వలంటీర్లను జగన్ వంచిస్తున్నారు.

 *వలంటీర్లను జగన్ వంచిస్తున్నారు**వలంటీర్ల పేరుతో ఏటా రూ.617 కోట్ల అవినీతి*


*1,02,836 మంది వాలంటీర్ల డేటా నమోదు కాలేదు*


*గ్రామ, వార్డు సచివాలయాల చట్టంలో ఎక్కడా వాలంటీర్ అనే పేరు ఉండదు*


*వ్యక్తిగత ప్రయోజనం కోసం ప్రైవేటు ఏజెన్సీకు అనుచిత లబ్ధి*


*వలంటీర్ల ద్వారా సేకరించిన ప్రజల వ్యక్తిగత సమాచారం ఎవరి చేతుల్లోకి వెళ్తోంది?*


*వలంటీర్ వ్యవస్థ లోపాలను ప్రశ్నించిన  పవన్ కళ్యాణ్ పై కేసులు పెట్టారు*


*తెనాలిలో మీడియా సమావేశంలో  జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్*

    

తెనాలి  (ప్రజా అమరావతి): ప్రజలకు సులభతరమైన సేవ పేరుతో వాలంటీర్లను భారీగా ఏర్పాటు చేశామని చెబుతున్న వలంటీర్లలో 1,02,836 మంది వాలంటీర్ల డేటా అసలు నమోదు కాలేదు. వారున్నారా..లేరా..? అనే దానిపై స్పష్టత లేదు. మరి వారికిస్తున్న గౌరవ వేతనం ఎవరి జేబుల్లోకి వెళ్తోంది..? ప్రతి ఏటా డేటా లేని వలంటీర్ల కోసం ప్రభుత్వం ఇస్తున్న రూ.617 కోట్ల గౌరవ వేతనాలు ఎవరు మింగేస్తున్నారు..? అసలు వీరంతా ఎవరు. ఎక్కడున్నారని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్  నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. ప్రతి ఏటా డేటా నమోదు కాని వాలంటీర్ల కోసం చెల్లిస్తున్న గౌరవ వేతనం మొత్తం రూ.617 కోట్లు. అంటే నెలకు రూ.51 కోట్లు అన్నారు. డేటా లేని వాలంటీర్లకు ఏ పద్ధతిలో గౌరవ వేతనాలు ఇస్తున్నారో, ఎవరికి ఇస్తున్నారో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. వాలంటీర్ల పేరుతో జరుగుతున్న భారీ అవినీతిలో ఎవరి పాత్ర ఏమిటో ప్రజల ముందు పెట్టాలన్నారు.  తెనాలిలో సోమవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  నాదెండ్ల మనోహర్  మాట్లాడుతూ ‘‘వాలంటీర్ల డేటా లేని టాప్ 5  జిల్లాల వివరాలు చూస్తే తూర్పుగోదావరి 19,366, గుంటూరు 13,066, కృష్ణా 11,725, చిత్తూరు 11,400, విశాఖపట్నం జిల్లాల్లో 10,586 మంది వాలంటీర్ల డేటా ఇప్పటికీ కనిపించడం లేదన్నారు*


*చట్టబద్ధత కల్పించడంలోనూ జగనన్న మోసం : అసలు వాలంటీర్లు ఎవరికి రిపోర్టు చేయాలి..? వీరికి సంబంధించిన అధికారి ఎవరు అనేది ప్రభుత్వం స్పష్టం చేయాలన్నారు.  వాలంటీర్ల వ్యవస్థ లోపాలపై  పవన్ కళ్యాణ్  ప్రశ్నించారని, వలంటీర్లు, వలంటీర్ల వ్యవస్థపై పవన్ కళ్యాణ్  ఎప్పుడూ తప్పుగా మాట్లాడలేదని, వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీసేలా వ్యాఖ్యానించలేదన్నారు. వారాహి విజయ యాత్రలో పవన్ కళ్యాణ్ వలంటీర్ల ద్వారా ప్రభుత్వం సేకరిస్తున్న సమాచారం, వ్యవస్థ పని తీరుపైన సూటిగా మూడు ప్రశ్నలు సంధించారు. వలంటీర్ల వ్యవస్థకు అధిపతి ఎవరు. వీరు ఎవరి ఆధ్వర్యంలో పని చేస్తున్నారు.? వలంటీర్లు సేకరిస్తున్న ప్రజల వ్యక్తిగత సమాచారం ఎక్కడకు వెళ్తోంది.. ఎవరికి పంపుతున్నారు. ఎక్కడ భద్రపరుస్తున్నారు.? ప్రజల వద్ద నుంచి సమాచారం సేకరించడానికి వాలంటీర్లకు అధికారం ఎవరిచ్చారు.? అనే ప్రశ్నలకు ఇప్పటి వరకు బదులురాలేదన్నారు.  వలంటీర్లను  పవన్ కళ్యాణ్  ఏదో అన్నట్లు, కించపరిచేలా మాట్లాడినట్లు వైసీపీ అధినాయకుడితో సహా వైసీపీ నాయకులంతా  పవన్ కళ్యాణ్ మాటలను వక్రికరించారని చెప్పారు.  ప్రభుత్వం వలంటీర్లను భయపెట్టి, బలవంతంగా, కుట్రపూరితంగా వారి ద్వారా జనసేనానిపై కేసులు నమోదు చేయిస్తే సత్యం మరుగునపడిపోదని, దీనిపై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు.  2023 జులైలో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్ల వ్యవస్థపై పవన్ కళ్యాణ్ మాట్లాడారని, జనసేన ఏ విషయం మీద మాట్లాడిన ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకున్న తర్వాత, సమాచారం అంతా వాస్తవం అని తేలిన తర్వాత మాత్రమే మాట్లాడారన్నారు.  మేం ప్రజల ముందు మాట్లాడే ప్రతి విషయం సత్యం. పూర్తి ఆధారాలతోనే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. వాలంటీర్ల విషయంలోనూ ప్రభుత్వ తీరును మరోసారి ఆధారాలతో మాట్లాడుతున్నామని పేర్కొన్నారు.*

