రెండేళ్ళలో 3.60 లక్షల మందికి నైపుణ్య శిక్షణ 1.81 లక్షల మంది యువతకు ఉపాధి:సిఎస్.

 రెండేళ్ళలో 3.60 లక్షల మందికి నైపుణ్య శిక్షణ 1.81 లక్షల మంది యువతకు ఉపాధి:సిఎస్


అమరావతి,22 ఫిబ్రవరి (ప్రజా అమరావతి):రాష్ట్రంలో నైపుణ్య శిక్షణాభివృద్ధి సంస్థ ద్వారా 2022-23,2023-24 ఏడాదిల్లో మొత్తం 3లక్షల 60వేల మంది యువతకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి లక్షా 81 మందికి ఉపాధి కల్పించడం జరిగిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి వెల్లడించారు.నైపుణ్య శిక్షణా సంస్థపై గురువారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో నైపుణ్య శిక్షణా సంస్థ ద్వారా చేపట్టిన వివిధ శిక్షణా కార్యక్రమాలు ఇప్పటి వరకూ నిరుద్యోగ యువతకు కల్పించిన ఉపాధి అవకాశాలు తదితర అంశాలపై ఆయన అధికారులతో సమీక్షించారు.ఈ రెండేళ్ళ కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3లక్షల 60 వేల మందికి వివిధ రంగాల్లో ప్రముఖ విశ్వవిద్యాలయాలు,శిక్షణా సంస్థల ద్వారా శిక్షణ ఇవ్వగా వారిలో ఇప్పటికే లక్షా 81 వేల మందికి పలు కంపెనీలు,సంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగిందని తెలిపారు.ఇంకా పెద్దఎత్తున ఉపాధి శిక్షణా కార్యక్రమాలను నిర్వహించి నిరుద్యోగ యువతకు వివిధ సంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతోందని సిఎస్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు.రానున్న రోజుల్లో మరిన్ని శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని నైపుణ్య శిక్షణా సంస్థ అధికారులను ఆదేశించారు.ఇంకా ఈసమావేశంలో నైపుణ్య శిక్షణకు సంబంధించి పలు అంశాలపై అధికారులతో సిఎస్ జవహర్ రెడ్డి సమీక్షించారు.

అనంతరం ఎపి నైపుణ్య శిక్షణా సంస్థ మరియు జియువిఐ ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే //My Apssdc My Website పేరిట రూపొందించిన వైబ్ సైట్ ను సిఎస్ జవహర్ రెడ్డి లాంచనంగా ప్రారంభించారు.

అంతకు ముందు రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ రాష్ట్రంలో నైపుణ్య శిక్షణా సంస్థ ద్వారా చేపట్టిన వివిధ శిక్షణా కార్యక్రమాలు యువతకు కల్పించిన ఉపాధి అవకాశాలు తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.ముఖ్యంగా జాతీయ,అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో పాటు పలు శిక్షణా సంస్థలతో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకుని నిర్వహించిన పలు శిక్షణా కార్యక్రమాలు తదితర అంశాలను వివరించారు.

ఇంకా ఈసమావేశంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి డా.వినోద్ కుమార్,బాబు ఏ,ఎంఎం నాయక్,వర్చువల్ గా ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామల రావు, సాంకేతిక విద్యా శాఖ కమీషనర్ సి.నాగరాణి తదితరులు పాల్గొన్నారు.


Comments