పేదలకు ఒక న్యాయం, పెద్దలకు మరో న్యాయం ఉండటానికి వీల్లేదు.


ఎన్‌.అగ్రహారం, ఒంగోలు, ప్రకాశం జిల్లా (ప్రజా అమరావతి);



*పేదల ఇంటి స్ధలాల రిజిస్టర్డ్‌ కన్వేయన్స్‌ డీడ్స్‌(సర్వహక్కులతో భూ బదిలీ పత్రం) పంపిణీ.*


*ప్రకాశం జిల్లా ఒంగోలు మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 20,840 మంది పేద అక్కచెల్లెమ్మలకు సర్వహక్కులతో రిజిస్టర్‌ చేసిన ఇంటి స్ధలం భూ బదిలీపత్రం, కట్టుకోవడానికి ఇళ్లు కూడా మంజూరు చేసి, ఆ పత్రాలు కూడా పంపిణీ.*

*దీంతో పాటు నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు క్రింద రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా పంపిణీ చేసిన 31.19 లక్షల ఇళ్ల స్ధలాలను ఆ పేద అక్కచెల్లెమ్మల పేరుమీదగానే సంపూర్ణ హక్కులు కల్పిస్తూ, రిజిస్ట్రేషన్‌ కూడా చేసి కన్వేయన్స్‌ డీడ్స్‌ అందించే కార్యక్రమాన్ని ఒంగోలులో లాంఛనంగా ప్రారంభించిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌.*


*ఈ సందర్బంగా హాజరైన లబ్ధిదారులు, ప్రజల నుద్దేశించి ప్రసంగించిన ముఖ్యమంత్రి.*


*సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే....:*


మనసునిండా మమకారంతో ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చి చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ఆప్యాయతలకు, ప్రేమానురాగాలు చూపిస్తున్న ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ, ప్రతి అవ్వాతాతకు, ప్రతి సోదరుడికీ, ప్రతి స్నేహితుడికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.



దేవుడిదయ ప్రజలందరి చల్లని దీవెనలతో ఈరోజు పేదలందరికీ కూడా మరో మంచి కార్యక్రమం ఇవాళ ఇక్కడ నుంచి జరుగుతుంది. ఏకంగా 31 లక్షల పేదలకు ఇళ్లపట్టాలను పొజిషన్‌ సర్టిఫికేట్ల రూపంలోనూ, అన్‌డివైడెడ్‌ షేర్‌ ప్లాట్ల రూపంలోనూ, డీపట్టాల రూపంలోనూ దేశ చరిత్రలో ఈ రకంగా 31లక్షల మంది పేదలకు మంచి చేస్తూ... ఇవాళ ఆ అక్కచెల్లెమ్మలకుఇచ్చిన డిపట్టాలను సైతం రిజిస్ట్రేషన్‌ చేసి వారి చేతుల్లో పెట్టే మంచి కార్యక్రమం ఇవాళ ఒంగోలు నుంచి జరుగుతుంది.



*రాష్ట్రంలో పేదలకు ఇళ్ల స్ధలాలిచ్చే కార్యక్రమం*

రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్ల స్ధలాలిచ్చే కార్యక్రమం, వారికి శాశ్వతంగా మేలుచేస్తూ అడుగులు వేస్తూ.. ఇళ్ల నిర్మాణ విషయంలో గత ప్రభుత్వానికి మనందరికి ప్రభుత్వానికి తేడా ఎంతుందో ఒక్కసారి గమనించండి.


మనం చేసే ప్రతిపని ఈ 58 నెలల కాలంలో వేసిన ప్రతిఅడుగు ప్రతి అడుగూ పేదల జీవితాలు మారాలి, వారి బతుకులు మారాలి, పేద పిల్లలు ఎదగాలి, భవిష్యత్‌ లో పేదరికం నుంచి బయటకొచ్చే పరిస్థితి రావాలని ప్రతి అడుగూ పడింది. 

పేదలకు ఒక న్యాయం, పెద్దలకు మరో న్యాయం ఉండటానికి వీల్లేద



ని, పేదలకిచ్చే ఇళ్ల పట్టాలను కూడా రాష్ట్రంలో ఐఏఎస్‌ అధికారులకు గానీ, లేకపోతే ఇతర ప్రముఖులకు, ఎమ్మెల్యేలకు  పట్టాలు ఇచ్చినప్పుడు, ఏ నిబంధనలైతే వాళ్లకు పెడతామో అటువంటి నిబంధనలే, అటువంటి రిజిస్ట్రేషన్‌ ఇచ్చి కన్వేయన్స్‌ డీడ్‌ ఇచ్చేలా మన పేదలందరికీ జరగాలని, మొట్ట మొదటి సారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా... పేదలకిచ్చే ఇళ్లపట్టాలను డీపట్టాలుగా కాకుండా ఏకంగా రిజిస్ట్రేషన్‌ చేసి ఇచ్చే కార్యక్రమం జరుగుతోంది. 


రాష్ట్రంలో ప్రజలకు రెండు రకాల నిబంధనలు ఉండటం నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది.  నాకు మొట్టమొదట తెలియదు. తెలుసుకున్నప్పుడు నాకే ఆశ్చర్యం అనిపించింది. ఏ రాష్ట్రానికి అయినా పేదలకు ఒకరకంగా, పెద్దలకు ఇంకో రకమైన నిబంధనలు ఉండటం ఏ రాష్ట్రానికైనా మంచిది కాదు. 