 

*వలంటీర్ వ్యవస్థకు చట్టబద్ధత ఉందా ? : సచివాలయాల విషయంలో ప్రభుత్వం 2023 లో తీసుకొచ్చిన గ్రామ, వార్డు సచివాలయాల చట్టంలో వాలంటీర్ల వ్యవస్థకు చట్టపరమైన ఎలాంటి అనుమతి లేదు. ఈ చట్టం మొత్తం మీద వాలంటీర్లకు సంబంధించి ఒక్క పదం కూడా చేర్చలేదు. చట్టం వచ్చిన తర్వాతే సచివాలయ వ్యవస్థపై ఓ ప్రత్యేక శాఖను ఏర్పాటు చేశారు. 2023లో సచివాలయాల చట్టం తీసుకొచ్చి, అది 2019 నుంచి వర్తిస్తుందని అడ్డగోలుగా దానిలోనే సవరణ చేశారు. కనీసం ఈ చట్టంలో ఎక్కడ పేర్కొనబడని వాలంటీర్ల వ్యవస్థకు అసలు చట్టబద్ధత ఎక్కడుంది..? ప్రభుత్వం మొట్టమొదట ఏర్పాటు చేసిన 15004 గ్రామ, వార్డు సచివాలయాల్లో 2,65,380 మంది వాలంటీర్లను ఉపయోగించుకోబోతున్నాం అని ప్రకటించింది. 2021లో అక్టోబరు 1వ తేదీన ప్రభుత్వ చెప్పిన లెక్క ప్రకారం 2,47,598 మంది వాలంటీర్లు ఉన్నట్లు చూపించారు. 2023, సెప్టెంబరు 25వ తేదీన మరోసారి ప్రభుత్వం ప్రకటించిన దాని ప్రకారం 2,50,985 మంది వాలంటీర్లు ఉన్నట్లు చెప్పారు. ఇటీవల గుంటూరులో ముఖ్యమంత్రి వాలంటీర్లంతా నా సైన్యం అని చెప్పారో అక్కడ చెప్పిన లెక్క ప్రకారం 2,55,461 మంది పెరిగినట్లు చూపారు. ప్రజా ధనం నుంచి ఇంతమందికి గౌరవ వేతనాలు ఇస్తుంటే, వీరిని ఏ రకంగా భర్తీ చేస్తున్నారో, దానికి చట్టం పరిధిలో ఉన్న నిబంధనలు ఏమిటో కూడా ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.*


*ఫీల్డ్ ఆపరేషన్ ఏజెన్సీకి ప్రజాధనం ధారాదత్తం : అసలు వ్యవస్థలో ఏ అధికారికి సంబంధం లేకుండా హైదరాబాద్ లోని ఫీల్డ్ ఆపరేషన్ ఏజెన్సీ కార్యకలాపాల కోసం వాలంటీర్లు పని చేస్తున్నారు. ప్రత్యేకంగా తీసుకొచ్చిన సచివాలయాల చట్టంలోనూ ప్రస్తావించకుండా, ఏ అధికారికి అజమాయిషీ ఇవ్వకుండా వాలంటీర్ల వ్యవస్థకు రూ.1560 కోట్ల ప్రజాధనం ప్రతి ఏటా వెచ్చిస్తున్నారు. కేవలం వాలంటీర్ల శిక్షణ పేరుతో ఫీల్డ్ ఆపరేషన్ ఏజెన్సీకి రూ.15 కోట్లను ఇస్తున్నారు. ఈ సంస్థ కార్యకలాపాల మీద జనసేన పార్టీ తరఫున మాట్లాడాం. బడ్జెట్లోనూ వాలంటీర్ల కోసం వెచ్చిస్తున్న సొమ్ముకు ప్రొవిజన్ లేదు. ఏ ఖాతా నుంచి చెల్లిస్తున్నది కూడా చెప్పలేదు. ప్రొఫెషనల్ అండ్ కాంట్రాక్చువల్ సర్వీసెస్ పేరుతో ఈ డబ్బు వెచ్చిస్తున్నామని ప్రభుత్వం చెప్పడం దారుణమని అన్నారు.*

Comments