వాలంటీర్లు నా సేవా సైన్యం.


ఫిరంగిపురం, గుంటూరు జిల్లా (ప్రజా అమరావతి);


*వరుసగా 4వ ఏడాది వాలంటీర్లకు అభినందన.*


*ఉత్తమ గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర అవార్డుల ప్రధానం.*


*రాష్ట్ర వ్యాప్తంగా 7 రోజుల పాటు జరిగే పురస్కార కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో లాంఛనంగా ప్రారంభించి సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.*


*ఈ సందర్భంగా జరిగిన బహిరంగసభలో మాట్లాడుతూ సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే...*


చిక్కచి చిరునవ్వులు, ప్రేమానురాగాలు, ఆప్యాయతల మధ్య ఈరోజు నా చెల్లెమ్మలు,తమ్ముళ్ల మధ్య ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది.

ఈ ఐదు సంవత్సరాల మన పరిపాలనలో మనం ఏరకంగా పేదవాడి భవిష్యత్‌ మార్చాలని తపన,తాపత్రయపడుతూ అడుగులు వేశామో, ఏ రకంగా ఒక విప్లవాన్ని తీసుకొచ్చామో? అనేటు వంటి విషయాలు ఈరోజు జ్ఞాపకం తెచ్చుకోబోతున్నాం.


ఇక్కడ ఉన్న నా తమ్ముళ్లు, నా చెల్లెమ్మలు అందరూ నా మీద ప్రేమతో, నా మీద నమ్మకంతో మన జెండా, అజెండా మీద మమకారంతో మనం అమలు చేస్తున్న మేనిఫోస్టో మీద నమ్మకంతో, మనం అమలు చేస్తున్న నవరత్నాల పథకాలని, పరిపాలనా సంస్కరణలనీ ప్రజలకు చేరువేసే బాధ్యత తీసుకున్న యువసైన్యమే మన వాలంటీర్ల వ్యవస్ధ.


ఈ సైన్యం ప్రతి పేద ఇంట వారి బ్రతుకులు మారాలని, ఆ పేదవాడి ఇంట్లోనుంచి బయటకు రాబోయే తరం.. ఆ పేదరికం సంకెళ్లు తెంచుకోవాలన్న తపన, తాపత్రయంతో మనం తీసుకువస్తున్న విప్లవాత్మక పథకాలన్నీ ఒక్క రూపాయి కూడా ఎక్కడా లంచం తీసుకోకుండా, ఎక్కడా వివక్ష లేకుండాప్రతి పేదవాడికి అందించాలన్న మీ జగనన్న అజెండాను త్రికరణశుద్ధిగా అమలు చేస్తున్న మన భావి లీడర్లు ఇవాల నా తమ్ముళ్లు, చెల్లెమ్మల రూపంలో నా దగ్గర కూర్చునిఉన్నారు.*వాలంటీర్లు నా సేవా సైన్యం.*
మీరు చేస్తున్నది ఉద్యోగాలు కాదని,మొట్టమొదట రోజు నేను చెప్పాను. రాబోయే రోజుల్లో  మీరు భావిలీడర్లు కాబోతున్నారని.. మొట్టమొదట రోజు నేను చెప్పాను.ఈ వ్యవస్ధలో పాలుపంచుకుంటున్న ప్రతి ఒక్క నా చెల్లెమ్మ, నా తమ్ముడు నా వాళ్లు. మన ప్రభుత్వ విజయాన్ని కోరుకునే, ప్రతిపేదవాడి భవిష్యత్తు కూడా మార్చాలని తపన పడే సేవా సైనికులు నా వాలంటీర్లు. 58 నెలలు  మనమంతా అలసిపోకుండా మీ దగ్గర నుంచి మొదలుపెడితే నా దగ్గరదాకా పేదలకు సేవ చేసాం. ఇంకా 2 నెలలు సేవ చేసేందుకు, పేదవాడి భవిష్యత్‌ మార్చేందుకు యుద్ధానికి సిద్ధమా? 

2.60 లక్షల మంది నా సైన్యం .. నా వాలంటీర్లు సైన్యం అని చెప్పడానికి గర్వపడుతున్నాను. ఈ సైన్యంలో ఉన్న గుండెలు.. తెలుగుదేశం పార్టీ మాదిరి, వారి జన్మభూమి కమిటీ సభ్యుల దోపిడీ గుండెలు కావివి. ఇవి సేవా హృదయాలు. ఈ గుండెల్లో మానవత్వం ఉంది. ఈ గుండెల్లో లంచాలు లేని, వివిక్ష లేని వ్యవస్ధ తీసుకురావాలన్న తపన ఈ గుండెలకు ఉంది. 


తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక 2014 నుంచి 2019 మద్య చంద్రబాబునాయుడు హయాంలో, తెలుగుదేశం పార్టీ పాలనలో వారి కార్యకర్తల జన్మభూమ కమిటీలు పనితీరు .. ప్రజలు టీడీపీని అధికారంలో నుంచి కిందకు దింపడానికి కారణమైతే, 2019లో మీ అన్న ఏర్పాటు చేసిన ఈ సైన్యం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్ధలకు అనుసంధానమై, పేదల ప్రతి అవసరంలోనూ వారికి వారధిగా, సహాయకారులగా మనం ఏర్పాటు చేసుకున్న మన గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్ధ 2019 తర్వాత జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికల్లోనూ, జరిగిన ప్రతి ఉప ఎన్నికల్లోనూ మీ బిడ్డ ప్రభుత్వం ఘనవిజయానికి మీరు కారకులయ్యాయని, ఈ వ్యవస్ధ కారణమైందని చెప్పడానికి గర్వపడుతున్నాను.*మన ప్రజా వ్యవస్ధలే 2024 మన జైత్రయాత్రకు దారులు*

పరిపాలనను మార్చిన ఈ ప్రజా వ్యవస్ధలే... 2024 ఎన్నికల్లో మన ప్రభుత్వ జైత్రయాత్రకు దారులు కూడా వేస్తాయి. ప్రజలకు ప్రభుత్వ సేవలు, పథకాలు అందించేందుకు గత ప్రభుత్వ పాలన, టీడీపీలో జన్మభూమి కమిటీల పేరుతో వాళ్లు చేశారు. మనం పెట్టుకున్నది వాలంటీర్ల వ్యవస్ధ. సచివాలయ వ్యవస్ధకు అనుసంధానమైన ప్రతి పేదవాడికి వారధిగా నిల్చిన మన వాలంటీర్ల వ్యవస్ధ, వారి జన్మభూమి కమిటీల మధ్య తేడా ఏమిటంటే... వారి జన్మభూమి కమిటీలు దోపిడీ కోసం పుట్టాయి.


