బిల్వ స్వర్గం గుహలను ప్రారంభించిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.





*బిల్వ స్వర్గం గుహలను ప్రారంభించిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్


*


*బేతంచర్లలోని కేకే కొట్టాల గ్రామంలో రూ.2.5 కోట్లతో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి*


బేతంచర్ల, నంద్యాల జిల్లా, జనవరి, 29 (ప్రజా అమరావతి); ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బేతంచర్ల మండలంలో బిల్వ స్వర్గం గుహలను ప్రారంభించారు. రూ.2.5 కోట్లతో కనుమకిందికొట్టాల ప్రాంతంలో గుహలను అభివృద్ధి చేసి సంబంధిత శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ప్రకృతి నుంచి సహజసిద్ధంగా ఏర్పడిన గుహలను గుర్తించి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దినట్లు ఆయన పేర్కొన్నారు. తేనెటీగలకు, అపరిశుభ్రతకు నివాసంగా ఉన్న ఎర్రజాల గుహలు ఇకపై పర్యాటకులను ఆకర్షిస్తాయన్నారు. మంత్రి బుగ్గన ఆదేశాల ప్రకారం గుహలలో నడవడానికి వీలుగా ఫ్లోరింగ్, గుహలను లోతుగా చూసే వీలుగా మెట్లు, పర్యాటకులను ఆకర్షించే రంగురంగుల విద్యుత్ కాంతులను ఏర్పాటు చేసినట్లు టూరిజం అధికారులు వివరించారు. బిల్వ స్వర్గం గుహల సమీపంలో ఏర్పాటు చేసిన రెస్టారెంట్ ను ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డితో కలిసి మంత్రి బుగ్గన ప్రారంభించారు. అనంతరం అక్కడ కిచెన్, టాయిలెట్లు, డైనింగ్ ప్రాంతాలను సందర్శించారు. ఆ తర్వాత పర్యాటకులు, కేకే కొట్టాల గ్రామ ప్రజలతో కలిసి కాఫీ తాగారు. రోడ్డు లేక ఎవరూ రావడానికి ఇష్టపడని గ్రామాన్ని పర్యాటకులు సైతం వచ్చేలా గుహలను అభివృద్ధి చేసినందుకు గ్రామస్థులు మంత్రి బుగ్గనకు కృతజ్ఞతలు తెలిపారు. గుహలకు సంబంధించి ఫోటోలతో ఒక పెద్ద హోర్డింగ్ ను ఏర్పాటు చేయాల్సిందిగా పర్యాటక శాఖ జిల్లా అధికారులను మంత్రి బుగ్గన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.



Comments