భార‌త్‌ను విశ్వ‌గురుగా నిలిపేందుకే విక‌సిత్ భార‌త్ సంక‌ల్ప్ యాత్ర‌.


ఎన్‌టీఆర్ జిల్లా,  జ‌న‌వ‌రి 06 (ప్రజా అమరావతి);


*భార‌త్‌ను విశ్వ‌గురుగా నిలిపేందుకే విక‌సిత్ భార‌త్ సంక‌ల్ప్ యాత్ర‌


*

- దేశాన్ని 2047లోపు అభివృద్ధి చెందిన దేశంగా నిలిపేందుకు కృషి

- విక‌సిత్ భార‌త్ సంక‌ల్ప యాత్ర ద్వారా గ్రామ‌గ్రామానికీ మోదీ గ్యారెంటీ ఘాడీ

- వ్య‌వ‌సాయ డ్రోన్ల‌పై స్వ‌యం స‌హాయ‌క సంఘాల మ‌హిళ‌ల‌కు శిక్ష‌ణ‌

- కంచిక‌చ‌ర్ల‌లో విక‌సిత్ భార‌త్ సంక‌ల్ప్ యాత్ర కార్య‌క్ర‌మంలో 

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ స‌హాయ మంత్రి డా. భార‌తి ప్ర‌వీణ్ ప‌వార్


విక‌సిత్ భార‌త్ సంక‌ల్ప్ ల‌క్ష్యాల సాధ‌న ద్వారా అన్ని రంగాల్లోనూ దేశాన్ని అభివృద్ధి ప‌థంలో న‌డిపించి.. భార‌త్‌ను విశ్వ‌గురుగా నిలిపేందుకు గౌర‌వ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం కృషిచేస్తోంద‌ని కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ స‌హాయ మంత్రి డా. భార‌తి ప్ర‌వీణ్ ప‌వార్ అన్నారు.

నందిగామ నియోజ‌క‌వ‌ర్గం, కంచిక‌చ‌ర్ల మార్కెటింగ్ యార్డు ప్రాంగ‌ణంలో జిల్లా అధికార‌యంత్రాంగం ఆధ్వ‌ర్యంలో విక‌సిత్ భార‌త్ సంక‌ల్ప యాత్ర కార్య‌క్ర‌మాన్ని శ‌నివారం కేంద్ర మంత్రి డా. భార‌తి ప్ర‌వీణ్ ప‌వార్.. ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారుల‌తో క‌లిసి ప్రారంభించారు. ప్ర‌జాప్ర‌తినిధులు, ఉన్న‌తాధికారుల‌తో క‌లిసి ఇన్ఫ‌ర్మేష‌న్‌, ఎడ్యుకేష‌న్‌, క‌మ్యూనికేష‌న్ (ఐఈసీ) వాహ‌నాన్ని ప‌రిశీలించారు. ఆయుష్మాన్ భార‌త్‌, ప్ర‌ధాన‌మంత్రి జ‌న్ ఆరోగ్య యోజ‌న‌, పీఎం పోషణ్ అభియాన్‌, ఉజ్వ‌ల 2.0, పీఎం ఆవాస్ యోజ‌న, మ‌హాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఆరోగ్య ప‌థ‌కం, నెహ్రూ యువ‌జ‌న కేంద్రం-మై భార‌త్ వాలంటీర్స్ రిజిస్ట్రేష‌న్‌, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా-జ‌ల్ జీవ‌న్ మిష‌న్‌, పీఎం జీవ‌న జ్యోతి బీమా యోజ‌న‌, పీఎం కౌశ‌ల్ వికాస్ యోజ‌న త‌దిత‌రాల‌కు సంబంధించిన స్టాళ్ల‌ను సంద‌ర్శించారు. అనంత‌రం జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ డా. పి.సంప‌త్ కుమార్ విక‌సిత్ భార‌త్ సంక‌ల్ప యాత్ర ప్ర‌తిజ్ఞ చేయించారు. న‌వ‌భార‌త నిర్మాణంలో అమృత‌కాలం విశిష్ట‌త‌, విక‌సిత్ భార‌త్ సంక‌ల్ప యాత్ర ఔన్న‌త్యంపై ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ సందేశాన్ని, కేంద్ర ప్ర‌భుత్వ విజ‌యాలు, అగ్రీ డ్రోన్‌ల‌కు సంబంధించిన ల‌ఘు చిత్రాల‌ను ప్ర‌ద‌ర్శించారు. మేరీ క‌హానీ మేరీ జుబానీలో పీఎం కిసాన్‌పై బి.శేష‌య్య‌, పీఎం జేఏవైపై క‌ట్టా మెర్సీ, పీఎం పోష‌ణ్ అభియాన్‌పై జె.ప్ర‌ణీత ఇలా వివిధ ప‌థ‌కాల ల‌బ్ధిదారులు ప‌థ‌కాల ద్వారా తాము పొందిన ప్ర‌యోజ‌నంపై త‌మ మ‌నోగ‌తాన్ని ఆవిష్క‌రించారు. కార్య‌క్ర‌మంలో భాగంగా వివిధ కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల ల‌బ్ధిదారుల‌కు మెగా చెక్‌ల‌తో పాటు ఉజ్వ‌ల గ్యాస్ క‌నెక్ష‌న్‌, ఆయుష్మాన్ భార‌త్ ఆరోగ్య కార్డు, కిసాన్ క్రెడిట్ కార్డు త‌దిత‌రాల‌ను కేంద్ర మంత్రి డా. భార‌తి ప్ర‌వీణ్ ప‌వార్‌ అందించారు.