77 ఏళ్ల స్వాతంత్య్రం తరువాత కూడా మన రాష్ట్రంలో ఈ రకంగా రెండు రకాల విధానాలు ఉండటంపై తిరగుబాటు చేస్తూ మనందరి ప్రభుత్వం పరిపాలన సంస్కరణలు తీసుకొచ్చింది. 

ఇళ్లపట్టాల విషయంలో కాకుండా... ఈ 58 నెలల మన ప్రయాణంలో ప్రతి అడుగూ కూడా ఒక విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చే విధంగా అడుగులు పడ్డాయి. 

గ్రామానికి, గ్రామ ప్రజలకు, పట్టణ ప్రజలకు అందించే పౌర సేవల విషయంలోనైనా, ఇంటింటికీ తలుపు తట్టి అందించే సేవల విషయంలో అయినా ఇలా అన్నింటిలోనూ.. విప్లవాత్మకమార్పులు తెచ్చి మనందరి ప్రభుత్వం అడుగులు ముందుకు వేసింది. 


ఈ విప్లవాలకు మూలం.. పేదలకోన్యాయం, పెద్దవారికో న్యాయం అన్న విధానాన్ని ప్రతి అడుగులోనూ మార్చేయాలి అనే తపన, తాపత్రయంతో పడిన అడుగులు. 

పేదల పిల్లలకు గవర్నమెంట్‌ బడి.. ఆ గవర్నమెంట్‌ బడిలో తెలుగు మీడియం మాత్రమే. అదే డబ్బులున్న వారికి, వారి పిల్లలకుప్రయివేటు బడులు, వాటిలో ఇంగ్లీషు మీడియం. 

కేవలం ఇద్దరి మధ్య తేడా డబ్బులుండటం మాత్రమే. ఇది మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు ఉన్న పరిస్థితి. 


ఇప్పుడు పేద పిల్లలకు ఇంగ్లీషు మీడియం, అది కూడా మన గవర్నమెంట్‌ బడుల్లోనే. కార్పొరేట్‌ బడులకు పోటీగా మన గవర్నమెంట్‌ బడుల్లో నాడునేడుతో సమూల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పిల్లలకిచ్చే టెక్ట్స్‌బుక్స్‌ బైలింగువల్‌.  ఒక పేజీ తెలుగు, మరో పేజీ ఇంగ్లీష్‌. 


మొట్ట మొదటి సారిగా పిల్లలు చదువుకుంటున్న చదువుల్లో బైజూస్‌ కంటెంట్‌ ను అనుసంధానం చేస్తూ తీసుకొచ్చాం. గవర్నమెంట్‌ బడుల్లో పిల్లలకు 8 వ తరగతి రాగానే వారి చేతుల్లో ట్యాబ్స్‌ పెట్టి ప్రయివేటు, కార్పొరేట్‌ బడులకన్నా ఇంకా గొప్ప స్థాయిలో ట్యాబులచ్చి నడిపిస్తున్నాం. 


పేద పిల్లలు వెళ్లే గవర్నమెంట్‌ బడులు మారాయి. ఆ బడులలో 6వ తరగతి నుంచి ప్రతి క్లాసు రూములో డిజిటల్‌ బోధన. ఐఎఫ్‌ పీ ప్యానల్స్‌. ఆ బడులలో పేద పిల్లలు కాన్వెంట్‌ డ్రస్, షూస్, చిక్కటి చిరునవ్వులతో పిల్లలు కనిపిస్తారు.

ఇంగ్లీషు మీడియం మొదలు , సీబీఎస్‌ఈ నుంచి ఈరోజు కార్పొరేట్‌ బడులు కూడా పోటీ పడటానికి కష్టపడేలా ఐబీ దాకా గవర్నమెంట్‌ బడులను తీసుకుని పోతున్నాం. 


పెద్ద చదువులు చదివే పిల్లలకు వంద శాతం పూర్తి ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ ఇస్తూ విద్యాదీవెన,  వసతి దీవెనతో మొదలు కేంబ్రిడ్జ్, ఆక్స్‌ ఫర్డ్, ఎంఐటీ, హార్వర్డ్‌ లాంటి విశ్వవిద్యాలయాల్లో ఉచితంగా ఆన్లైన్‌ లో కోర్సులు చదువుకునేందుకు కూడా మనందరి ప్రభుత్వమే ఏర్పాటు చేసింది.


ఆలోచన చేసి, బుర్రకు పదును పెట్టమని అడుగుతున్నాను. డబ్బులేని వారి పిల్లలకు, డబ్బున్న వారి పిల్లలకు మధ్య చదువులపరంగా అంతరాన్ని చెరిపేయడం అంటే ఇదీ అని చెప్పడానికి గర్వపడుతున్నాను. పేద పిల్లలను ప్రపంచంలోకి చేయి పట్టుకొని తీసుకెళ్లడం అంటే ఇదీ. 



*ఆరోగ్యరంగంలోనూ- అంతరాలను చెరిపే వైద్యం*

అలాగే వైద్య ఆరోగ్య రంగాన్ని తీసుకోండి. మనం రాకముందు ధనికులకు మాత్రమే అందుబాటులో ఉండే కార్పొరేట్‌ వైద్యం.. మనం వచ్చిన తర్వాత పేదలకు కూడా అందుబాటులోకి వచ్చింది. 


ఆరోగ్యశ్రీలో ప్రొసీజర్స్‌ 1000కి మాత్రమే పరిమితం చేసిన పరిస్థతి నుంచి ఇప్పుడు 3300 ప్రొసీజర్లకు తీసుకుపోయిన పరిస్థితి మనం వచ్చిన తర్వాతే జరిగింది.  రూ.25 లక్షల వరకు వైద్య సేవలకు సంబంధించి ప్రొసీజర్స్‌ అన్నీ కూడా ఉచితంగా ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చింది కూడా మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాతే. 

