సూక్ష్మ ప్రణాళికల అమలుతో పోలింగ్ నమోదు శాతాన్ని పెంచండి.

 *సూక్ష్మ ప్రణాళికల అమలుతో పోలింగ్ నమోదు శాతాన్ని పెంచండి


*

*రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా*


అమరావతి, ఫిబ్రవరి 21 (ప్రజా అమరావతి):  రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ నమోదు శాతాన్ని విస్తృత స్థాయిలో పెంచే  లక్ష్యంతో  స్థానిక పరిస్థితులకు అనుగుణంగా స్వీప్ సూక్ష్మ ప్రణాళికలను అమలు పర్చాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా జిల్లాల స్వీప్ నోడల్ అధికారులను ఆదేశించారు. భారత ఎన్నికల సంఘం స్వీప్  అధికారుల బృంధం రాష్ట్రానికి వచ్చిన సందర్బంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి  కార్యాలయం ఆధ్వర్యంలో  వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో క్రమబద్దమైన ఓటర్ల విద్య మరియు ఎన్నికల భాగస్వామ్య కార్యక్రమాల (SVEEP – Systematic Voters’ Education & Electoral Participation) అమలు పై అన్ని జిల్లాల స్వీప్ నోడల్ అధికారులతో (SVEEP Nodal Officers) సమీక్షా సమావేశం మంగళవారం జరిగింది.  ఈ సమీక్షా సమావేశం ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా పాల్గొని అన్ని జిల్లాల స్వీప్ నోడల్ అధికారులకు దిశ, నిర్థేశం చేశారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో  స్వీప్ ప్రణాళికలు ఉన్నాయని, వాటి అమలుకు భారత ఎన్నికల సంఘం అత్యంత ప్రాధాన్యత నిస్తున్నదన్నారు. అయితే జిల్లా స్థాయిలో పాటు నియోజక వర్గాలు, పోలింగ్ స్టేషన్ల స్థాయిల్లో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా స్వీప్ సూక్ష్మ ప్రణాళికలను రూపొందించి అమలు పర్చాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ముఖ్యంగా పట్టణాల్లో అపార్టుమెంట్లలో నివాసం ఉండేవారు, పలు కంపెనీల్లో పనిచేసే కార్మికులు, ఐ.టి. ఉద్యోగులు, విద్యార్థులు మరియు గిరిజన ప్రాంతాల్లోని ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్దగా శ్రద్ద చూపడం లేదన్నారు.  ఇటు వంటి వర్గాల వారికి ఎన్నికల ప్రక్రియ, ఓటర్ల విద్య పై అవగాహ కల్పించి,  వారిని కూడా ఎన్నికల్లో పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేసేందుకు అనువైన సూక్ష్మ ప్రణాళిలను రూపొందించి అమలు పరిస్తే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. ఈ విధంగా స్వీప్ నోడల్ అధికారులు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సూక్ష్మ ప్రణాళికలను ప్రణాళికా బద్దంగా అమలు పరిస్తే అన్ని పోలింగ్ స్టేషన్ల పరిధిలోని సామాన్య ప్రజలు కూడా చైతన్య వంతులై ఎన్నికల ప్రక్రియలో పూర్తి స్థాయిలో భాగస్వామ్యులు అవుతారనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. 


*రాష్ట్రంలో స్వీప్ కార్యక్రమాల అమలుపై సంతృప్తిని వ్యక్తపర్చిన ఇసిఐ అధికారుల బృంధం…..*


జిల్లాల స్వీప్ నోడల్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో  పాల్గొన్న భారత ఎన్నికల సంఘం అధికారుల బృంధం రాష్ట్రంలో అమలు చేయబడుచున్న స్వీప్ కార్యక్రమాలపై సంతృప్తిని వ్యక్తం చేసింది.  భారత ఎన్నికల సంఘం అధికారుల బృంధం సభ్యులు సంతోష్ కుమార్ (కార్యదర్శి) మాట్లాడుతూ  పోలింగ్ నమోదు శాతాన్ని మరింత పెంచేందుకు స్వీప్ కార్యక్రమాలను మరింత విస్తృత స్థాయిలో అమలు పర్చాలన్నారు.  ఓటర్ల జాబితాలో పేరును నమోదు చేసుకున్న ప్రతి ఒక్క ఓటరు తప్పని సరిగా తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా చైతన్య పర్చాలని అన్ని జిల్లాల స్వీప్ నోడల్ అధికారులకు ఆయన సూచించారు. 2019 లో జరిగిన ఎన్నికల్లోని అత్యల్ప స్థాయిలో పోలింగ్ శాతం నమోదు అయిన పోలింగ్ కేంద్రాలను గుర్తించి అందుకు గల కారణాలను విశ్లేషించి, ఆయా కేంద్రాల పరిధులో పోలింగ్ శాతం పెద్ద ఎత్తున పెరిగేలా తగు చర్యలు తీసుకోవాలన్నారు.మత్స్యకారులు, ఉన్నత చదువులకై ఇతర ప్రాంతాలకు వెళ్లిన విద్యార్థుల విషయంలో కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తూ వారు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా చైతన్య పర్చాలన్నారు. మొత్తం మీద గత ఎన్నికల్లో కంటే ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున పోలింగ్ శాతం నమోదు అయ్యే విధంగా అన్ని జిల్లాల స్వీప్ నోడల్ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. 


జిల్లాల వారీగా అమలు చేయబడుచున్న ఓటర్ల విద్య మరియు ఎన్నికల భాగస్వామ్య కార్యక్రమాలను ఆయా జిల్లాల స్వీప్ నోడల్ అధికారులు పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా భారత ఎన్నికల సంఘం అధికార బృంధం సభ్యులకు వివరించారు. 


భారత ఎన్నికల సంఘం స్వీప్ అధికారుల బృంధం సభ్యులు రాహుల్ కుమార్, ఆర్.కె.సింగ్ తో పాటు అదనపు సీఈవో  ఎమ్.ఎన్. హరెంధిర ప్రసాద్, డిప్యూటీ సీఈవో ఎస్.మల్లిబాబు, రాష్ట్రంలోని 26 జిల్లాలకు చెందిన స్వీప్ నోడల్ అధికారులు  ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.

                                                                                                                                                                                                     

Comments