***

కార్య‌క్ర‌మంలో కేంద్ర మంత్రి డా. భార‌తి ప్ర‌వీణ్ ప‌వార్ మాట్లాడుతూ అత్యంత పార‌ద‌ర్శ‌క‌త‌తో స‌బ్‌కా సాత్ స‌బ్‌కా వికాస్ నినాదంతో 2047లోపు భార‌త్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాల‌నే సంక‌ల్పంతో గౌర‌వ ప్ర‌ధాన‌మంత్రి విశేష కృషిచేస్తున్నార‌న్నారు. ఇందులో భాగంగానే దేశ‌వ్యాప్తంగా న‌వంబ‌ర్ 15 నుంచి విక‌సిత్ భార‌త్ సంక‌ల్ప యాత్ర జ‌రుగుతోంద‌న్నారు. ప‌థ‌కాలు ల‌బ్ధిదారులంద‌రికీ అందాల‌నే ఉద్దేశంతో విక‌సిత్ భార‌త్ సంకల్ప యాత్ర ద్వారా మోదీ గ్యారెంటీ గాడీ గ్రామ‌గ్రామానికీ వెళుతోంద‌న్నారు. అర్హులెవ‌రైనా ఉంటే వారిని వెంట‌నే న‌మోదు చేయించుకొని, ప‌థ‌కం అందేలా చేస్తున్న‌ట్లు వివ‌రించారు. ఆయుష్మాన్ భార‌త్, పీఎం గ‌రీబ్ క‌ల్యాణ్ అన్న యోజ‌న‌, పీఎం ఆవాస్ యోజ‌న‌, పీఎం కిసాన్ త‌దిత‌ర ప‌థ‌కాల‌కు సంబంధించి ఊరూరా అవ‌గాహ‌న క‌ల్పించి.. ప‌రిపూర్ణంగా ప‌థ‌కాల ఫ‌లాలు అందేలా చూస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. జిల్లాలో విక‌సిత్ భార‌త్ సంక‌ల్ప యాత్ర కార్య‌క్ర‌మాలకు ఇప్ప‌టివ‌ర‌కు 61 వేల మందికిపైగా హాజ‌రై ప‌థ‌కాలపై అవ‌గాహ‌న పెంపొందించుకున్న‌ట్లు తెలిపారు. వీరిలో 34 వేల మంది మ‌హిళ‌లే ఉన్న‌ట్లు తెలిపారు. ఆరోగ్య శిబిరాల ద్వారా 37 వేల మంది ఆరోగ్య ప‌రీక్ష‌లు చేయించుకున్న‌ట్లు వెల్ల‌డించారు. వ్య‌వ‌సాయ రంగంలో మ‌హిళ‌లు కీల‌క భాగ‌స్వామ్యాన్ని పెంచేలా కిసాన్ డ్రోన్‌ల‌పై స్వ‌యం స‌హాయ‌క సంఘాల మ‌హిళ‌ల‌కు శిక్ష‌ణ ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు. వారికి రాయితీపై డ్రోన్‌ల‌ను అందంచ‌నున్నామ‌న్నారు. ప్ర‌జ‌ల ఆరోగ్య భ‌ద్ర‌త‌కు భ‌రోసా క‌ల్పించే ఆయుష్మాన్ భార‌త్ కార్డుల పంపిణీని ప్ర‌ణాళికాయుతంగా, ల‌క్ష్యాల‌కు అనుగుణంగా గ్రామ‌స్థాయి యంత్రాంగంతో చేప‌ట్టి, పూర్తిచేయాల‌ని కోరారు. విక‌సిత్ భార‌త్ ల‌క్ష్యాల‌ను సాధించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం చిత్త‌శుద్ధితో ప‌నిచేస్తోంద‌ని.. ఇందులో భాగంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌నూ అభివృద్ది ప‌థంలో న‌డిపించేందుకు ప్ర‌భుత్వం కృషిచేస్తోంద‌న్నారు. విక‌సిత్ భార‌త్ ల‌క్ష్యాల సాధ‌న‌లో అంద‌రం భాగ‌స్వాములై  భార‌త్‌ను అన్ని రంగాల్లో నెం.1గా నిలిపేందుకు కృషిచేద్దామంటూ కేంద్ర మంత్రి భార‌తి ప్ర‌వీణ్ ప‌వార్ పిలుపునిచ్చారు.