*గతానికి ఇప్పటికీ మధ్య తేడా గమనించండి.* 

మన వ్యవస్ధలు, మన ప్రభుత్వం, మన మేనిఫెస్టో, మన నవరత్నాలు, మన అజెండా ప్రకారం సేవచేయడానికి పుట్టాయి. మనం ఏర్పాటు చేసిన వ్యవస్ధలు... ప్రతి గ్రామంలోని బడిని, ఆసుపత్రిని మార్చాయి. మీరు గమనిస్తే.. మీరు గమనించిన ఈ తేడాను కళ్లకు కట్టినట్టుగా మీ గ్రామంలోని ప్రతి రైతన్నకు చూపవచ్చు.  ప్రతి అక్కచెల్లెమ్మకు చెప్పొచ్చు. ప్రతి గ్రామంలో ఆసుపత్రిని, బడిని మార్చాయి. మనం ఏర్పాటు చేసిన ఆర్బేకే వ్యవస్థ ప్రతి గ్రామంలోని రైతన్నను చేయిపట్టుకుని నడిపిస్తూ.. రైతన్నకు కొండంత అండగా గ్రామస్ధాయిలో నిలబడుతుంది.

ఈ వ్యవస్ధల కారణంగా ఎక్కడ లంచాలు, వివక్ష లేకుండా రూ.3వేలు అవ్వాతాతల చేతుల్లో పొద్దున్న చిక్కని చిరునవ్వుతో ఆదివారమైనా, సెలవురోజైనా ఇస్తున్నారు. ఇతర పౌరసేవలు కూడా ఇవాళ ఇంటికే డోర్‌ డెలివరీ చేసే కార్యక్రమం జరుగుతుంది. ఇవన్నీ మనం చేసిన మార్పులు, మనం తీసుకొచ్చిన చేసిన వ్యవస్ధల వల్లే సాధ్యమవుతుంది.


ఇంటింటి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామస్ధాయిలో ఏర్పాటు చేసిన విలేజ్‌ క్లినిక్‌లు, ఇంటింటిని జల్లెడ పడుతూ ఏ పేదవాడూ వైద్యం కోసం అప్పులు పాలయ్యే పరిస్థితి ఉండకూడదని, ఆ వైద్యం వారికి ఇంటి వద్దే అందే కార్యక్రమం జరగాలన్న తపనతో ఆరోగ్యసురక్ష కార్యక్రమం చేస్తున్నాం. ఎంత మారుమూల పల్లెల్లో ఉన్న.. పేదలకు 77 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో కనీ,వినీ ఎరుగని ఆరోగ్యభరోసాను మనం ఏర్పాటు చేసిన వ్యవస్ధలు గ్రామస్ధాయిలో ఇస్తున్నాయి. 

మనం చేసిన ఈ మంచి అన్నింటికీ భిన్నంగా.. గత జన్మభూమి కమిటీలు, వారి పార్టీ కార్యకర్తలు, వారి పార్టీ అభిమానులు ఏం చేశారు. ఏం అందించారు? అని చూస్తే.. 2019 జూన్‌లో మనం అధికారం చేపట్టక ముందు వరకు పరిస్థితి ఏంటి? ప్రజలకు అందిస్తున్న ప్రతి సేవలోనూ మార్పు గమనిస్తే.. అప్పుడు మనకు ఏం కనిపిస్తుందో గమనిస్తే ప్రతి సేవకూ, ప్రతి స్కీంకు, ప్రతి పేదవాడికి అప్పట్లో ఇచ్చుకోవాల్సింది.. లంచం. లంచం.. లంచం.


2019కంటే పరిస్థితి ఏమిటి? పాలన ఎలా ఉండేదో చూస్తే.. గ్రామాలలో ఏ సేవ కావాలన్నా కూడా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ, వారాల తరబడి, నెలల తరబడి తిరగాల్సిన దుస్ధితి. మండల స్ధాయికి, జిల్లా స్ధాయికి కాళ్లు అరిగేలా తిరగాల్సిన పరిస్థితి. జన్మభూమి కమిటీలు సంతకాలు పెడితే తప్ప సిఫార్సులు జరగవు. జన్మభూమి కమిటీలకు లంచాలు ఇస్తే తప్ప అడుగులు ముందుకు పడవు. చివరకు ఆ పెద్ద వయస్సులో ఉన్న అవ్వాతాతలు పెన్షన్‌ తీసుకోవాలన్నా, కదలలేని స్ధితిలో ఉన్న ఆ వికలాంగ సోదరులు, అక్కచెల్లెమ్మలు పెన్షన్‌ అందుకోవాలన్నా, రైతులు ఎరువులు అందుకోవాలన్న ఎండనక, వాననక పెద్ద పేద్ద చేంతాడంత క్యూలైన్లలో నిలబడి వేచి ఉండాల్సిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు పెట్టిన జన్మభూమి కమిటీల దుర్మార్గం వలన ఆర్హులైన పేదలకు పెన్షన్‌ దరఖాస్తు కావాలన్నా.. లంచం. రేషన్‌ కార్డు కావాలన్న లంచం. ఇంటి మంజూరు కావాలన్న లంచం. సబ్సిడీ మీద ఇచ్చే రుణాలు కావాలన్నా, ఆ సబ్సిడీలు సైతం ఇవ్వాలన్నా లంచం ఇవ్వాల్సిందే. అదీ అందరికీ ఇస్తారంటే అదీ లేదు. అరకొరా ఇస్తారు. అదీ వివక్షతో ఇస్తారు. చివరకు మరుగుదొడ్లు కావాలన్నా కూడా జన్మభూమి కమిటీల పాలన, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎక్కడ చూసినా లంచాలే. జన్మభూమి కమిటీల నుంచి మొదలుపెడితే చంద్రబాబు నాయుడు వరకూ కూడా ఇదే కార్యక్రమం. ఒకవైపు లంచం తీసుకోవడం, మరోవైపున కులమని, మతమని, వర్గమని, పార్టీ అని ఇవన్నీ చూసుకుని మనుషులను విభజించి పాలించారు. కాబట్టే వారు అర్హులకు కూడా ఎగ్గొట్టే పరిస్థితులే కనిపించాయి.


