వికసిత్ ఆంధ్ర 2047పై నీతిఆయోగ్ ముసాయిదా విజన్ డాక్యుమెంట్ ప్రణాళికపై ప్రజెంటేషన్.

 వికసిత్ ఆంధ్ర 2047పై నీతిఆయోగ్ ముసాయిదా విజన్ డాక్యుమెంట్ ప్రణాళికపై ప్రజెంటేషన్


అమరావతి,28 ఫిబ్రవరి (ప్రజా అమరావతి):2047 నాటికి ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చి దిద్దేందుకు వికసిత్ ఆంధ్ర 2047పై నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో రూపొందించిన ముసాయిదా విజన్ డాక్యుమెంట్ ప్రణాళిక అద్భుతంగా ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డి పేర్కొన్నారు.బుధవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో వికసిత్ ఆంధ్ర@ 2047 పై నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో ప్రజెంటేషన్ ఇచ్చారు.ఈసమావేశంలో సిఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 2047 నాటికి 100 వసంతాలు పూర్త వుతున్న సందర్భంగా దేశాన్ని వికసిత్ భారత్ గా అనగా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్న భారత లక్ష్యానికి అనుగుణంగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా 2047 నాటికి అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ గా తీర్చదిద్దేందుకు కృషి జరుగుతోందని తెలిపారు.దానిలో భాగంగా పరిశ్రమలు,ఇంధన, వ్యవసాయం,మౌలిక సదుపాయాలు,సేవలు,గ్రీన్ ఎకానమీ నగరాల అభివృద్ధి వంటి అంశాల్లో రాష్ట్రాన్ని అన్ని విధాలా మెరుగైన రీతిలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు అమలు చేయాల్సి ఉంటుందని సిఎస్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం గ్రీన్ ఎనర్జీ,ప్రాధమిక రంగం అభివృద్ధి,రేవులు ఆధారిత అభివృద్ధి వంటి రంగాల్లో దేశంలో అగ్రగామిగా ఉందని పేర్కొన్నారు.అంతేగాక ఆంధ్రప్రదేశ్ అంటే దేశానికే అన్నపూర్ణ(Rice Bowl of India)గా పేరుగాంచిందని తెలిపారు.అలాగే దేశంలోనే రెండవ పెద్ద తీర ప్రాంతాన్నికలిగి ఉందని ఇటీవల కాలంలో నూతన ఓడరేవులను అభివృద్ధి చేయడంతో పాటు పర్యాటకపరంగా రాష్ట్రాన్ని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు పెద్దఎత్తున చర్యలు తీసుకోవడం జరుగుతోందని చెప్పారు.అంతేగాక ఎపి మీదగా విశాఖపట్నం-చెన్నె,చెన్నె-బెంగుళూర్,బెంగుళూర్-హైదరాబాదు పారిశ్రామిక కారిడార్లు వెళుతుండడంతో పారిశ్రామికంగా రాష్ట్రాన్ని అన్ని విధాలుగా మరింత అభివృద్ధి చేసేందుకు పెద్దఎత్తున కృషి జరుగుతోందని పేర్కొన్నారు.తీరప్రాంతంలో ఓడరేవులు, జాతీయ రహదారులు,విమానాశ్రయాలతో మెరుగైన రీతిలో కనక్టవిటీని కల్పించేందుకు పెద్దఎత్తున అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడం జరుగుతోందని తెలిపారు. జాతీయ,అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యా,వైద్య పరమైన మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం ఇటీవల కాలంలో పెద్దఎత్తున చర్యలు చేపట్టిందని అన్నారు.ఈ నేపధ్యంలో రానున్న 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ఈవిజన్ డాక్యుమెంట్ ఎంతో దోహదం చేస్తుందని సిఎస్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు.

నీతిఆయోగ్ రూపొందించిన ఈవికసిత్ ఆంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ చాలా బాగుందని వివిధ శాఖలు అందించిన ఇన్పుట్ ఆధారంగా మంచి డాక్యుమెంట్ ను రూపొందించారని సిఎస్ జవహర్ రెడ్డి కొనియాడారు.ఈప్రణాళిక అమలుకు సంబంధించిన వనరులు ఇతర అంశాలపై త్వరలో ముఖ్యమంత్రి వర్యుల వద్ద దీనిపై ప్రజెంటేషన్ ఇచ్చి వారి సూచనలు,సలహాలు తీసుకుని వారి ఆమోదంతో ఈప్రణాళిక అమలుకు చర్యలు తీసుకుందాని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.జవహర్ రెడ్డి చెప్పారు.