ఆరోగ్యశ్రీయే కాదు.. పేదవాడు కార్పొరేట్‌ ఆస్పత్రికి వెళ్లడమే కాకుండా వైద్యులు ఆపరేషన్‌ చేసిన తర్వాత పేదవాడు విశ్రాంతి  తీసుకొనే పీరియడ్‌ లో కూడా నెలకు రూ. 5 వేలు ఆ పేదవాడి చేతిలో పెడుతూ ఆరోగ్య ఆసరా వచ్చింది కూడా మీ బిడ్డ ప్రభుత్వంలోనే. 


ఇవాళ పేదలు ఉండే ఇంటి వద్దే వైద్య సేవలందించే విలేజ్‌ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్, పేదల ఇళ్లలో జల్లెడ పడుతూ పేదలకు ఏ రకమైన ఆరోగ్య సమస్య ఉన్నా.. ఆరోగ్య సురక్ష కార్యక్రమంతో జల్లెడ పడుతూ పేదవాడికి ఉచితంగా వైద్యం చేయించడం, మందులివ్వడం ఇవన్నీ కూడా పేదల ఇంటి వద్దకు వచ్చి తలుపు తడుతున్నది కూడా ఎప్పుడంటే మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే. 

నేను చెప్పే ప్రతి మాటా కూడా ఆలోచన చేయమని అడుగుతున్నాను. ఇంతకు ముందుకు ఇప్పటికి మధ్య తేడాను గమనించమని అడుగుతున్నాను. పేదలకు అందే వైద్యం పరంగా అంతరాలను చెరిపేయడం అంటే ఇది. పేదలకు, పెద్దలకు ఒకేరకమైన వైద్యం అందించడం అంటే ఇదీ. 


*పేదింటి అక్కచెల్లెమ్మల సాధికారత కోసం..*

అక్కచెల్లెమ్మలు సంతోషంగా ఉండాలి, అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదు. వారు తమ పిల్లల్ని బాగా పెంచగలగాలి. వారికి ఇబ్బందులు రాకూడదని, పేదింటి అక్కచెల్లెమ్మల సాధికారత కోసం వైయస్సార్‌ ఆసరా,. సున్నావడ్డీ, చేయూత, అమ్మ ఒడి, ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణం, ప్రతి ఫోన్లోనూ దిశ యాప్, 

గ్రామంలో అక్కచెల్లెమ్మలకు మరింత భద్రత ఉండాలని సచివాలయంలో మహిళా పోలీసు. ఇవన్నీ కూడా నా అక్కచెల్లెమ్మలకు ఆర్థిక సాధికారత, భద్రత రెండూ కూడా ఇవాళ అందిస్తున్నాయి. ఇవన్నీ కూడా గతంలో లేవు. మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే వచ్చాయి. 


ఈ పథకాల ఫలితంగానే అక్కచెల్లెమ్మల ఆర్థిక సాధికారత పెరిగింది. ఆర్ధిక సాధికారత పెరిగి అంతరాలు తగ్గుతున్నాయని నేను చెప్పడమే కాదు.. నిన్ననే వచ్చిన జాతీయ గణాంకాలు కూడా ఇదే నిరూపిస్తున్నాయి. ఇవన్నీ మన కళ్లముందే కనిపిస్తున్నాయి. అక్కచెల్లెమ్మల మధ్య ఆర్థిక అంతరాలను చెరిపేయడం అంటే ఇదీ. 


నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ వర్గాలకు నా నిరుపేదలకు గడచిన ఈ 58 నెలల్లో అందించిన డీబీటీ.. అంటే నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి బటన్‌ నొక్కడం ద్వారా ఏకంగా రూ.2.55 లక్షల కోట్లు నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి, ఇంటింటికీ అందించిన ఈ డబ్బులో 75 శాతం పైచిలుకు నా..నా..నా అని నేను పిలుచుకొనే పేద సామాజికవర్గాలకే అందించగలిగాం. 


గతంలో ఎప్పుడూ జరగని విధంగా, అందని విధంగా నామినేటెడ్‌ పదవుల్ని, ఆలయాల్లో బోర్డు చైర్మన్లుగానీ, మార్కెట్‌ కమిటీల్లో ఉన్న చైర్మన్‌ పదవులు గానీ, మేయర్‌ పదవులు, మున్సిపల్‌ చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు, డిప్యూటీ సీఎం, స్పీకర్, కౌన్సిల్‌ చైర్మన్‌ పదవులు ఇలాంటివన్నీ రావాలంటే... కేవలం పెత్తందార్ల మనుషులు మాత్రమే అనుభవించిన ఈ నామినేషన్‌ పదవుల్ని ఏకంగా చట్టం చేసి 50 శాతం పేదల చేతుల్లో పెట్టింది కూడా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే. 

సామాజిక అంతరాలను చెరిపేయడం అంటే ఇదీ. ఇదీ సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధికారత అంటే ఇదీ. 


ఇప్పుడు ఇచ్చే ఇళ్ల పట్టాల విషయంలో కూడా నేను ఆరోజు అధికారులందరినీ ఒకటే అడిగాను. మీకు, ఎమ్మెల్యేలకు ఇతర ప్రముఖులకు గవర్నమెంట్‌ ఇచ్చే పట్టాలు ఎలా ఇస్తోందని అడిగాను. దానికి వేరే పద్ధతుంది అని చెప్పారు. 