ఉదాహరణకు పెన్షన్లు తీసుకొండి. మీరు అంతా ఒకటో తారీఖు పొద్దున్నే అవ్వాతాతల ఆశీస్సులు తీసుకుంటే వారి ముఖాల్లో చిరునవ్వులు చూస్తూ... ఎంతో సంతోషంగా ప్రతి ఇంటికి వెళ్లి, చిక్కటిచిరునవ్వులతో గుడ్‌మార్నింగ్‌ చెప్పి చేసే ఓ మంచి కార్యక్రమం. ఇవాల ఆ పెన్షన్లు మీ అన్న ప్రభుత్వంలో రూ.3వేలు  చొప్పున 66లక్షల మందికి ఇస్తున్నాం. 

గతపాలనలో కేవలం 39లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇచ్చేవారు. అది కూడా ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు కేవలం రూ.1000 మాత్రమే ముష్టి వేసినట్లు పెన్షన్‌ ఇచ్చేవారు. అంటే వారి వివక్ష కారణంగా.. లక్షల మందికి ఇచ్చే పెన్షన్‌ కూడా అందకుండా పోయిన పరిస్థితులు మన కళ్లెదుటే చూశాం. మన హయాంలో 66 లక్షల పెన్షన్లు... వారి హయాంలో ఎన్నికలకు కేవలం ఆరు నెలల ముందు వరకు కేవలం 39లక్షలు మాత్రమే ఇచ్చిన పరిస్థితి. తేడా గమనించండి. గమనించిన ఈ తేడాను ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి.


*బాబు పాలనలో స్కీంలు లేవు, బటన్లూ లేవు.* మంచిచేయాలన్న తపన ఆ చంద్రబాబుకు అంతకన్నా లేదు. కాబట్టి లబ్దిదారులందరినీ పారదర్శకంగా ఎంపిక చేయడానికి వారికి మంచి పౌర సేవలు అందించడానికి ఆ గ్రామంలో ఒక వ్యవస్ధ తీసుకుని రావాలి, దానికి అనుసంధానంగా ఒక మంచి వాలంటీర్‌ వ్యవస్ధ అవసరమని చెప్పి.. ఏ రోజూ కూడా దోచుకోవడానికి, పంచుకోవడానికి అలవాటు పడిన ఆ టీడీపీ, ఆ చంద్రబాబునాయుడు పార్టీ భావించలేదు. ఎందుకంటే పేదవాడికి మంచి జరగాలని, పేదవాడి పిల్లలు బాగుండాలని, వారి ముఖంలో చిక్కటి చిరునవ్వులు కనబడాలని, పేదవాడి భవిష్యత్‌ బాగుండాలన్న తపన, తాపత్రయం వారికి లేదు. *బాబు గంజాయి మొక్కులు జన్మభూమికమిటీలు.*

చంద్రబాబు, ఆయన జన్మభూమి కమిటీలు ఓ గంజాయి మొక్క అయితే... మన సచివాలయాలు, అందుకు అనుసంధానమైన మన వాలంటీర్‌ వ్యవస్ధ ఓ తులసిమొక్క అని చెప్పడానికి గర్వపడుతున్నాను. 

చంద్రబాబు పరిపాలన ఓ విషవృక్షమైతే.. మన పరిపాలన ఓ కల్పవృక్షమని చెప్పడానికి గర్వపడుతున్నాను. 

రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకునివచ్చే ఇంత గొప్ప కార్యక్రమంలో నా వారిగా... నా తమ్మళ్లు, నా చెల్లెమ్మలుగా కేవలం గౌరవ వేతనం మాత్రమే తీసుకుంటూ మన ప్రభుత్వ పథకాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌లుగా వ్యవహరించిన మీ సేవాభావానికి, మీ అన్న సెల్యూట్‌ చేస్తున్నాడని గర్వంగా చెబుతున్నాను. 

వాలంటీర్లను రాష్ట్ర వ్యాప్తంగా అభినందించే ఈ కార్యక్రమాన్ని నేటి నుంచి ప్రారంభిస్తున్నాను. మరో వారం రోజుల పాటు ప్రతి మండంలోనూ ఒక ఉత్సవ వేడుకలా మనందరి ప్రభుత్వం జరిపిస్తుంది. వరుసగా నాలుగో ఏడాది చేస్తున్న ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు ఇస్తున్న నగదు బహుతిని 50 శాతం పెంచాం. ఎందుకు ఈ బహుమతి మొత్తాన్ని పెంచామో అందరికీ తెలుసు. కారణం మీరంతా గత ప్రభుత్వ లంచాలు, వివక్ష వ్యవస్ధను బద్దలుకొట్టి, నిజాయితీని నిలబెట్టుకున్న మీ విధానాన్ని, నా విధానాన్ని అజెండాగా తీసుకుని అడుగులు వేస్తూ.. త్రికరణశుద్ధితో... 2019 కంటే మందు, మన ప్రభుత్వం రాకముందు ఎవరైనా లంచాలు లేని వ్యవస్ధ సాధ్యమేనా ? అంటే లేదు సాధ్యమే అని ఈ నాలుగేళ్లుగా చేసి చూపించినందుకు ఈ బహుమతిని పెంచాం. 


సేవావజ్రాలకు రూ.45వేలు, సేవారత్నాలుకు రూ.30 వేలు, సేవా మిత్రలకు రూ.15వేలు చొప్పున ఇస్తున్నాం. ఈ ఏడాది కూడా ప్రతి నియోజకవర్గం నుంచి 5గురు చొప్పున 875 మంది వాలంటీర్లకు సేవావజ్ర అవార్డులతో సత్కరిస్తున్నాం. ప్రతి మండలం, ప్రతి మున్సిపాల్టీ పరిధి నుంచి కనీసం 5 మంది ప్రతి కార్పొరేషన్‌ పరిధి నుంచి పదిమంది చొప్పున 4150 మంది వాలంటీర్లకు సేవారత్న అవార్డులతో గౌరవిస్తున్నాం.


