గ్రామీణ అభివృద్ధి రంగంలో నాబార్డు కృషి అభినందనీయం.

 గ్రామీణ అభివృద్ధి రంగంలో నాబార్డు కృషి అభినందనీయం


నాబార్డు స్టేట్ ఫోకస్ పేపర్ 2024-25 విడుదల

బ్యాంకర్ల 2024-25 ఆర్థిక ఏడాది క్రెడిట్ ప్లాన్‌ కు దిక్సూచిగా ఫోకస్ పేపర్ 

2024-25 కు రాష్ట్ర రుణ ప్రణాళిక రూ..3.55లక్షల కోట్లుగా అంచనా

              రాష్ట్ర వ్యవసాయ శాఖామాత్యులు కాకాణి గోవర్ధన రెడ్డి

అమరావతి,5 ఫిబ్రవరి  (ప్రజా అమరావతి):గ్రామీణాభివృద్ధి రంగంలో నాబార్డు కృషి అభినందనీయమని రాష్ట్ర వ్యవసాయ,మార్కెటింగ్,ఆహార శుద్ధి మరియు సహకార శాఖామాత్యులు కాకాని గోవర్ధన రెడ్డి  కొనియాడారు.సోమవారం నాబార్డు ఆధ్వర్యంలో వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన రాష్ట్ర పరపతి సెమినార్ లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.ఈసందర్భంగా 2024-25 ఆర్ధిక సంవత్సరానికి నాబార్డు రూ..3.55లక్షల కోట్ల అంచనాతో రూపొందించిన స్టేట్ ఫోకస్ పేపర్ 2024-25ను ఆయన  విడుదల చేశారు.ఈసందర్భంగా మంత్రి గోవర్ధన రెడ్డి మాట్లాడుతూ ఈఫొకస్ పేపర్ 2024-25 ఆర్ధిక సంవత్సరానికి రాష్ట్రంలో బ్యాంకరులు రూపొందించనున్న వార్షిక రుణ ప్రణాళిక(ఎసిపి)కు దిక్సూచిగా ఉండనుందని పేర్కొన్నారు. నాబార్డు గ్రామీణ సంక్షేమాన్ని పెంపొందించడంలో చురుకైన పాత్ర పోషించిస్తున్నందుకు అభినందిస్తూ వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న వివిధ సవాళ్ళను,వ్యవసాయ ఆదాయాలలో స్థిరమైన వృద్ధిని సాధించడానికి ప్రభుత్వం కార్పొరేట్ రంగం,ఆర్థిక సంస్థలు తగిన రోడ్‌మ్యాప్‌ తయారు చేయాలని సూచించారు.వ్యవసాయం,నీటిపారుదల,సామాజిక మరియు గ్రామీణ కనెక్టివిటీ రంగాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ఉద్దేశించిన రాష్ట్ర ప్రభుత్వానికి నాబార్డ్ మద్దతు ఇవ్వడం అభినంద నీయమన్నారు.ప్రభుత్వం యొక్క వివిధ ప్రాధాన్య కార్యక్రమా లను పరిగణలోకి తీసుకుని  బ్యాంకర్లు 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక రుణ ప్రణాళిక(క్రెడిట్ ప్లాన్‌)ను తయారు చేసేలా చూసుకోవాలని బ్యాంకర్లను కోరారు.రుణ వితరణ మరియు మౌలిక సదుపాయాల కల్పన ద్వారా సుస్థిర వ్యవసాయాన్ని సాధించాలని అన్నారు.రైతు ఉత్పత్తిదారుల సంఘాలు,వ్యవసాయ ఉత్పత్తుల వేల్యూ చైన్, విలువ జోడింపు మరియు కౌలు రైతులకి సిసిఆర్సి కార్డుదారులకి విరివిగా రుణ సదుపాయం కల్పించాలని మంత్రి గోవర్ధన రెడ్డి బ్యాంకర్లను కోరారు.

కోవిడ్ మహమ్మారి కారణంగా ఏర్పడిన నిరాశాజనకమైన సమయాల్లోను రాష్ట్ర లక్ష్యాలను సాధించడంలో బ్యాంకర్లు చేసిన కృషిని  వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన రెడ్డి అభినందించారు.అందరు బ్యాంకర్లు,డిపార్ట్‌మెంట్లు రుణ మద్దతుతో సుస్థిర వ్యవసాయం, మూలధన నిర్మాణాన్ని వేగవంతం చేయడం మరియు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ వృద్ధి రంగాలను పరిష్కరించడం వంటి లక్ష్యాలను చేరుకోవాలని మంత్రి సూచించారు.