*ప్రముఖులకు ఇచ్చినట్టే పేదలకు కూడా...*

అప్పుడు నేను ప్రముఖులకు ఇచ్చే విధానంలోనే, అవే పూర్తి హక్కులతోనే రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదకూ ఇంటి పట్టాలివ్వాలని ఆదేశాలివ్వడమే కాకుండా దాన్ని చట్టంగా కూడా ఆమోదించి, చట్టంలో మార్పులు చేసి ఈరోజు నా పేద కుటుంబాలన్నింటికీ అవే పూర్తి హక్కులతో ఈరోజు పట్టాలన్నీ రిజిస్ట్రేషన్‌ చేసి కన్వేయన్స్‌ డీడ్‌ నా అక్కచెల్లెమ్మల చేతుల్లో పెడుతున్నాం. ఇదీ.. మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే. 


*పేద, ధనిక అనే భావాలను తుడిచిపెట్టేందుకే...*

పేదల ఆంధ్రప్రదేశ్‌ వేరు. డబ్బులున్న వారి ఆంధ్రప్రదేశ్‌ వేరు అన్న భావాలను పూర్తిగా తుడిచి వేసేందుకు, పేదలకోన్యాయం, డబ్బులున్న వారికో న్యాయం అన్న విధానాల్ని రద్దు చేసేందుకు,  మనందరి పేదల ప్రభుత్వం ఇలా ప్రతి అడుగులోనూ ముందుకే అడుగులు పడ్డాయి.  

అందులో భాగంగానే ఇవాళ  ఒంగోలు నుంచి ప్రారంభిస్తున్న, రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తున్న పట్టాలు. ఈ పట్టాల వల్ల జరిగే మార్పు ఏమిటో తెలుసా? 


రిజిస్ట్రేషన్‌ చేసి అక్కచెల్లెమ్మలకు ఇస్తున్నాం. ఇలా డాక్యుమెంట్‌ రిజిస్ట్రేషన్‌ అయ్యి ఉంది కాబట్టి ఆ ఆస్తి మీద అక్కచెల్లెమ్మలకున్న హక్కులు భద్రంగా ఉంటాయి. దొంగ సర్టిఫికెట్లు సృష్టించే వీలుండదు, ఎప్పుడు పడితే అప్పుడు క్యాన్సిల్‌ చేసే కార్యక్రమం చేయలేరు. 


మీ సమీపంలోనే.. 15 వేల గ్రామ, వార్డు సచివాలయాలకే వచ్చిన ఆ సబ్‌ రిజిస్ట్రార్‌ సేవల ద్వారా అక్కడే సచివాలయాల్లోనే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ ఆస్తికి సంబంధించిన సర్టిఫైడ్‌ కాపీలు ఎన్నిసార్లయినా పొందవచ్చు. అందులో హక్కుదారు మీరే అన్నది శాశ్వతంగా భద్రంగా సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ విభాగంలో ఉంటుంది. 

మీ పట్టాలను ఎప్పుపడితే అప్పుడు ఎవరు పడితే వారు మీ పట్టాలు క్యాన్సిల్‌ చేయడం, లాక్కొనే కార్యక్రమాలు, మీకు లేవు అని చెప్పే కార్యక్రమాలన్నింటికీ చెక్‌ పెట్టాం. 

సరిహద్దులన్నీ పూర్తిగా నిర్ణయించి, సరిహద్దు రాళ్లు పాతి మీ స్థలం ఇదీ అని చెప్పి హక్కుదారులైన అక్కచెల్లెమ్మలను ఆ స్థలంలో నిలబెట్టి, ఫొటో తీసి జియోట్యాగింగ్‌ చేసి వారికి పట్టాలు ఇస్తున్నాం కాబట్టి ఇక ఎవరూ ఆ ఇళ్ల పట్టాలను కబ్జా చేయలేరు. 


*సర్వహక్కులతో పట్టాలు.*

10 సంవత్సరాలు కాగానే ఈ పట్టాలు ఆటోమేటిక్‌ గా అక్కచెల్లెమ్మలు అమ్ముకునేందుకు, ఎవరికైనా వారసత్వంగా ఇచ్చేందుకు, గిఫ్ట్‌ గా ఇచ్చేందుకు, పట్టాభూములున్న వారితో సమంగా మిగతా హక్కులన్నీ కూడా ఈ పట్టాలు పొందిన పేదలందరికీ అవే హక్కులు లభిస్తాయి. 

10 సంవత్సరాల తేదీ తర్వాత ఏ తేదీ నుంచి సర్వహక్కులు లభిస్తాయో... ఆ తేదీతో సహా స్పష్టంగామీకు ఇచ్చే రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌ లో పేర్కొని ఉంది. 

డీ పట్టా భూమిని రిజిస్ట్రేషన్‌ భూమిగా మార్చేందుకు 10 సంవత్సరాల తర్వాత మళ్లీ ఎన్‌వోసీ కావాలని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదు. ఆటోమేటిక్‌ గా ఇవన్నీ జరిగిపోతాయి. 


అంతే కాకుండా రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌ మీ చేతుల్లో ఉంది కాబట్టి... బ్యాంకు రుణాలు కూడా ఎవరికి కావాలన్నా సులభంగా తక్కువ వడ్డీకే అక్కచెల్లెమ్మలకు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. 