ఏడాదిగా మంచి సేవలందించి 2,50,439 మంది నా వాలంటీర్‌ చెల్లెమ్మలు, తమ్మళ్లుకు సేవామిత్ర అవార్డులతో సన్మానిస్తున్నాం. ఇలా 2,55,464 మంది వాలంటీర్లను అభినందిస్తూ వారికి నగదు బహుమతిగా రూ.392 కోట్లను నా తమ్ముళ్లకు చెల్లెమ్మలకు ఇవ్వడానికి సంతోషపడుతున్నాడు.


దేశ చరిత్రలో మరే రాష్ట్రంలోనైనా ఇలాంటి లంచాలు లేని, వివక్షలేని వ్యవస్ధను మీరు చూశారా? ప్రతి ఇంటిలోనూ వెళ్లి అడగండి. ప్రతి అక్కచెల్లెమ్మలకు, అన్నదమ్ముడికి, రైతన్నకు చెప్పండి. ఇలా లంచం లేని వ్యవస్ధను ప్రోత్సహించే ప్రభుత్వాలు దేశంలో ఎక్కడైనా ఉన్నాయా? అని అడగండి. 


మన ప్రభుత్వం రాకముందు ఎవరైనా ప్రభుత్వం నుంచి ఇచ్చే  ఒక రూపాయి.. ఎటువంటి లంచం, అవినీతి, వివక్ష లేకుండా ప్రజల చేతుల్లోకి చేరగలుగుతుందా అని ఎవరైనా అడిగితే.. ఎవరైనా ఇది జరిగే పనికాదు అని చెప్పే పరిస్థితి ఉండేది.


అలాంటి సమాధానం వచ్చే పరిస్థితి నుంచి ఇవాల మీ అన్న నేరుగా బటన్‌ నొక్కడం, నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయడం. లంచాలు, వివక్ష లేకుండా ఈ 58 నెలల కాలంలో మీ అన్న ప్రభుత్వం ఇప్పటివరకూ రూ.2.55 లక్షల కోట్లు నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లాకి జమ చేశాం. ఇది ఒక విప్లవం.


ఈ 2.55లక్షల కోట్లకు ఇళ్లపట్టాలు, సంపూర్ణపోషణం, గోరుముద్ద, ట్యాబులు, విద్యాకానుక వంటి నాన్‌డీబీటీ పథకాలు కూడా తీసుకుంటే మరో రూ.1.07 లక్షల కోట్లు ఇచ్చాం. ఇంటి స్ధలాలకు సంబంధించి వాటి మార్కెట్‌ విలువ కూడా తీసుకుంటే ఈ రూ.1.07 కోట్లనుంచి రూ.1.76 లక్షల కోట్లు అవుతుంది. ఇంత సొమ్మ పేదల చేతుల్లోకి నేరుగా వెళ్లింది.


కాబట్టే కోవిడ్‌ లాంటి సంక్షోభాలను కూడా ఎదుర్కోగలుగాం. కేంద్రం నుంచి తగ్గిన ఆదాయాన్ని కూడా తట్టుకోగలిగాం. లంచాలు లేని ఓ వ్యవస్ధను మీ బిడ్డ ప్రభుత్వం తీసుకురాగలిగింది కాబట్టే ఇది జరుగుతుంది. 


అదే రాష్ట్రం, అదే బడ్జెట్‌. అప్పులు కూడా అప్పటి కన్నా మన ప్రభుత్వంలో అప్పుల గ్రోత్‌ రేటు తక్కువ. మారిందల్లా కేవలం ముఖ్యమంత్రి మాత్రమే. ఇవాళ ప్రజల చేతుల్లో ఇన్ని లక్షల కోట్లు రూపాయలు ప్రజల చేతుల్లో కనిపిస్తున్నాయి. గతంలో కనిపించలేదంటే కారణం ఏమిటని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ప్రతి ఇంటికీ వెళ్లి ఆలోచన చేయమని చెప్పాలి.మరోవైపు చంద్రబాబు నాయుడుగారు ఏం చేస్తున్నాడో చూడండి. మనం ఎప్పుడూ చూడని విధంగా, జరగని విధంగా లంచాలు లేని వ్యవస్ధను తీసుకొస్తుంటే... ప్రతి అక్కచెల్లెమ్మ కుటుంబానికి మంచి జరగాలని తాపత్రయపడుతూ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల వైపు మనం అడుగులు వేస్తుంటే... మరోవైపు చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడో చూడండి.


హైదారాబాద్‌లో ఇంటిలో కూర్చుంటాడు. కాలు బయటపెట్టకుండా వేరే రాష్ట్రాలలో వాళ్ల ఎన్నికలప్పుడు ఇచ్చిన మేనిఫెస్టోలు అన్నీ తెప్పించుకుంటాడు. ఏ హామీలు అక్కడ బాగా పనిచేశాయి. ఏ పార్టీలు ఏ హామీలు ఇచ్చాయని చెప్పి.. వాటిని తీసుకుని ఒక కిచిడీ చేసి మేనిఫెస్టో రూపంలో తీసుకువస్తాడు.


ప్రజల కష్టాలను చూసి మన మేనిఫెస్టో పుట్టింది. వారి కష్టాలకు ఓ సమాధానం వెదుకుతూ మన మేనిఫెస్టో పుట్టింది. కానీ చంద్రాబాబు మేనిఫెస్టో హైదరాబాద్‌లో పుట్టింది. వేరే రాష్ట్రాలలో ఏం ఎన్నికలు జరుగుతున్నాయి.. ఆ పార్టీలు ఏం చెప్పాయో తీసుకుని వాటిని కిచిడీ చేసి వాళ్ల హామీలన్నీ కలిపి మేనిఫెస్టో రూపంలో తీసుకునివచ్చాడు.


