500 ఏళ్ల క్రితం శ్రీకృష్ణదేవరాయలు కట్టించిన గుండాల క్షేత్రానికి పున:వైభవం : ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.



*500 ఏళ్ల క్రితం శ్రీకృష్ణదేవరాయలు కట్టించిన గుండాల క్షేత్రానికి  పున:వైభవం : ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్*



*ఎస్.గుండాల క్షేత్రంలో టీటీడీ కల్యాణ మండపం ప్రారంభం*


*ప్యాపిలిలోని వెంగలాంపల్లి చెరువు దగ్గర పర్యాటక వసతులను  ప్రారంభం*


*డోన్ లోని కొత్తకోట వద్ద జాతీయ స్థాయి డ్రైవింగ్‌ శిక్షణ, పరిశోధన కేంద్ర భవన నిర్మాణ పనుల పరిశీలన*


*డోన్ నగరవనంలో  పర్యావరణ విద్యా కేంద్రం, ఎకోట్రయినింగ్ సెంటర్ల ప్రారంభం* 


*గుడికొచ్చి మొక్కడం తప్పా గత పాలకులు ఆలయ అభివృద్ధికి ఏం చేశారు?*


*ఎస్.గుండాల క్షేత్రంలో కల్యాణ మండపం ప్రారంభోత్సవం అనంతరం ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్*


డోన్, నంద్యాల జిల్లా, ఫిబ్రవరి, 17 (ప్రజా అమరావతి); శ్రీకృష్ణదేవరాయల పరిపాలన కాలంలో సుమారు 1513 సంవత్సరంలో నిర్మించిన ఎస్.గుండాల చెన్నకేశవ స్వామి క్షేత్రానికి పున:వైభవం తీసుకువస్తామని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. కాలక్రమంలో గుడి శిథిలావస్థకు చేరినా కులదైవంలా కొలిచిన టీడీపీ నాయకులు కనీసం పట్టించుకున్న పాపాన పోలేదని ఆయన అన్నారు. ఎన్నికలకు ముందు గెలిపించు స్వామీ అంటూ నామినేషన్ పత్రాలతో వచ్చి దండం పెట్టడమే తప్ప ఆ దైవదర్శనానికి వచ్చే భక్తులకు రోడ్డు కూడా వేయించలేకపోయారన్నారు. 2019కి ముందే గుండాల క్షేత్రాన్ని తిరిగి నిర్మించాలనే సంకల్పంతో అనుమతులు పొందినట్లు మంత్రి బుగ్గన స్పష్టం చేశారు. శనివారం ఎస్.గుండాల చెన్నకేశవస్వామి ఆలయ ప్రాంగణంలో అద్భుతంగా తీర్చిదిద్దిన కల్యాణ మండపానికి ఆయన ప్రారంభోత్సవం చేశారు. సకల వసతులతో రూ.5 కోట్లతో నిర్మించిన కల్యాణ మండపం పులివెందుల తర్వాత రాష్ట్రంలో  ఒక్క డోన్ లోనే నిర్మించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ రెండు నియోజకవర్గాలు మినహా మిగతా అన్ని చోట్ల రూ.1.5 కోట్ల నిధులతో టీటీడీ కల్యాణ మండపాలు నిర్మించినట్లు స్పష్టం చేశారు.  డోన్ ప్రజల కోసం కోరిన ప్రతి ఫైల్ పై ఆలోచించకుండా సంతకం పెట్టిన ముఖ్యమంత్రి చలువ వల్లే ఇదంతా సాధ్యమైందన్నారు. ఆలయ ప్రాశస్త్యాన్ని వివరించి చరిత్ర తెలుసుకుని ఎక్కువ నిధులు అడిగినా కాదనకుండా అనుమతించిన మాజీ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చొరవను ఈ సందర్భంగా మంత్రి బుగ్గన గుర్తు చేసుకున్నారు. నాటి చరిత్ర చెక్కు చెదరకుండా ఆలయాన్ని రూ.4.04 కోట్లతో  నిర్మించి పున:వైభవం తీసుకురావడం కోసం సర్వప్రయత్నాలు చేసినట్లు మంత్రి తెలిపారు. ఆలయాన్ని అభివృద్ధి చేయడం వల్ల ఎంతో మందికి ప్రత్యక్ష్యంగా , పరోక్ష్యంగా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయన్నారు. త్వరలోనే డైనింగ్ హాల్, శ్రీశైలం, తిరుపతి దేవస్థానాల తరహాలో కాటేజ్ ల నిర్మించాలనే ఆలోచనలున్నట్లు మంత్రి బుగ్గన స్పష్టం చేశారు. డోన్ నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్డు లేని ఊళ్లుగా మార్చామని మంత్రి తెలిపారు. రేకుల కుంట లాంటి కుగ్రామాలకు సైతం రహదారి వేయడమే నిదర్శనమన్నారు. డోన్ లో నిర్మించిన బీసీ రెసిడెన్షియల్ స్కూల్  భారతదేశంలోనే ఎక్కడా నిర్మించలేదని అందుకు గర్వపడుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. మరో 2 నెలల్లో గుండాలకు కృష్ణా జలాలు తరలి వస్తాయన్నారు. గుక్కెడు నీరు దొరకని గుండాలకు చెరువులు నింపి పంటలు పండే పరిస్థితికి తీసుకొచ్చినట్లు తెలిపారు.