ఇంతగా నా అక్కచెల్లెమ్మల గురించి, నా పేదల గురించి వారికి ఇచ్చే స్థలాల గురించి, వారికి దక్కాల్సిన హక్కుల గురించి వారికి ఇచ్చే ఆస్తుల గురించి ఇంటి స్థలాలు, ఇళ్ల నిర్మాణం ద్వారా, వారికి దక్కాల్సిన ఆత్మగౌరవం గురించి ఇంతగా ఆలోచన చేస్తున్న ప్రభుత్వం గతంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చూశారా?


అక్కచెల్లెమ్మలకు మంచి అన్నగా, మంచి తమ్ముడిగా ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో వాళ్ల బిడ్డ ఉన్నాడు కాబట్టే ఇవన్నీ జరుగుతున్నాయని ప్రతి అక్కచెల్లెమ్మ ఆలోచన చేయాలని కోరుతున్నాను.


ఇంతగా గ్రామ స్వరాజ్యానికి, పేదల స్వరాజ్యానికి అర్థం చెబుతున్న ప్రభుత్వం మనది మాత్రమే. ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాల విషయంలో ఎన్నికల మేనిఫెస్టోలో మనం ఏం చెప్పామో, తు.చ. తప్పకుండా పాటిస్తున్నాం. ఇచ్చిన మాట నిలబెట్టుకొనే క్రమంలో మన ప్రతిపక్షం çసృష్టించిన అవరోధాలన్నీ దాటుకుంటూ దేవడి దయతో ఈరోజు అక్కచెల్లెమ్మలకు మంచి చేసే విధంగా వేగంగా అడుగులు వేయగలుగుతున్నాం. 


అధికారంలోకి వచ్చిన 2019లోనే అందరికీ స్థలాలు ఇవ్వడానికి చర్యలు ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా 71,811 ఎకరాల భూమిని సేకరించి గుర్తించి పంపిణీ చేశాం. 

ప్రయివేటు లే అవుట్‌ లకు ధీటుగా ఇళ్లు కాదు.. ఊర్లు నిర్మించే సంకల్పంతో ఏకంగా 17,005 లే అవుట్‌ లను పేదల ఇళ్ల స్థలాలకు అన్ని క్లియరెన్స్‌లు తీసుకొచ్చి, అంతర్గత రోడ్లు, డ్రెయినేజీలు, కరెంటు, మంచినీటి సదుపాయాలు, పార్కులు, కామన్‌ ఏరియాలు, ఇతర సదుపాయాలతో రూ.32 వేల కోట్లు ఖర్చు చేస్తూ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తూ అడుగులు పడుతున్నాయి. 


ఇలా ఇచ్చిన స్ధలాలలో 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించడం, ఇప్పటికే అందులో 8.90 లక్షల ఇళ్లు పూర్తి చేయడం, మిగతా ఇళ్లు కూడా వివిధ దశల్లో వేగంగా అడుగులు పడుతున్నాయి. 

లే అవుట్లు చేసిన ఈ ఇంటి స్థలాల విలువ రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ప్రాంతాలను బట్టి రూ. 2.5 లక్షల నుంచి రూ.15 లక్షల దాకా ఉంది. 

ఇదే ఒంగోలులో ఇక్కడ ఇస్తున్న 2 లేఅవుట్లలో ఈ చుట్టుపక్కల లే అవుట్లు రేట్లు ఎంతున్నాయని అడిగాను. ఇక్కడి అక్కచెల్లెమ్మలకిచ్చే ఇంటి స్థలం విలువ గజం రూ.10 వేల పైచిలుకే అన్నారు అధికారులు.  అక్షరాలా రూ.6 లక్షల పైపాటే అని అంటున్నారు.

ఈ రెండు లేఅవుట్లలో అక్కచెల్లెమ్మలకు ఇచ్చే స్థలం విలువే రూ.6 లక్షలు అయితే, ఇందులో రూ.2.70 లక్షలు ఖర్చు చేసి ఇళ్ల కట్టించి ఆ తర్వాత రోడ్లు, డ్రెయినేజీ, కరెంటు సదుపాయాలకోసం మరో రూ. 1లక్ష ఖర్చు చేస్తూ ఇల్లు పూర్తయ్యే సరికే  నా ప్రతి అక్కచెల్లెమ్మ చేతిలో ఒంగోలులో ఇంటి విలువ అక్షరాలా రూ. 10 లక్షలు పైమాటే అని చెప్పడానికి సంతోషపడుతున్నాను. 

అక్కచెల్లెమ్మలను లక్షాధికారి కాదు.. మిలియనీర్లుగా చేస్తున్నాం. అంటే రూ.10 ల క్షల అధికారులుగా చేస్తున్నాం. 

రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల ఇళ్ల స్ధలాలలో ఇళ్ల నిర్మాణాన్ని కూడా మన ప్రభుత్వమే వేగంగా అడుగులు వేస్తూ పూర్తి చేస్తోంది.



*30 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.2-3 లక్షల కోట్ల ఆస్తి*

ఏకంగా ప్రతి అక్కచెల్లెమ్మ చేతిలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతాన్ని బట్టి  ఇంటి స్ధలం విలువ రూ.2.50 లక్షల రూ.15 లక్షల వరకు పలుకుతుంది. ఆ ప్రాంతాల్లో మరో రూ.2.70 లక్షలతో కడుతున్న  ఇళ్లు పూర్తయితే... ప్రతి అక్కచెల్లెమ్మల చేతిలో అప్పుడు రూ. 7–20 లక్షల రూపాయలు పెట్టినట్లవుతుంది. 