ఆ హామీలన్నీ కూడా నిజంగా అమలు చేసే అవకాశం, పరిస్థితి రాష్టర్‌ ప్రభుత్వానికి  ఉందా? అలా చేయగలుగుతామా? అన్న ఆలోచన కూడా ఈ మనిషి చంద్రబాబునాయుడు గారికి ఉండదు. లేకుండా తాను మోసాలకు దిగాడు. కారణం ఎలాగూ ఇచ్చేది లేదు కాబట్టి, చేసేది మోసమే కాబట్టి అబద్దాలు ఆడడంలో బావదారిద్య్రం ఎందుకని?


చేసేవానికైతే ఇది చేయాలి? మాట చెబుతున్నాం, చేయకపోతే  ఎలా ?  క్రెడిబులిటీ పోతుందని ఆలోచన చేస్తాం. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్ర ఆయన జీవిత చరిత్ర చూస్తే.. ఎలాగూ ఇచ్చేది లేదు కాబట్టి, చేసేది మోసమే కాబట్టి అబద్దాలు ఆడడంలో బావదారిద్య్రం ఎందుకని.. నమ్మినవాడు మునుగుతాడు, నమ్మించినవాడు దోచుకోగలుగుతాడు అనే ఫిలాసఫీతో చంద్రాబాబునాయుడు గారి అడుగులు పడుతున్నాయి.


ఎలాగూ ప్రజలు అధికారం ఇవ్వరన్న నమ్మకంతో బాబు తన మార్కు గ్యాంబ్లింగ్‌ మొదలుపెట్టాడు. 

మొన్నటివరకు జగన్‌ మాదిరిగా బటన్‌ నొక్కితే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందన్నాడు. అదే నోటితోనే ఆయన చేస్తున్న ఈ గ్యాంబ్లింగ్‌ వ్యవహారంలో ఆరు వాగ్దానాలు అంటూ కొత్తగా ఒక మేనిఫెస్టో చెబుతున్నాడు. పైగా ఇది శాంపిల్‌ మాత్రమే. ఈ ఆరుకు మరో ఆరు మరో ఆరు కూడా జమ అవుతాయని చెబుతున్నాడు.


ఆలోచన చేయండి. ఒకవైపు మీ బిడ్డ ఇంత కష్టపడి ఎప్పుడూ జరగని విధంగా చేస్తే... సంవత్సరానికి రూ.70వేల కోట్లు ఖర్చుచేయగలుగుతున్నాడు. ఎప్పుడూ జరగనివిధంగా చేస్తున్నాడు. డీబీటీ, నాన్‌ డీబీటీ కలిపి రూ.3.55వేల కోట్లు ఐదేళ్లకు లెక్కిస్తే.. దాదాపు ఏడాదికి రూ.70వేల కోట్లు చాలా కష్టపడి ఖర్చు చేయగలుగుతున్నాం.


కానీ చంద్రబాబు ఈ ఆరూ శాంపిల్లు మాత్రమే అంటున్నాడు. మీ బిడ్డ చేస్తున్న ఈ మంచి కార్యక్రమాలలో కొన్ని కార్యక్రమాలు ఎవరికి కూడా టచ్‌ చేయడానికి కూడా ధైర్యం సరిపోదు. అలాంటివాటిలో అవ్వాతాతలకు, వికలాంగులకు, వితంతువులకు ఇచ్చే రూ.3వేల సామాజిక పెన్షన్లు కానీ, వ్యవసాయానికి పగటిపూటే 9గంటలపాటు ఇచ్చే 

ఉచిత విద్యుత్, ప్రతి పేదవాడికీ సబ్సిడీ మీద బియ్యం ఇచ్చే కార్యక్రమం, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, 108, 104 కార్యక్రమాలు, గోరుముద్ద, పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇచ్చే విద్యాదీవెన, వసతి దీవెన, సంపూర్ణ పోషణం కింద బాలింతలు, గర్భిణీలు, 6ఏళ్లు లోపు పిల్లలకు పౌష్టికాహారం ఇచ్చే కార్యక్రమం... ఇలా ఈ 8 పథకాలకు రూ.52,700 కోట్లు అవుతుంది. ఎవరైనా రద్దు చేయాలన్నా చెయ్యి కూడా వెయ్యలేని పథకాలు ఇవి. 


మరి ఈ రూ.52,700 కోట్లు ఈ పథకాలకు తోడు... చంద్రబాబు చెప్పిన ఆరు పథకాలు అవి కూడా కలిపితే... ఆ ఆరు స్కీములకు అయ్యే ఖర్చు రూ. 73 వేల కోట్లు. టచ్‌ చేయలేని స్కీములు మరో రూ. 52 వేల కోట్లు. మొత్తంగా రూ. 1,26,140 కోట్లు లెక్క తేలుతోంది. 


ఆలోచన చేయమని కోరుతున్నా. సంవత్సరానికి మీ బిడ్డ రూ. 70 వేల కోట్లు ఇచ్చే కార్యక్రమం చాలా కష్టపడి, వ్యవస్థలో విపరీతమైన మార్పులు తీసుకొస్తే  వ్యవస్ధలో ఎక్కడా లంచం లేకుండా చేస్తూ.. ఇంతగా పారదర్శకంగా చేస్తూ.. కష్టపడితే రూ. 70 వేల కోట్లు ఇచ్చే పరిస్థితి. 


గతంలో ఏవీ చేయని ఈ వ్యక్తి, గత చరిత్ర అంతా మోసాలకే పరిమితమైన ఈ వ్యక్తి.. రూ.1.26 లక్షల కోట్లు ఇస్తున్నాడంటే.. ఆలోచన చేయమని అడుగుతున్నాను. ఇది అయ్యేదా?.. మళ్లీ మోసం చేయడం కాదా? 


రాజకీయాల్లో ఎప్పుడైనా ఒక్కటి గుర్తుంచుకొండి. మీరంతా భావి లీడర్లు అవుతారు. ఇవాల మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలు రేపొద్దున్న మిమ్నల్ని భావి లీడర్లుగా నిలబెడతాయి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకొండి. లీడర్‌ అనేవాడు ఎలా ఉండాలంటే లీడర్‌ నోట్లో నుంచి ఒక మాట వస్తే కష్టమైనా, నష్టమైనా ఆ మనిషి మాటమీద నిలబడతాడు అనే నమ్మకం ప్రతి పేదవాడిలోనూ ఉండాలి. 


