ప్ర‌జ‌ల జీవ‌న ప్ర‌మాణాలు పెంచేందుకే సంక్షేమ ప‌థ‌కాలు.

 


# ప్ర‌జ‌ల జీవ‌న ప్ర‌మాణాలు పెంచేందుకే సంక్షేమ ప‌థ‌కాలు



# మ‌హిళ‌ల గౌర‌వాన్ని పెంచడ‌మే ల‌క్ష్యంగా కార్య‌క్ర‌మాలు


# గ‌రివిడి మండ‌ల ప‌ర్య‌ట‌న‌లో మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌


# గెడ్డ‌పువ‌ల‌స మీదుగా రూ.9 కోట్ల‌తో రోడ్డు, వంతెన నిర్మాణానికి శంకుస్థాప‌న‌


విజ‌య‌న‌గ‌రం, ఫిబ్ర‌వ‌రి 03 (ప్రజా అమరావతి):


రాష్ట్రంలో ప్ర‌జ‌ల జీవ‌న ప్ర‌మాణాలు మెరుగుప‌ర‌చ‌డం, వారి జీవ‌న స్థితిగ‌తులు పెంపుద‌లే ల‌క్ష్యంగా ప్ర‌భుత్వం సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తోంద‌ని విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ అన్నారు. స‌మాజంలో, కుటుంబంలో మ‌హిళ‌ల గౌర‌వాన్ని, వారి విలువ‌ను పెంచేందుకే ప్ర‌తి సంక్షేమ ప‌థ‌కాన్ని వారి పేరుతో ముఖ్య‌మంత్రి శ్రీ వై.ఎస్‌.జ‌గ‌న్ అందిస్తున్నార‌ని చెప్పారు. గ‌రివిడి మండ‌లంలో శ‌నివారం ప‌ర్య‌టించిన మంత్రి గ‌రివిడి నుంచి గెడ్డ‌పువ‌ల‌స మీదుగా దేవుని క‌న‌పాక వ‌ర‌కు రూ.3.60 కోట్ల వ్య‌యంతో నిర్మించ‌నున్న 5.70 కిలోమీట‌ర్ల రోడ్డుకు, పెద్ద‌గెడ్డ‌పై రూ.5.20 కోట్ల‌తో నిర్మించ‌నున్న వంతెన‌కు గెడ్డ‌పువ‌ల‌స‌లో శంకుస్థాప‌న చేశారు. పి.ఎం.జి.ఎస్‌.వై.-3 కింద రోడ్డు వంతెన‌ల‌ను పంచాయ‌తీరాజ్ ఇంజ‌నీరింగ్ విభాగం ఆధ్వ‌ర్యంలో నిర్మించ‌నున్నారు.


ఈ సంద‌ర్భంగా మంత్రి గెడ్డ‌పువ‌ల‌స‌లో మాట్లాడుతూ రోడ్డు, వంతెన నిర్మాణాల‌కు టెండ‌ర్లు కూడా పూర్త‌య్యాయ‌ని త్వ‌ర‌లో ప‌నులు మొద‌లు పెడ‌తామ‌న్నారు. ఒక్క గెడ్డ‌పువ‌ల‌స‌లోనే రూ.10.34 కోట్ల రూపాయ‌లు వివిధ ప్ర‌భుత్వ ప‌థ‌కాల కింద మ‌హిళ‌ల బ్యాంకు ఖాతాల్లో జ‌మ‌చేశామ‌న్నారు. గ‌త ప్ర‌భుత్వాల హ‌యాంలో ఏనాడైనా యీ స్థాయిలో ప‌థ‌కాలు మంజూర‌య్యాయా లేదా అనేది ఆలోచించాల‌న్నారు. నాడు-నేడు ద్వారా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్ని ఎన్నో వ‌స‌తుల‌తో తీర్చిదిద్దుతున్నామ‌ని చెప్పారు. విద్యార్ధుల‌ను గ్లోబ‌ల్ సిటిజ‌న్స్‌గా రూపొందించే కార్య‌క్ర‌మాలు చేప‌ట్టామ‌న్నారు.


ఈ కార్య‌క్ర‌మంలో జిల్లాప‌రిష‌త్ ఛైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు, ఎం.పి. బెల్లాన చంద్ర‌శేఖ‌ర్‌, పంచాయ‌తీరాజ్ ఎస్‌.ఇ. బి.ఎస్‌.ఆర్‌.గుప్తా, మండ‌ల‌స్థాయి నాయ‌కులు పాల్గొన్నారు.


Comments