30లక్షల మంది అక్కచెల్లెమ్మల చేతుల్లో ఏకంగా రూ. 2 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల వరకు కేవలం ఈ ఒక్క పథకం ద్వారా నా అక్కచెల్లెమ్మల చేతుల్లతో పెట్టినట్లవుతుందని చెప్పడానికి గర్వపడుతున్నాను. 

ఈ మాదిరిగా ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు. గత ప్రభుత్వ 5 సంవత్సరాల పాలన చూశారు. ఎప్పుడైనా పేదల గురించి ఇంతగా ఆలోచన చేసిన పరిస్థితులు ఉన్నాయా? 


2020 ఉగాది నాటికే ఈ ఇళ్ల పట్టాలను రిజిస్ట్రేషన్‌ చేసి నా పేదఅక్కచెల్లెమ్మలకు ఇవ్వాలనుకున్నాం. మంచి కోసం యజ్ఞం జరుగుతుంటే రాక్షసులు అడ్డుకొనేవారు అని గతంలో పురాణాలు చదివేటప్పుడు విన్నాం. 


గతంలో 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు.. ఒక్క పేదవాడికి ఒక్క సెంటు స్థలం ఇచ్చిన పాపాన పోలేదు. కానీ మనం ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి అడుగులు ముందుకు వేస్తే వీలు లేదనే అక్కసుతో చంద్రబాబునాయుడుగారు, ఆయన వేయించిన కేసులెన్నో తెలుసా?



*ఏకంగా 1191 కేసులు వేసిన దుర్మార్గులు.* 

పేదలకు మీ బిడ్డ ఇళ్లు కట్టడానికి, ఇళ్ల స్ధలాలివ్వడానికి మీ బిడ్డ ముందుకు వస్తుంటే...  రాక్షసుల్లా అడ్డుకొనేందుకు చంద్రబాబు, ఆయన మనుషులు వేసిన కేసులు ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 1191 కేసులు ఈ దుర్మార్గులు వేశారు. 

కేవలం మీ బిడ్డ నా అక్కచెల్లెమ్మలకు ఇంటి స్థలాలు, ఇంటి పట్టాలు ఇవ్వకూడదని ఇంత దుర్బుద్ధితో 1191 కేసులు వేస్తే ఇవన్నీ చూసినప్పుడు అర్థమయ్యేదేమిటంటే.. పేదలకు కావాల్సింది స్థలం.. పెత్తందారీ బాబు ఇచ్చింది పేదలకు కష్టాలు, పేదలకు కన్నీరు. 

బాబు çసృష్టించిన ఈ న్యాయపరమైన ఈ అడ్డంకులు దాటుకుంటూ ఈరోజు ఒక్క ఒంగోలులోనే ఏకంగా 21 వేల పేదలకు ఇళ్లపట్టాలిస్తున్నాం. 


ఒంగోలు అర్బన్‌లోనే, నిరుపేదల ఇళ్ల స్థలాల కోసం ఎర్రజెర్ల హిల్స్‌ లో 866ఎకరాల భూమిని  2020లోనే గుర్తించి 24 వేల ప్లాట్లతో లేవుట్లు అభివృద్ధి చేసి  పేదలకు ఇంటి స్ధలాలు పంపిణీ చేయడానికి సిద్ధం చేయడం జరిగింది. అయితే, ఈ గొప్ప కార్యక్రమానికి చంద్రబాబు, ఆయన మనుషులు కోర్టులో కేసు వేశారు. అడ్డుకున్నారు. 


ఇవన్నీ అధిగమించి మీ బిడ్డ అడుగులు వేశాడు. ఇప్పుడు కూడా దీన్ని కూడా అడ్డుకొనేందుకు చంద్రబాబు హైకోర్టులో మరలా కేసు వేశాడు. ఆలోచనచేయమని అడుగుతున్నాను. వీళ్ల బుద్ధులు ఎలా ఉన్నాయో.


ఎలాగైనా నా అక్కచెల్లెమ్మలకు పట్టాలివ్వాలని...

వారు ఎంతకు తెగించినా, ఎంతగా దిగజారినా, ఎలాగైనా నిరుపేదలకు, అక్కచెల్లెమ్మలకు ఇంటి పట్టాలు ఇవ్వాలన్న సంకల్పంతో ఇదే ఒంగోలు మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో మల్లేశ్వరపురం, ఎన్‌.అగ్రహారం, వెంగముక్కపాలెం, ఎర్రజెర్ల గ్రామాలకు చెందిన 342 మంది రైతన్నల దగ్గర నుంచి 536 ఎకరాల భూమి సేకరించి ఏకంగా రూ.210 కోట్ల డబ్బు ఖర్చు చేసి నా అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 

మరో 21 కోట్లు ఈ లేఅవుట్‌ అభివృద్ధి కోసం ఖర్చు చేస్తున్నాం. మొత్తం రూ.230 కోట్లు ఖర్చు చేసిన తర్వాతే మీ బిడ్డ మీ దగ్గరకు వచ్చి మీ అన్నగా మీతో మమేకమయ్యాడు. 


ఇదే ఎన్‌.అగ్రహారంలో, మల్లేశ్వరపురంలో 31 బ్లాక్స్‌ లో, వెంగముక్కపాలెం, ఎర్రజెర్లలో మరో 32 బ్లాక్స్‌ తో జగనన్న మోడల్‌ టౌన్‌ షిప్స్‌ కు పూర్తి మౌలిక వసతులతో అభివృద్ధి చేస్తున్నాం. 

ఎస్టీపీ ప్లాంట్, అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ, వాటర్‌ సప్లయ్‌ కోసం మరో రూ.247 కోట్లు ఖర్చు చేసేలా ఆదేశాలివ్వడం జరిగింది. 