ఆ విశ్వసనీయత ఏరోజైతే ఆ లీడర్‌ ఇవ్వగలుగుతాడో అప్పుడు ఆ లీడర్‌ ను నమ్ముకున్న ప్రతి కార్యకర్త, ప్రతి అభిమానీ.. ఆ అభిమాని వాలంటీర్‌ అయినా కాలర్‌ ఎగరేసి అదిగో మా లీడర్, ఆయనే మా స్పూర్తి అని చెప్పే పరిస్థితి వస్తుంది. 


చంద్రబాబునాయుడు గారి పాలన 1994లో తీసుకున్నా, 1999లో తీసుకున్నా, 2014లో తీసుకున్నా కూడా... చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టో అధికారంలోకి రాక ముందు రంగురంగులతో ఉంటుంది. 650 పేజీలు ఆ650 హామీలు అంటాడు. 


ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టో చెత్తబుట్టలో వేస్తారు. ఆ మేనిఫెస్టో ఎక్కడుందని వెదికితే.. కనీసం వాళ్ల వెబ్సైట్స్‌ లో కూడా మాయం చేస్తున్న పాలన చంద్రబాబు హయాంలో చూశాం. 


ఈ నిజాలన్నీ మన వాలంటీర్‌ వ్యవస్థ అర్థం చేసుకొని ప్రజల కోసం, ప్రజలు మోస పోకూడదని బాబు రంగుల్ని, బాబు మేనిఫెస్టో రంగుల్ని ప్రజలకు వివరించాలి. ప్రజల ముందుంచాలి. ఇవన్నీ ప్రతి రైతన్నకు, అక్కచెల్లెమ్మకూ తెలియాలి.


చంద్రబాబు మేనిఫెస్టోను ఏ ఒక్కరైనా నమ్మడం అంటే బంగారు కడియం ఇస్తానన్న పులిని నమ్మడమే అన్నది ప్రతి ఇంట్లో ప్రతి పేదకూ చెప్పాలి. 

పని చేస్తున్న ప్రభుత్వం తరఫున.. నిజాలు వివరించేందుకు, చంద్రబాబు బతుకేమిటో వివరించేందుకు ప్రజల్లో బలం గానీ, విశ్వసనీయత గానీ లేని చంద్రబాబు కూటమిని ఎదుర్కొనేందుకు మనసేవా సైన్యం వచ్చే రెండు నెలలు ఓ యుద్ధానికి సిద్ధం కావాలి. *స్లీవ్స్‌ మడచాల్సిన సమయం...*

పేదవాడి భవిష్యత్‌ కోసం నిలబడటానికి మీరు సిద్ధమేనా? 

ఇక స్లీవ్స్‌ మడచాల్సిన సమయం వచ్చింది. 

అబద్ధాల యోధుల్ని మట్టికరిపించాల్సిన సమయం వచ్చింది. 

మీ మేధకు పదును పెట్టి మంచి చేస్తున్న ప్రభుత్వానికి అండగానిలబడాల్సిన సమయం వచ్చింది.  పేదవాడి భవిష్యత్‌ మారాలంటే, వారి బతుకులు నేటి కంటే ఇంకా మెరుగు కావాలి అంటే మరో సారి మనందరి ప్రభుత్వాన్ని ఈ 58 నెలల్లో ప్రయోజనాలు అందుకున్న ప్రతి ఒక్కరూ సమర్థించాలని, పేదలందరికీ వివరించాలి.*స్టార్‌ క్యాంపెయినర్లుగా అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, రైతన్నలే..*

 ప్రతి ఇంట్లో నుంచి స్టార్‌ క్యాంపెయినర్లుగా అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, రైతన్నలకు తీసుకొని రావాలి. 

పెత్తందార్ల మీద పేదల పక్షాన మనందరరి ప్రభుత్వం చేస్తున్న యుద్ధంలో బాబుకు ఓటు వేయడం అంటే దాని అర్థం.. తమకు అందుతున్న పకథకాల రద్దుకు తామే ఆమోదం తెలిపినట్లవుతుందని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పాలి. 


ప్రతి ఇంటికీ వెళ్లినప్పుడు ఇంకొక విషయం చెప్పాలి.

2014 ఎన్నికల ముందు మొదటి సంతకంతో వ్యవసాయ రుణాలు రద్దు చేస్తానని, పొదుపు సంఘాల రుణాలుమాఫీ చేస్తానని, బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపిస్తానని, ప్రతి ఇంటికీ ఓ జాబు, లేదంటే రూ. 2 వేల నిరుద్యోగభృతి ఇస్తానని ఇదే పెద్దమనిషి  చంద్రబాబు 2014లో చేసిన ఈ మోసాలను ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పాలి.


*వాగ్దానాలను ఎగ్గొట్టేందుకే కోటయ్య కమిటీ..*

ఆ వాగ్దానాలను ఆయన ఎలా ఎగ్గొట్టాలని కోటయ్య కమిటీ అని కోతల కమిటీ వేస్తే మీ బిడ్డ మాత్రం ఎన్నికల మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా, ఖురాన్‌ గా, బైబిల్‌ గా భావించి మీ అన్న ప్రభుత్వం ఓ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్‌ వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి ఇంటికీ మంచి చేస్తున్నాడని చెప్పండి. *బాబును నమ్మడమంటే...*

బాబును నమ్మడం అంటే ఇంగ్లీషు మీడియం బడుల్ని, సీబీఎస్‌ఈ నుంచి ఐబీ ప్రయాణాన్ని, నాడునేడుని, అమ్మ ఒడిని, గోరుముద్దను, పిల్లలకిచ్చే ట్యాబుల్ని, ప్రతి క్లాస్‌ రూమును డిజిటలైజ్‌ చేస్తూ ఐఎఫ్‌ పీ ప్యానల్స్‌ ను పెడుతున్న మన స్కూళ్లను, మన క్లాస్‌ రూముల్ని.. వీటన్నింటికీ రద్దు చెబుతూ మన పిల్లల బంగారు భవిష్యత్‌ ను మనమే తాకట్టు పెట్టడం అని చెప్పండి. 