అంతకుముందు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ డోన్ లోని నగరవనంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం నిర్వహించారు. రూ.3.8 కోట్లతో నిర్మించిన నగరవనంలో   పర్యావరణ విద్యా కేంద్రం, ఎకోట్రయినింగ్ సెంటర్ భవన నిర్మాణాలకు ప్రారంభోత్సవం చేశారు. రెస్టారెంట్ ప్రాంగణం, కెఫెటేరియా ప్రాంగణాలను సందర్శించారు. అటవీ శాఖ అధికారులు ఆకర్షణీయంగా ఏర్పాటు చేసిన పులి బొమ్మ వద్ద మంత్రితో ఫోటోలు దిగడానికి ప్రజలు పోటీపడ్డారు. అనంతరం డోన్ లోని కొత్తకోట వద్ద రూ. 20 కోట్లతో జాతీయ స్థాయి డ్రైవింగ్‌ శిక్షణ, పరిశోధన కేంద్ర భవన నిర్మాణ పనులను  ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పరిశీలించారు. ఇప్పటికే భవన నిర్మాణం, వాకింగ్ ట్రాక్ పనులు జరుగుతున్న నేపథ్యంలో త్వరితగతిన పూర్తికి చొరవతీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 


*ప్యాపిలి మండలానికి పర్యాటక శోభ*


ప్యాపిలిలోని వెంగలాంపల్లి చెరువు వద్ద రూ.3 కోట్లతో చేపట్టిన పర్యాటక వసతుల అభివృద్ధికి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రారంభోత్సవం చేశారు. అత్యాధునిక సదుపాయాలతో తీర్చిదిద్దిన పర్యాటక వసతులు స్థానికులను కట్టిపడేస్తున్నాయ్. బోటింగ్, రెస్టారెంట్ సహా ప్రత్యేకమైన ఆర్కిటెక్చర్ తో ఏర్పాటు చేసిన మంత్రి చొరవకు స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. పర్యాటకాభివృద్ధికి సంబంధించి ఏర్పాటు చేసిన పైలాన్ ను మంత్రి బుగ్గన ఆవిష్కరించారు. అనంతరం రెస్టారెంట్ లో స్థానిక నాయకులతో కూర్చుని ముచ్చటించి..టీ తాగారు.


ఈ కార్యక్రమంలో నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానందరెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, మీట్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీరాములు, డోన్ ఎంపీపీ రేగటి రాజశేఖర్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ సప్తశైల రాజేష్, ఆర్డీవో, తహసీల్దార్, తదితరులు పాల్గొన్నారు.



Comments