిపే విగ్రహాలు, చిత్రాలు, ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. స్వరాజ్ మైదానంలో రెండు దశలుగా చేపట్టిన అంబేద్కర్ స్మృతివనం పనులను తొలి దశలో రూ.268.46 కోట్లతోనూ, మలి దశలో రూ.106.64 కోట్లతోనూ చేపట్టారన్నారు. సుమారుగా రూ.400 కోట్ల తో స్మృతివనాన్ని తీర్చిదిద్దడం జరిగిందని వివరించారు. విగ్రహ నిర్మాణం ఇదివరకే పూర్తి కాగా దీనికి సంబంధించిన లైటింగ్, పెయింటింగ్ పనులు కొనసాగుతున్నాయని, మినీ థియేటర్, మ్యూజియం, స్కై లైటింగ్, ఫౌంటెన్లు, విగ్రహం ముందు, వెనుక భాగాల్లో ఉద్యానవనాలతో సుందరీకరణ, భవనాలు, ప్రహారీ గోడల నిర్మాణం,లిఫ్టులు, వెహికల్ పార్కింగ్, ఫుడ్ కోర్ట్ తదితర ప్రధానమైన పనులన్నీ దాదాపుగా పూర్తయిపోయాయని తెలిపారు. సందర్శకులకు అంబేద్కర్ చరిత్ర పూర్తిగా అవగతం కావడంతో పాటుగా ఒక అనిర్వచనీయమైన అనుభూతిని కలిగించేలా అంబేద్కర్ స్మృతివనాన్ని తీర్చిదిద్దడం జరుగుతోందని తెలిపారు. ఈనెల 19 న జరిగే అంబేద్కర్ స్మృతివనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి దళితులు, దళిత సంఘాల నేతలతో పాటుగా అంబేద్కర్ భావ జాలాన్ని అభిమానించే వారందరూ హాజరు కావాలని నాగార్జున పిలుపునిచ్చారు. ప్రస్తుతం అంబేద్కర్ స్మృతివనం ప్రారంభోత్సవానికి అంచనాలకు మించి ఎక్కువ సంఖ్యలో ప్రజలు తరలివచ్చే అవకాశం ఉందని నాగార్జున అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన రీతిలో ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వై.శ్రీలక్ష్మి ప్రస్తుతం చేస్తున్న ఏర్పాట్లను గురించి మంత్రికి వివరించారు. ప్రస్తుత నిర్ణీత కార్యక్రమాల్లో కొన్ని మార్పులను మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, సాంఘిక సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జి.జయలక్ష్మి, ఎన్టీఆర్ జిల్లా జేసీ సంపత్, విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్, సాంఘిక సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ రఘురామ్ తదితరులు పాల్గొన్నారు.



Comments