బాబు వాగ్దానాల్ని రైతు నమ్మడం అంటే 2014 మాదిరిగా మరోసారి తాము నిలువునా మునగడానికి సిద్ధం కావడం అని చెప్పండి. 

అక్కచెల్లెమ్మలు బాబును నమ్మడం అంటే పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తానని, ఏడాదికి 12 గ్యాస్‌ సిలిండర్లు ఇస్తానని ఎన్నికల తర్వాత నిలువునా దగా చేసిన బాబును మళ్లీ నమ్మవచ్చా అని అడగండి.

బాబుకు ఓటేయడం అంటే ఇంటింటికీ వచ్చి సేవలందిస్తున్న వాలంటీర్‌ వ్యవస్థ మాకొద్దు. జన్మభూమి కమిటీలు మళ్లీ రావాలి అని ఓటు వేయడమే అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి.*బాబుకే ఓటేస్తే.. వదిలించుకున్న చంద్రముఖిని తెచ్చుకోవడమే..*

చంద్రబాబు ఓటు వేయడం అంటే ఐదేళ్ల క్రితం వదిలించుకున్న చంద్రముఖిని మళ్లీ వారి ఇంట్లోకి తీసుకొని రావడమే అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. 

బాబుకు ఓటు వేయడం అంటే ఈ సంక్షేమ, అభివృద్ధి పథకాలన్నీ రద్దు చేయడమే అని మీకు మీరే ఆమోదం తెలపడమేనని, జన్మభూమి కమిటీలు వస్తాయి, చంద్రముఖిలు వస్తాయని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. *యుద్ధానికి మేమూ సిద్దమే అని చెప్పండి..*

వాలంటీర్‌ చెల్లెమ్మలంతా కొంగు బిగించి ఈ పేదల వ్యతిరేకుల మీద, ఈ పెత్తందార్ల మీద, మోసగాళ్ల మీద, ఎల్లో మీడియా అసత్య ప్రచారాల మీద యుద్ధానికి సిద్ధమే అని ప్రతి చెల్లెమ్మా చెప్పండి. 

మేమూ సిద్ధమని ప్రజా ప్రభుత్వానికి కొండంత అండగా నిలవాలి. ఈ 58 నెలల్లో మనందరి ప్రభుత్వం చేసిన వ్యవస్థాగత మార్పులన్నింటికీ కూడావారధులు మీరే. 

రాష్ట్ర వ్యాప్తంగా 84 శాతం ఇళ్లలో మంచి జరిగింది. ఎక్కడా లంచాలు లేవు వివక్ష చూపలేదు. గ్రామీణ ప్రాంతాల్లో 95 శాతం ఇళ్లకు మేలు జరిగింది. ఎప్పుడూ చూడని మార్పులు కనిపిస్తున్నాయి. 


*ఈ 58 నెలల్లో వ్యవస్థాగత మార్పులు*

 ఈ 58 నెలల్లో వ్యవస్థాగత మార్పులుతీసుకురాగలిగాడంటే సచివాలయ వ్యవస్థ, దానితో అనుసంధానమైన నా తమ్ముళ్లు, చెల్లెమ్మల వాలంటీర్ల వల్లే సాధ్యమైంది. 

ప్రతి పక్షం చేస్తున్న దాడి నా మీద కాదు.. ప్రతిపక్షానికి అంతా తెలుసు. కేవలం జగన్‌ అనే ఒకే ఒక్కడు ఒకవైపున ఉన్నాడు. 


మరోవైపున చూస్తే ఓ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు, దత్తపుత్రుడు వీరికి తోడు పరోక్షంగా ఒక జాతీయ పార్టీ, ప్రత్యక్షంగా మరో జాతీయ పార్టీ ఇంత మంది యుద్ధం చేస్తున్నది కేవలం ఒకే ఒకడు ఇటువైపున. 

కానీ వీళ్లంతా మర్చిపోతున్నది ఏమిటో తెలుసా.. ఈ ఒకే ఒకడికి ఉన్నది ఇంత పెద్ద సైన్యం ఉంది అని వీళ్లంతా మర్చిపోతున్నారు.

 

పైన దేవుడి దయను మీ బిడ్డ నమ్ముకుంటాడు. మంచి చేసిన ఆ ప్రతి ఇంటినీ నమ్ముకుంటాడు. మీ బిడ్డ గర్వంగా చెప్పగలుగుతాడు. ఈరోజు కళ్లలో కళ్లుపెట్టి చూసి చెప్పగలుగుతాడు. 


మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే సైనికులుగా ముందుకు రండి అని మీ బిడ్డ పిలుపునివ్వగలుగుతాడు. ఈ చిత్తశుద్ధి ఈ నిబద్ధత ఈరాజకీయ చరిత్రలో ఏ ఒక్క రాజకీయ నాయకుడికైనా ఉందా? చెప్పగలడా ఇలా? 

వారి దాడి ఇంటింటికీ అందుతున్న సంక్షేమం మీద దాడి. ప్రతి పేద కుటుంబానికి, వాలంటీర్‌ కు ఒక్క విషయం నా గుండె లోతుల్లో నుంచి చెబుతున్నాను. 

ఈ 58 నెలల్లో ఏ ప్రభుత్వం చేయనంతగా ప్రతి పేద కుటుంబానికి మంచి చేశాం.మనం మాత్రమే మేనిఫెస్టో అనే దానికి విశ్వసనీయత తీసుకొచ్చాం. 99 శాతం హామీలను అమలు చేసి మేనిఫెస్టో తీసుకొని ప్రజల ఇంటికి పోయి అన్నదమ్ములు, అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలకు చూపించి.. మీ బిడ్డ ప్రభుత్వం మీకు మంచి చేసిందా?లేదా?  మీరే నిర్ధారించండి అని చెప్పగల, నిబద్ధత కలిగిన ఏకైక ప్రభుత్వం మీ అన్న ప్రభుత్వం. *లబ్ది అందుకున్న ప్రతి ఒక్కరూ స్టార్‌ క్యాంపెయినర్లే...*

మనం మాత్రమే గ్రామ స్వరాజ్యానికి అర్థం చెప్పగలిగాం. పేదలకు సొంత ఇంటిని కలగా కాకుండా హక్కుగా అమలు చేసేలా అడుగులు వేశాం. మనసు పెట్టి చేశాం. మనసుతో చేసాం.