నీతి ఆయోగ్ అదనపు కార్యదర్శి రాధ వికసిత్ ఆంధ్ర @2047 పై వివిధ రంగాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధికి గల అవకాశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ముఖ్యంగా దేశంలోనే రెండవ పెద్ద సముద్ర తీరప్రాంతం కలిగిన ఎపిలో తీరప్రాంత మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.ఎపి ఇప్పటికే పలు వ్యవసాయ,ఉద్యానవన పంటల్లోను,ఆక్వా రంగంలోను ప్రత్యేక బ్రాండింగ్ కలిగి ఉందన్నారు. పర్యాటక పరంగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక గుర్తింపు కలిగి ఉండటమే గాక మరింత అభివృద్ధికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని తెలిపారు.గ్రామ వార్డు స్థాయిల్లో సచివాలయాల వ్యవస్థ ఏర్పాటుతో ఉత్తమ మానవ వనరులను కలిగి ఉండడం కూడా 2047 నాటికి వికసిత్ ఆంధ్ర లక్ష్య సాధనకు దోహదం చేస్తుందని నీతి ఆయోగ్ అదనపు కార్యదర్శి రాధ పేర్కొన్నారు.క్లస్టర్ అప్రోచ్ విధానంలో రాష్ట్రాన్ని వివిధ రంగాలల్లో మరింత అభివృద్ధి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందని తెలిపారు.అలాగే ప్రాంతీయ అభివృద్ధి అధారిటీల ఏర్పాటు కూడా అవసరం ఉందని నీతి ఆయోగ్ అదనపు కార్యదర్శి రాధ తెలిపారు.

నీతి ఆయోగ్ సీనియర్ సలహాదారు ప్రభాకర్ సాహు మాట్లాడుతూ వికసిత్ ఎపి 2047 కు సంబంధించి డెమోగ్రాఫిక్ ప్రొఫైల్,సోషియల్ మరియు ఎకనామిక్ ప్రొఫైల్ తదితర అంశాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు.2047 నాటికి ఎపిలో వివిధ రంగాల వారీగా సాధించే అభివృద్ధి వాటికి సంబంధించిన గ్రోత్ రేట్ తదితర అంశాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు.

నీతి ఆయోగ్ కు చెందిన మరో సలహాదారు పార్థసారథి రెడ్డి మాట్లాడుతూ దేశ తూర్పు తీర ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లాజిస్టిక్ హబ్ గా రూపొందిందన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు తీరప్రాంతంలో రేవులు,విమానాశ్రయాలు,జాతీయ రహదారులతో మెరుగైన రీతిలో కనెక్టివిటీ సౌకర్యాలు కలిగి ఉందని చెప్పారు.పర్యాటక పరంగా ఎపిలో అభివృద్ధికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని తెలిపారు.ఈఅనుకూల పరిస్థితులన్నీ 2047 నాటికి దేశంలో ఎపి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అన్ని విధాలా దోహదం చేస్తాయని పేర్కొన్నారు.

ఈసమావేశంలో రాష్ట్ర ఇంధన,వ్యవసాయ,వైద్య ఆరోగ్య శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు కె.విజయానంద్,గోపాలకృష్ణ ద్వివేదిలు వారి శాఖల పరంగా అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలు చేపట్టిన పలు వినూత్న ప్రణాళికలు గురించి వివరించారు.అదే విధంగా విద్యాశాఖ,నైపుణ్య శిక్షణలకు సంబంధించి చేపట్టిన కార్యక్రమాలపై ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు ప్రవీణ్ ప్రకాశ్,సురేశ్ కుమార్,పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ లు పవర్ పాయింట్ ప్రజెంటేష్ ద్వారా వివరించారు.

ఇంకా ఈసమావేశంలో ప్రణాళికా శాఖ కార్యదర్శి గిరిజా శంకర్,ఉద్యానవన శాఖ కమీషనర్ శ్రీధర్,వ్యవసాయ శాఖ కమీషనర్ హరికిరణ్,సెకండరీ హెల్తు కమీషనర్ డా.వెంకటేశ్వర్,సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ బి.నాగరాణి తదితర అధికారులు,నీతి ఆయోగ్ కు చెందిన ఇతర ప్రతినిధి బృందం పాల్గొన్నారు.


Comments