ఒంగోలు పట్టణానికి, ప్రజలకు మంచి జరిగిస్తూ మరో రూ. 334 కోట్లతో ఒంగోలులో తాగునీటి ఎద్దడిని నివారించే డ్రింకింగ్‌ వాటర్‌ స్కీముకు కూడా ఈరోజే ఇక్కడే శంకుస్థాపన చేయడం జరిగింది. 



*ప్రతి జిల్లాలోనూ బాబుది ఇదే దుర్మార్గం.*

ఒకవైపున పేదవాడి గురించి, ప్రజల గురించి మనం ఇన్ని అడుగులు వేగంగా వేస్తుంటే, మరోవైపున ఒక్క ఒంగోలే కాదు, ఏ జిల్లాను చూసినా బాబు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు, మనం ఇస్తుంటే బాబు అసూయ దాగటం లేదు. 

ప్రతి జిల్లాలో బాబుది ఇదే దుర్మార్గం. పేదల ఇంటి నిర్మాణాలు అడ్డుకుంటూ కేసులు వేయించడం ఆయనకు సహజ అలవాటుగా మారింది. 


*బాబుది వందమంది విలన్ల దుర్మార్గం*

ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు,ఇవన్నీ చూస్తే అనిపిస్తుంది.. వంద మంది సినిమా విలన్ల దుర్మార్గం కంటే.. పురాణాల్లో మనం కథలు కథలుగా విలన్లుగా చెప్పుకొనే రాక్షసులందరికంటే కూడా.. ఒక్క బాబు దుర్మార్గం వీళ్లందరి విలన్ల కంటే ఎక్కువ అనిపిస్తుంది. 


అమరావతి అని వీళ్లు చెప్పుకుంటున్న రాజధాని. చివరికి ఆ అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే అక్కడ ఇవ్వడానికి వీల్లేదన్నారు. పేదలకు ఇళ్లు ఇస్తే.. డెమోగ్రఫిక్‌ ఇంబ్యాల్స్‌ వస్తుందట. కులాల మధ్య సముతుల్యం దెబ్బతింటుందని ఏకంగా నిస్సిగ్గుగా ఈ పెద్దమనిషి కోర్టుల్లో సైతం కేసులు వేసి తన లాయర్లను పెట్టి అమానుషంగా వాదించాడు. ఇన్ని దుర్మార్గాలు చేసి కూడా బాబు ప్రజా జీవితంలో జంకు, గొంకు లేకుండా ఉండగలుగుతున్నాడంటే ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా ఉంటుందా? ఆలోచన చేయండి. 


*రాజకీయాల్లో  బాబుది పాపిస్టి జీవితం..*

గవర్నమెంట్‌ బడుల్లో ఇంగ్లీషు మీడియం వద్దని వాదించి కూడా ఆ తల్లిదండ్రులంతా ఈ చంద్రబాబుకు గుణపాఠం చెబుతారనే భయం లేకుండా, చంద్రబాబు రాజకీయాల్లో  పాపిస్టి జీవితం కొనసాగించగలుగుతున్నాడంటే ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా? 

ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటూ చంద్రబాబు ఎస్సీ కులాల్లో పుట్టాలని ఎవరైనా పుట్టాలనుకుంటారా అని అన్యాయమైన స్టేట్‌ మెంట్‌ ఇచ్చి, ఎస్సీలంతా గుణపాఠం చెబుతారనే భయం లేకుండా, బాబు రాజకీయంగా బరితెగించి ఉండగలుగుతున్నాడంటే ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా? 

బీసీల తోకలు కత్తిరిస్తా, ఖబడ్దార్‌ అని కూడా బాబు ఈ రాష్ట్ర రాజకీయాల్లో బీసీలంతా తనకు గుణపాఠం చెబుతారన్న భయం కూడా లేకుండా అలా ఉండగలుగుతున్నాడంటే ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా? ఆలోచన చేయండి.


*జంకూగొంకూ లేని మాయలోడు – చంద్రబాబు.*

పేద వర్గాలకు ఇళ్ల నిర్మాణం చేయకపోయినా, రైతులకు బేషరతుగా పూర్తిగా రుణమాఫీ చేస్తానని మోసం చేసిన ఈ మాయలోడు ఏ జంకూగొంకూ లేకుండా ఇప్పటికీ ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నాడంటే ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా? 


పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు మొదటి సంతకంతోనే రుణాలుమాఫీ చేస్తానని ఒక్క రూపాయి కూడా మాఫీ చేయకుండా, వాళ్ల ఉసురు తగులుతుందన్న భయం లేకుండా రాష్ట్ర రాజకీయాల్లో ఈ మనిషి ఇంకా కొనసాగుతున్నాడంటే ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా? 


*10శాతం కూడా హామీలు అమలు చేయని బాబు పాలన*

650 వాగ్దానాలిచ్చి ఎన్నికలప్పుడు రంగు,రంగుల మేనిఫెస్టోగా చూపించి ప్రతి సామాజికవర్గానికి అది చేస్తా, ఇది చేస్తానని చెప్పి.. 10 శాతం కూడా అమలు చేయకపోయినా, ప్రజలు తనను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మడం లేదని తెలిసినా, నిస్సిగ్గుగా మళ్లీ ఎన్నికలొచ్చేసరికి కొత్త మేనిఫెస్టో తెచ్చి ప్రతి ఇంటికీ కేజీ బంగారం ఇస్తానని, బెంజ్‌ కారు కొనిస్తానని మోసం చేయగలుగుతున్నాడంటే ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా? 