సమావేశంలో నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ ఎంఆర్ గోపాల్ మాట్లాడుతూ 2024-25 ఆర్ధిక సంవత్సరానికి గాను రాష్ట్ర రుణ ప్రణాళిక రూ.3.55లక్షల కోట్లుగా అంచనా వేయడ మైదనని తెలిపారు.వ్యవసాయానికి రూ.2.04లక్షల కోట్లు మరియు పంట రుణాలకు రూ.1.36 లక్షల కోట్లుగా అంచనా వేయడమైనదని తెలిపారు.అంతేగాక రాష్ట్రాభివృద్ధిలో పరపతి కీలక పాత్ర పోషిస్తుంది అని తెలిపారు.ఈరుణ ప్రణాళిక రాష్ట్రంలో రుణాల వితరణకి మరియు మౌలిక సదుపాయాల కల్పనకి బ్యాంకర్లు మరియు రాష్ట్ర ప్రభుత్వానికి దోహదం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.గ్రామీణ ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాల్లో గుర్తించబడిన సామర్థ్యాన్ని వినియో గించుకోడానికి బడ్జెట్ మద్దతు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా భర్తీ చేయగల మౌలిక సదుపాయాల అంతరాలను స్టేట్ ఫోకస్ పేపర్ హైలైట్ చేస్తుందని కూడా ఆయన సూచించారు. ఈపత్రంలో గుర్తించిన రంగాలకి అవసరమైన ఋణం మరియు మౌలిక సదుపాయాలు కల్పించాలని లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్‌లు,స్టేట్ లెవెల్ బ్యాంకర్లు మరియు ప్రభుత్వాన్నికోరారు. నీటిపారుదల ప్రాజెక్టులకు రూ.1986 కోట్లు,తాగునీటి ప్రాజెక్టులకు రూ. 1986 కోట్లు మరియు నాడు నేడు ఆరోగ్యం కింద రూ. 71.68 కోట్లు ఆర్థిక సహాయాన్ని అందించడం ద్వారా రాష్ట్రాభివృద్ధి వేగవంతం చేయడంలో నాబార్డ్ సహకరిస్తోందని పేర్కొన్నారు. 

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ ఆర్కె మహానా మాట్లాడుతూ రాష్ట్ర రుణ ప్రణాళికను తయారు చేయడంలో నాబార్డు చేస్తున్న కృషిని అభినందించారు.బ్యాంకరులు తమ లక్ష్యాలు నిర్దేశించుకోడానికి ఈరుణ ప్రణాలికను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. గ్రామీణ ప్రాంతాలకు ఆర్ధిక అక్షరాస్యత కార్యక్రమాలను తీసుకువెళ్లడంలో నాబార్డు కృషి అభినందనీయమని ఆయన కొనియాడారు.డిజిటల్ విధానం ద్వారా త్వరితగతిన రుణాలు ఇచ్చే సదుపాయం కలిగించే దిశగా రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ కు కృషి చేస్తోందని తెలిపారు.

ఈకార్యక్రమంలో ఎస్ఎల్బిసి కన్వీనర్ ఎం.రవీంద్ర బాబు మాట్లాడుతూ బ్యాంకులు ప్రస్తుత వార్షిక రుణ ప్రణాళికలో ఇప్పటికే 74 శాతం లక్ష్యాన్ని సాధించడం పట్ల ఎస్ఎల్బిసి తరుపున బ్యాంకరులు అందరికీ అభినందనులు తెలిపారు.నాబార్డు రూపొందించిన స్టేట్ ఫోకస్ పేపర్ రానున్న వార్షికి రుణ ప్రణాళిక రూపకల్పనకు మార్గదర్శి కానుందని పేర్కొన్నారు.

ముఖ్య కార్యదర్శి చిరంజీవ్ చౌదరి మాట్లాడుతూ స్టేట్ ఫోకస్ పేపర్ ను తీసుకు రావడంలో నాబర్డు చేస్తున్నకృషిని అభినందించారు.ఫుడ్ ప్రాసెసింగ్ మరియు క్లైమేట్ ఫైనాన్సింగ్‌ పై దృష్టి పెట్టాలని సూచించారు.కమీషనర్ ఆఫ్ కోఆపరేటివ్స్ బాబు ఎ మాట్లాడుతూ ఉత్పత్తుల డిజిటలైజేషన్ కోసం ఆర్‌బిఐహెచ్ ప్లాట్‌ ఫారమ్‌లో అనుసంధానమైన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని తెలియజేశారు.సహకార పరపతి సంఘాల కంప్యూటరీకరణలో నాబార్డ్ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు.

అంతకు ముందు నాబార్డు నాబార్డు జనరల్ మేనేజర్  డా.కెవిఎస్  ప్రసాద్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా స్టేట్ ఫోకస్ పేపర్ లో పొందుపర్చిన వివిధ అంశాలను సెక్టార్ల వారీగా వివరించారు.

ఈసెమినార్ లో ఉద్యానవన శాఖ కమీషనర్ శ్రీధర్,వ్యవసాయశాఖ కమీషనర్ శేఖర్ బాబు,రాష్ట్ర సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ఎండి వీరపాండ్యన్,ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉప కులపతి శారదా జయలక్ష్మి,నాబార్డు డిజియం డిఎస్.ఫణిఖర్ సహా పలువురు నాబార్డు,ఇతర బ్యాంకుల అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Comments