కుల గణన సర్వే పకడ్బందీగా చేపట్టాలి...

 కుల గణన సర్వే పకడ్బందీగా చేపట్టాలి...సర్వేపై ఎలాంటి అపోహాలు వద్దు...


జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్


పుట్టపర్తి, జనవరి 19 (ప్రజా అమరావతి): నేటి నుంచి ప్రారంభమైన కుల గణన సర్వే కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం ఉదయం పుట్టపర్తి లోని 10 వ వార్డు గోకులం వీధిలో  జిల్లా ప్రణాళిక గణాంకాల అధికారి విజయ్ కుమార్,  మున్సిపల్ కమిషనర్ రాంభూపాల్ రెడ్డి లతో కలిసి  సచివాలయ పరిధిలోని సిబ్బంది వాలంటీర్లు చేపట్టిన కుల గణన సర్వే ప్రక్రియను జాయింట్ కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా పలు కుటుంబాల వివరాల సేకరణ అంశాలపై చర్చించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ 1931 వ సంవత్సరం అనగా భారత దేశ స్వాతంత్రం రాక పూర్వం దేశంలో కుల గణన జరిగిందని  ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం  కుల గణన సర్వే చేపట్టినట్లు తెలిపారు. ముఖ్యంగా కుల గణన పై  ప్రజలు అనుమానాలను పెంచుకోవద్దని,ఎలాంటి అపోహాలకు సందేహాలకు తావు లేదని  వస్తున్న వార్తలు కేవలం కల్పిత అవాస్తవాలుగా ప్రజలు గ్రహించాలని జాయింట్ కలెక్టర్ స్పష్టం చేశారు. ఎట్టి  పరిస్థితుల్లో ప్రజలు అలాంటి విషయాలను నమ్మవద్దని తెలిపారు. ముఖ్యంగా మన రాష్ట్రంలో వివిధ కులాలు ఉప కులాల గణన పూర్తి చేయడం ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాలను చేరువుగా తీసుకెళ్లి అన్ని వర్గాలకు అమలు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని జాయింట్ కలెక్టర్ తెలిపారు. అలాగే కుల గణన ద్వారా  స్వీకరించే అంశాలు గణాంకాల వివరాలల్లో పొందు పరచడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా పేదరిక నిర్మూలన అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడంలో ఈ ప్రక్రియ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. 2022సం "లో నవంబర్ 3న రాష్ట్రంలో కులగణన కార్యక్రమం చేపట్టేందుకు మంత్రి మండలి ఆధ్వర్యంలో సమగ్ర కుల ఆధారిత సర్వేకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఈ మేరకు కులాల వారీగా సర్వే  నిర్వహణకు షెడ్యూల్  ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 9న ఉత్తర్వులు జారీ చేసినట్లు జాయింట్ కలెక్టర్ తెలిపారు .జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ఈనెల 28 వరకు గ్రామాల్లో సచివాలయ ఉద్యోగులు, పట్టణ ప్రాంతాల్లో వార్డు సచివాలయ ఉద్యోగులు కుల గణన సర్వేలో ఇంటింటా  వివరాల సేకరణకు వస్తున్నందున ప్రజలు వారి కుటుంబ వివరాలు, జీవన ప్రమాణ ఆర్థిక స్థితిగతులను తెలియజేస్తూ  కుల గణన సర్వే సిబ్బందికి సహకరించాలని కోరారు. సర్వే సమయంలో ఆయా ఇళ్లలో అందుబాటులో లేనివారు ఈనెల 29 నుంచి ఫిబ్రవరి 2 వరకు ఆయా గ్రామ, వార్డు సచివాలయంలో తమ కుల సమాచారాన్ని నమోదు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందని దీన్ని కూడా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ తెలిపారు. అంతేకాక తుది కుల సర్వే నివేదిక ఫిబ్రవరి 15 నాటికి ఆయా గ్రామ, వార్డు సచివాలయ స్థాయిలో సిద్ధం కానున్నట్లు తెలిపారు. జిల్లాలోని 544 గ్రామ /వార్డు సచివాలయ సిబ్బంది అలాగే 9 800 మంది వాలంటీర్లు  ఈ సర్వేలో పాల్గొని ఎలాంటి పొరపాట్లు లేకుండా ప్రజలందరి సకారాలతో సర్వేను విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ నరసింహులు, వార్డు సెక్రెటరీ సౌభాగ్య, వాలంటీర్లు హర్షవర్ధన్ ఇతర సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Comments