ఈరోజు ఇలాంటి కార్యక్రమాలన్నీ చంద్రబాబు చేస్తున్నా కూడా ఒక ఈనాడులోగానీ, ఆంధ్రజ్యోతిలోగానీ, టీవీ5లోగానీ చంద్రబాబు గురించి ఎవరూ విమర్శించరు. 

అబద్ధాల కథనాలు రాయిస్తారు, టీవీ ఛానెళ్లలో  మోసపూరిత డిబేట్లు చేయిస్తారు. ఆ పేపర్లలో కథలు కథలుగా అబద్ధాలు రాస్తారు. ప్రజల్ని మరోసారి మభ్యపెట్టడానికి అన్ని మాయలు, మంత్రాలు ప్రదర్శిస్తారు. 


14 సంవత్సరాలు చంద్రబాబు సీఎంగా పని చేశాడు. ఇదే పెద్దమనిషి.. నీ పేరు చెబితే ప్రజలకు, పేదలకు గుర్తుకొచ్చే ఒక్క మంచైనా ఉందా? గుర్తుకొచ్చే ఒక్క స్కీమైనా ఉందా? 

మన ఖర్మ ఏమిటంటే ఇలాంటి వ్యక్తులతో ఈరోజు రాజకీయాలు భ్రష్టుపట్టాయి. ఇలాంటి వ్యక్తులతో ఈరోజు మనం రాజకీయాలు చేస్తున్నాం. 


*చేసిన మంచి  ఏదీలేని వ్యక్తి బాబు*

చంద్రబాబును నేను ఇవన్నీ అడిగితే నన్ను సవాల్‌ చేస్తావా? అంటాడే తప్ప ఇంటింటికీ ఫలానా మంచి చేశాను అని మాత్రం చెప్పడు. గ్రామ గ్రామానికీ ఈ మంచి జరిగిందని సమాధానం చెప్పలేడు.

పేదలకు జగన్‌ మాదిరిగా బటన్‌ నొక్కాను రూ.2.55 లక్షల కోట్లు పేదల ఖాతాల్లోకి జమ చేశాను అని ఈ పెద్దమనిషి నోట్లో నుంచి మాటలు రావు. చేయలేదు కాబట్టి చెప్పలేడు. 


*బాబు భార్య కుప్పంలో బై బై బాబు అంటుంది.*

ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతున్న పరిస్థితుల్లతో మనం సిద్ధం అంటుంటే.. మరోవంక బాబు భార్య మా అయన సిద్ధంగా లేడు అంటోంది. ఏకంగా కుప్పంలోకి వెళ్లి ఆమె బైబై బాబు అంటూ ఆయన అర్ధాంగి నోటే పంచ్‌ డైలాగులు వస్తున్నాయి. 

ఇలాంటి బాబును ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు సమర్థించడం లేదు. కుప్పంలో ఉన్న ప్రజలు కూడా సమర్థించలేదు. 


*నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్‌ బాబును సమర్ధిస్తున్నారు*.

ఏనాడూ ఏపీలో లేని వారు, ఏపీకి రాని వారు, సొంత ఊరు ఏదంటే తెలియని వారు, మన రాష్ట్రంలో ఓటే లేని వారు, ఇక్కడ దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడానికి అలవాటైన వారే అలాంటి నాన్‌ రెసిడెంట్‌ ఆంధ్రాస్‌ మాత్రమే చంద్రబాబును సమర్థిస్తారు.  ఇలాంటి పరిస్థితుల మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి. 


*నేను దళారులను నమ్ముకోలేదు..*.

నాకు చంద్రబాబు నాయుడుమాదిరి నాన్‌ రెసిడెంట్‌ ఆంధ్రాస్‌ మద్దతు లేదు. చంద్రబాబు మాదిరి ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 మద్దతు లేదు. దత్తపుత్రుడి మద్దతు తోడు లేవు. 

కానీ మీ అందరితో కోరేది ఒక్కటే. మీ ఇంట్లో మాత్రం మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే తోడుగా నిలబడండి అని కోరుతున్నాను. 

నేను పైన దేవుడిని, కింద మిమ్మల్ని నమ్ముకున్నాను. మధ్యలో దళారులను, బ్రోకర్లను నమ్ముకోలేదు. 

మీ అందరితో ఒక్కటే చెబుతున్నాను. మీ ఇంట్లో మంచి జరిగిందా? లేదా? అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి. 

అబద్ధాలను నమ్మకండి, రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మోసాలు చేస్తారన్నది జ్ఞాపకం పెట్టుకోండి. 


మీకు మంచి చేసింది ఎవరు అన్నది మాత్రమే మనసులో పెట్టుకుని.. మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు అండగా, తోడుగా మీరే నిలబడండి అని మరోసారి కోరుతున్నాను.


దేవుడి దయతో మీ అందరికీ కూడా ఇంకా మంచి చేసే పరిస్థితులు రావాలి అని దేవుడి చల్లని దీవెనలు మన ప్రభుత్వం పట్ల ఇంకా ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. 

రాష్ట్ర వ్యాప్తంగా ఈ రిజిస్ట్రేషన్‌ చేసిన ఇళ్ల పట్టాలను ప్రజలకు పంపిణీ చేసే కార్యక్రమం ఈరోజు నుంచి మరో 10 రోజులు పాటు జరుగుతూ పోతుందని సంతోషంగా చెబుతున్నాను అని సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ తన ప్రసంగం ముగించారు.

Comments