రేపు డా.వై.ఎస్సార్ ఆరోగ్య విజ్ఞాన విశ్వ విద్యాలయం 26వ వార్షిక స్నాతకోత్సవం.విజయవాడ (ప్రజా అమరావతి);*రేపు డా.వై.ఎస్సార్ ఆరోగ్య విజ్ఞాన విశ్వ విద్యాలయం 26వ వార్షిక స్నాతకోత్సవం


*


*విజయవాడలోని “ది వెన్యూ కన్వెన్షన్ సెంటర్” లో కార్యక్రమం నిర్వహణ*


*విశిష్ట అతిథిగా విచ్చేయనున్న రాష్ట్ర గవర్నర్, యూనివర్సిటీ ఛాన్స్ లర్ శ్రీ.ఎస్. అబ్దుల్ నజీర్*


*గౌరవ డాక్టరేట్ స్వీకరించి స్నాతకోత్సవ ప్రసంగం చేయనున్న నిమ్హాన్స్ సైకియాట్రీ సీనియర్ ప్రొఫెసర్, డైరెక్టర్ డా. ప్రతిమా మూర్తి*


*వివిధ కోర్సుల్లో ప్రతిభ కనబర్చిన 60 మంది విద్యార్థులకు మెడల్స్, బహుమతులు ప్రదానం*


*వివరాలు వెల్లడించిన డాక్టర్ వైఎస్సార్ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ డా.కె.బాబ్జి*


డా.వై.ఎస్సార్ ఆరోగ్య విజ్ఞాన విశ్వ విద్యాలయం 26వ వార్షిక స్నాతకోత్సవం ఫిబ్రవరి 6న (మంగళవారం) ఘనంగా నిర్వహించనున్నామని యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ శ్రీ. డా.కె.బాబ్జి తెలిపారు. సోమవారం విజయవాడలోని డాక్టర్ వైఎస్సార్ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఈ.సి హాల్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయవాడలోని “ది వెన్యూ కన్వెన్షన్ సెంటర్” లో నిర్వహించనున్న 26వ వార్షిక స్నాతకోత్సవ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా రాష్ట్ర గవర్నర్, ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయ ఛాన్స్ లర్ ఎస్. అబ్దుల్ నజీర్ విచ్చేయనున్నారని వెల్లడించారు. బెంగుళూరులోని నిమ్హాన్స్ (నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ అండ్ న్యూరో సైన్సెస్) సైకియాట్రీ సీనియర్ ప్రొఫెసర్, డైరెక్టర్ డా. ప్రతిమా మూర్తి డాక్టర్ ఆఫ్ సైన్స్(హానరీస్ కాసా) లో గౌరవ డాక్టరేట్ స్వీకరించి స్నాతకోత్సవ ప్రసంగం చేస్తారని పేర్కొన్నారు. స్నాతకోత్సవం సందర్భంగా వివిధ కోర్సుల్లో ప్రతిభ కనబర్చిన 60 మంది విద్యార్థులకు మెడల్స్ మరియు బహుమతులు ప్రదానం చేయనున్నామని డా.కె.బాబ్జి వివరించారు.


రాష్ట్ర ప్రభుత్వ సంస్కరణల ఫలితంగా 2022-24 సంవత్సరంలో కొత్తగా 600 పీజీ సీట్లు మంజూరు కావడం గర్వంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఎన్ఎంసీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో 17 కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఇప్పటికే 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభించి తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. యూనివర్సిటీ కరిక్యులమ్ లో కొత్తగా ఫార్మసీ, సైకాలజీ, ఫిజియోథెరపీ కోర్సులను చేర్చామన్నారు. మెడికల్, డెంటల్, నర్సింగ్, ఆయుష్ మరియు అనుబంధ శాస్త్రాలలో పరిశోధన విభాగంలో తాము అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో  400 మందికి పైగా విద్యార్థులకు రూ.10,000 నుండి రూ.20,000 వరకు స్కాలర్ షిప్ లు మంజూరు చేశామన్నారు. అధ్యాపకులకు రూ. 2 లక్షల వరకు గ్రాంట్లు అందిస్తున్నామన్నారు. ఎయిమ్స్, కే.ఎల్. యూనివర్సిటీ, ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ తిరుపతి, లండన్ కింగ్స్ కాలేజీల సహకారంతో పరిశోధనలను మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించామన్నారు.  ప్రపంచ పోకడలను అందిపుచ్చుకుంటూ, కాగిత రహిత కమ్యూనికేషన్ వైపు అడుగులు వేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటిలెజెన్స్ సాంకేతికతను వినియోగిస్తున్నామన్నారు. 


డా.వైఎస్సార్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా.వేమిరెడ్డి రాధికా రెడ్డి మాట్లాడుతూ 2020లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు మెడల్స్, 2021లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు రేపటి కార్యక్రమంలో డిగ్రీ తీసుకోనున్నారని తెలిపారు.  కరోనా కారణంగా యూనివర్సిటీలో రెండేళ్ల పాటు స్నాతకోత్సవ కార్యక్రమాన్ని వర్చువల్ గా నిర్వహించామని తెలిపారు. ఈ ఏడాది కార్యక్రమానికి విశిష్ట అతిథిగా గవర్నర్ శ్రీ.ఎస్. అబ్దుల్ నజీర్ ప్రత్యక్షంగా పాల్గొననున్నారని పేర్కొన్నారు. ప్రతి ఏడాది 100 మంది విద్యార్థులకు బహుమతులు అందిస్తున్నామన్నారు. ఒక్కొక్కరికి మూడు, నాలుగు బహుమతులు వచ్చే అవకాశం ఉండటంతో ఈ ఏడాది 59 గోల్డ్, 17 సిల్వర్, 24 బహుమతులతో 60 మంది విద్యార్థులకు మెడల్స్ ప్రదానం చేయనున్నామన్నారు. 


కార్యక్రమంలో అకడమిక్ జాయింట్ రిజిస్ట్రార్ అజయ, రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ డైరెక్టర్ సుమిత శంకర్, జాయింట్ రిజిస్ట్రార్(ఎగ్జామినేషన్స్) పి. ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.Comments