*అంత‌ర్జాతీయంగా బ్రాండ్ ఇండియాకు గుర్తింపు: ఎంపీ కేశినేని శ్రీనివాస్‌*

విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) మాట్లాడుతూ ఎక్కడో ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో జరిగే ఇలాంటి కార్య‌క్ర‌మాలు కంచిక‌చ‌ర్ల వంటి గ్రామాల్లోనూ జ‌రుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంద‌ని అన్నారు. త‌న‌కు సొంతింటి క‌ల సాకార‌మైంద‌ని.. ఉచితంగా శ‌స్త్ర‌చికిత్స చేయించుకున్నాన‌ని.. ఇలా వివిధ ప‌థ‌కాల ల‌బ్ధిదారులు కార్య‌క్ర‌మంలో భాగంగా చెబుతుంటే చాలా ఆనందంగా ఉంద‌న్నారు. భార‌త ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ 360 డిగ్రీ డెవ‌ల‌ప్‌మెంట్ విధానంతో ముందుకెళ్తూ దేశాభివృద్ధికి కృషిచేస్తున్నార‌న్నారు. బ్రాండ్ ఇండియాకు అంత‌ర్జాతీయంగా గుర్తింపు తెస్తున్నార‌ని.. ఇందుకు జీ20 స‌ద‌స్సు అనంత‌రం దేశంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు బ్రెజిల్ వ్యాపార‌వేత్త‌ల బృందం చార్ట‌ర్ ఫ్ల‌యిట్‌లో వ‌చ్చిన ఉదంతం మంచి ఉదాహ‌ర‌ణ అని ఎంపీ కేశినేని పేర్కొన్నారు.


*ఆరోగ్య శ్రీ లో రూ.25 లక్షల వరకూ పెంచిన సిఎం: ఎమ్మెల్యే మొండితోక జ‌గ‌న్మోహ‌న‌రావు*

నందిగామ ఎమ్మెల్యే మొండితోక జ‌గ‌న్మోహ‌న‌రావు మాట్లాడుతూ రాష్ట్రంలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల ప‌థ‌కాల ఫ‌లాలు పూర్తిస్థాయిలో ల‌బ్ధిదారుల‌కు చేర‌వేయ‌డంలో గ్రామ, వార్డు వాలంటీర్‌, స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌లు కీల‌కంగా ప‌నిచేస్తున్నాయ‌ని పేర్కొన్నారు. పీఎం ఆయుష్మాన్ భార‌త్‌, డా. వైఎస్ఆర్ ఆరోగ్య‌శ్రీ 

ప‌థ‌కాల ద్వారా ప్ర‌జ‌ల ఆరోగ్యానికి భ‌రోసా ల‌భిస్తోంద‌న్నారు. ఆరోగ్య శ్రీ  ద్వారా రూ. 25 లక్షల వరకు ఉచిత సేవలందేలా సిఎం నిర్ణయం తీసుకున్నారన్నారు.

 ముఖ్య‌మంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమ‌లుచేస్తున్న ప‌థ‌కాల ద్వారా మ‌హిళ‌ల‌కు అధిక ల‌బ్ధి చేకూరుతోంద‌ని.. మ‌హిళా సాధికార‌త‌కు ముఖ్య‌మంత్రి ఎంతో కృషిచేస్తున్నార‌న్నారు. గ్రామాల్లో రైతు భ‌రోసా కేంద్రాలు రైతుల‌కు వ‌న్‌స్టాప్ స‌ర్వీస్ సెంట‌ర్‌గా మంచి సేవ‌లందిస్తున్నాయ‌ని పేర్కొన్నారు. నందిగామ‌కు కేంద్రీయ విద్యాల‌యాన్ని మంజూరు చేసినందుకు గౌర‌వ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీగారికి, కేంద్ర ప్ర‌భుత్వానికి ఈ సందర్భంగా ధ‌న్య‌వాదాలు తెలిపారు. 