ప్రతి పేద గడపకూ అందిన మంచిని అటు పేదలకు, ఇటు సమాజానికి వివరించడానికి గానీ, లబ్ధి అందుకున్న ప్రతి ఒక్కరినీ స్టార్‌ క్యాంపెయినర్లుగా మార్చేందుకు గానీ మీరు ఈ రెండు నెలలు ఒక యజ్ఞంలా చేసే ప్రయత్నాల మీద మన ప్రభుత్వ సౌధం మరింతగా నిలబడుతుంది, బలపడుతుంది. *వాలంటీర్లని చూస్తే బాగు గుండెల్లో రైళ్లు....*

ఈరోజు మిమ్మల్ని చూస్తే చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరుగెడతాయి. కాబట్టే ఈరోజు మిమ్మల్ని చూస్తే దత్తపుత్రుడి నోట్లో నుంచి చంద్రబాబు నోట్లో నుంచి కించపరిచే మాటలు వినపడతాయి. మహిళల అదృశ్యానికి వాలంటీర్లు కారణమని ఒకడంటాడు.

వాలంటీర్ల దెబ్బకు ప్రజలు గెద్ద కాళ్ల కింద కోడిపిల్లల్లా అల్లాడిపోతున్నారంటాడు. తనకు అధికారం ఇస్తే వాలంటీర్ల వ్యవస్థ నడుం విరగ్గొడతాను అని అంటాడు. 

తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వారి కథ తేలుస్తాం అంటారు. 


నిండడం లేదు కాబట్టే విపక్షాల కడుపులు మండుతున్నాయి.

ఇంత మందికి మనం దడ ఎందుకు పుట్టిస్తున్నామో తెలుసా? కారణం ఈరోజు మీరు నేను మన ప్రభుత్వం ప్రతి పేదవాడికీ డెలివర్‌ చేసింది కాబట్టే వాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాం. 

వారి కడుపులు ఎందుకు మండుతున్నాయంటే.. వారి కడుపులు గతంలో మాదిరిగా నిండటం లేదు కాబట్టి. 

ప్రజల కడుపులు అందులోనూ పేద వర్గాల ఖాతాలు నిండుతున్నాయి కాబట్టే.*ప్రతిపక్షాలది నీటి దాహం కాదు– అధికార దాహం.*

వారిది నీటితో తీరే దాహం కాదు, అన్నం కోసం ఆకలి కాదు, వారిది అధికార దాహం, వారికి కడుపు నింపేది కేవలం అవినీతి ఆకలి మాత్రమే. 


ఇలాంటి విష వృక్షాలు ఉన్న వ్యవస్థతో మనం యుద్ధం చేస్తున్నాం. మన ప్రభుత్వానికి వాళ్ల మాదిరిగా రకరకాల పేపర్లు, టీవీల మద్ధతు లేదు. వాళ్ల మాదిరిగా ఓ దత్తపుత్రుడి తోడు మన ప్రభుత్వానికి లేదు. కానీ మనకు ఉన్నది, వాళ్లకు లేనిది మాత్రం పైన దేవుడి దయ, మంచి చేశాం అన్న గొప్ప విశ్వాసంతో అడుగులు ముందుకు వేయడం. 


చెడిపోయిన ఈ వ్యవస్థను బాగు పరచడానికి మీ బిడ్డ ప్రయాణం చేస్తున్నాడు. 58నెలలు దాటాం. మీ బిడ్డ మీ అన్న ఇంకో 10–15 సంవత్సరాలు ఇదే ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే, పేదవాడి ఇంట్లోఉన్న ఒకటో తరగతి చదువుతున్న చిన్న పిల్లాడు అనర్గళంగా ఇంగ్లీషుమాట్లాడతాడు. 

పేదవాడి భవిష్యత్‌ మార్పు జరుగుతుంది. ప్రతి ఒక్కరూ గమనించమని కోరుతున్నాను. 


రాబోయే రెండు నెలలు మంచి చేసిన మన ప్రభుత్వాన్ని ప్రజల గుండెల్లోకి, వారి ఇళ్లలోకి స్థానం సంపాదించుకొనే కార్యక్రమం చేస్తూ ఆ ఇళ్లలో నుంచి స్టార్‌ క్యాంపెయినర్లకు బయటకు తీసుకొచ్చే కార్యక్రమం చేయాలని మిమ్మల్నందరినీ కోరుకుంటూ మీ అందరికీ మీ అన్న ఎప్పుడూ మీ వాడిగా ఉంటాడు. 


నా చెల్లెమ్మ సుచరిత కాసేపు క్రితం మాట్లాడుతూ..తాడికొండ, మంగళిగిరి ప్రాంతంలో రాజధాని, వివిధ కారణాల వల్ల దాదాపుగా 17వేల జాబ్ లెస్ కుటుంబాలు ఉన్నాయి. ఉపాధి కోల్పోయారు. అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా రూ.1000 పెన్షన్ ఇచ్చే రోజుల్లో ఇక్కడ ఉపాధి కోల్పోయినవారికి రూ.2500 పెన్షన్ ఇచ్చేవారు. కానీ దేవుడి దయ వలన మీరు రాష్ట్ర వ్యాప్తంగా రూ.3వేలు పెంచారు. అదే మంచి మనసుతో ఇక్కడున్న జాబ్‌లెస్ గా ఉన్నవాళ్లందరికీ రూ.2500 నుంచి రూ.5వేలు పెంచమని అడిగింది. రేపు నెల నుంచి ఆ మార్పు జరుగుతుందని నా చెల్లెమ్మకు హామీ ఇస్తున్నాను. కార్మెల్ మాత గుడికి ఘాట్ రోడ్డు కోసం రూ.39 కోట్లు అడిగింది. అది కూడా మంజూరు చేస్తున్నాను. అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అని సీఎం తన ప్రసంగం ముగించారు.

Comments