*ప్ర‌జాప్ర‌తినిధుల భాగ‌స్వామ్యంతో కార్య‌క్ర‌మాల విజ‌య‌వంతానికి కృషి: జేసీ డా. పి.సంప‌త్ కుమార్‌*

జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ డా. పి.సంప‌త్ కుమార్ మాట్లాడుతూ అర్హ‌త ఉన్న ఏ ఒక్కరూ ప‌థ‌కం అంద‌కుండా ఉండిపోకూడ‌ద‌నే ఉద్దేశంతో కేంద్ర ప్ర‌భుత్వం గ‌త న‌వంబ‌ర్ 15న విక‌సిత్ భార‌త్ సంక‌ల్ప యాత్ర‌ను ప్రారంభించింద‌ని అన్నారు. జిల్లాలో 288 గ్రామీణ ప్రాంతాల‌కు గాను ఇప్ప‌టికే 202 ప్రాంతాల్లో కార్య‌క్ర‌మాలు పూర్త‌యిన‌ట్లు తెలిపారు. ఇదే విధంగా అర్బ‌న్ ప్రాంతాల్లో 51చోట్ల కార్య‌క్ర‌మాలను పూర్తిచేసిన‌ట్లు వెల్ల‌డించారు. జిల్లాలో మూడు ప్ర‌త్యేక ప్ర‌చార వాహ‌నాల ద్వారా ప్ర‌జ‌ల‌కు ప‌థ‌కాల‌పై అవ‌గాహ‌న క‌ల్పిస్తున్న‌ట్లు తెలిపారు. 2047లోపు భార‌త్‌ను అభివృద్ధి చెందిన దేశంగా చూడాల‌నే ల‌క్ష్యంతో విక‌సిత్ భార‌త్ సంక‌ల్ప యాత్ర చేప‌డుతున్న‌ట్లు తెలిపారు. అదే విధంగా టాప్‌-3 ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల్లో దేశాన్ని చేర్చాల‌నే ల‌క్ష్యంతో ప్ర‌భుత్వం కృషిచేస్తోంద‌న్నారు. గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల ద్వారా కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల ప‌థ‌కాలు ల‌బ్ధిదారుల‌కు పూర్తిస్థాయిలో అందుతున్నాయ‌న్నారు. ఆధార్ న‌మోదు శిబిరాలు, ఆరోగ్య శిబిరాలు, కిసాన్ డ్రోన్లు త‌దిత‌రాల‌పైనా జాయింట్ క‌లెక్ట‌ర్ వివ‌రించారు. ప్ర‌జాప్ర‌తినిధుల భాగ‌స్వామ్యంతో కార్య‌క్ర‌మాల‌ను విజ‌య‌వంతం చేసేందుకు కృషిచేస్తున్న‌ట్లు తెలిపారు.

కార్య‌క్ర‌మంలో జాతీయ ఆరోగ్య మిష‌న్ (ఎన్‌హెచ్ఎం) స్టేట్ ప్రోగ్రాం మేనేజ‌ర్ డా. దుంపల వెంక‌ట ర‌వికిర‌ణ్‌,  సీఏవో గ‌ణప‌తిరావు, ఫ్యామిలీ డాక్ట‌ర్ ప్రోగ్రాం స్టేట్ నోడ‌ల్ ఆఫీస‌ర్ డా. తుళ్లూరి.ర‌మేష్‌, డిఎంహెచ్వో డాక్టర్ సుహాసిని , నందిగామ ఆర్‌డీవో పి.సాయిబాబు, ఎంపీపీ షేక్ మాల‌క్ బ‌షీర్‌, జెడ్‌పీటీసీ సభ్యురాలు వేల్పుల ప్ర‌శాంతి, స‌ర్పంచ్ వేల్పుల సునీత, డీపీవో జ‌య‌చంద్ర‌గాంధీ, డీఎంహెచ్‌వో డా. ఎం.సుహాసిని, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాస‌రావు, జిల్లా వ్య‌వ‌సాయ అధికారి ఎస్‌.నాగ‌మ‌ణెమ్మ‌, జిల్లా ఆరోగ్య‌శ్రీ స‌మ‌న్వ‌య‌క‌ర్త డా. జె.సుమ‌న్‌, ఎల్‌డీఎం కె.ప్రియాంక‌, ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు, ల‌బ్ధిదారులు త‌దిత‌రులు హాజ‌రయ్యారు.


Comments