ఏపీ విద్యావిధానం బాగుంది.. మేమూ అమలు చేస్తాం.

 


*ఏపీ విద్యావిధానం బాగుంది.. మేమూ అమలు చేస్తాం


*

• జాంబియా దేశ విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రశంసల వర్షం

- బాపట్లలో వివిధ పాఠశాలలు సందర్శన

అమరావతి (ప్రజా అమరావతి);


ప్రాథమిక విద్యలో నాణ్యత పెంపొందించడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలు, తరల్ (Teaching at the Right Level) అమలు తీరు బాగున్నాయని జాంబియా విద్యాశాఖ ప్రతినిధులు కొనియాడారు. శుక్రవారం బాపట్ల జిల్లాలో వివిధ పాఠశాలలను బృందాలుగా సందర్శించారు. ఈ బృందంలో ప్రాథమిక విద్య డైరెక్టర్  కెల్లీ కేజాలా మ్వాలే (KELLY KEZALA MWALE), శ్రీ హజెంబా (జాతీయ స్థాయిలో ప్రిన్సిపల్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఆఫీసర్‌గా పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం TaRL ఆఫ్రికా మరియు VVOB సంస్థ మధ్య ప్రభుత్వ లైజన్ ఆఫీసర్), టీచర్ ఎడ్యుకేషన్ అండ్ స్పెషలైజ్డ్ సర్వీసెస్ (TESS) అసిస్టెంట్ డైరెక్టర్ ఆంటోని టంబాటంబా (ANTHONY TAMBATAMBA), కంట్రీ ప్రొగ్రామ్స్ మేనేజర్ కరోలిన్ మేరీ ఇలియట్ (CARROLINE MARY ELLIOT ), తదితరులు ఉన్నారు. 

ఈ సందర్భంగా నిన్న సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయంలో పాఠశాల విద్యాశాఖ కమీషనర్ శ్రీ ఎస్.సురేష్ కుమార్  ప్రభుత్వం ఆధ్వర్యంలో పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్షా చేపడుతున్న కార్యాక్రమాలను వివరించి, అతిథులను సత్కరించారు. 

బాపట్ల మండలంలో పర్యటన

పర్యటనలో భాగంగా గురువారం బాపట్ల మండలంలోని మరుప్రోలువారిపాలెం మండల పరిషత్ పాఠశాల సందర్శించారు. తరల్  అమలులో భాగంగా ప్రాథమిక విద్యార్థులు ప్రదర్శించిన 'వెలకమ్ సాంగ్' నృత్య ప్రదర్శన,  'కాకి- ఎలుగుబంటి' లఘునాటికలను చూసి విద్యార్థులను, ఉపాధ్యాయులను అభినందించారు. అనంతరం తల్లిదండ్రుల కమిటీ సభ్యులతో మాట్లాడి ‘పాఠశాల, విద్యార్థుల అభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్ర’ గురించి అడిగి తెలుసుకున్నారు. తమ దేశాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాల అమలు చేస్తామని జాంబియా ప్రతినిథులు అన్నారు. 

*‘ప్రథమ్’ స్కిల్ ట్రైనింగ్ సందర్శన*

అనంతరం బాపట్లలో ‘ప్రథమ్’ నిర్వహిస్తున్న స్కిల్ ట్రైనింగ్ సెంటరును సందర్శించి వృత్తి విద్యలో భాగంగా హోటల్ మేనేజ్ మెంట్ కోర్సు చదువుతున్న విద్యార్థులను పలకరించారు. వారికి నేర్పించే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఆసక్తి ఉంటే జాంబియా దేశంలో ఉద్యోగవకాశాలు కల్పిస్తామన్నారు. 

ఈ బృందంలో కొంతమంది బాపట్ల మండలంలోనే శివపురం, చింతాయపాలెం, చెరువు జమ్ములవారి పాలెం గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలలు సందర్శించి మన బడి: నాడు –నేడు, జగనన్న గోరుముద్ద, తల్లిదండ్రుల కమిటీ, ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెళ్లు వంటివి పరిశీలించి, విద్యాభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న గుణాత్మక కార్యక్రమాలను బాుగున్నాయని ప్రశంసించారు. ఇలాంటి కార్యక్రమాలు తమ దేశంలో అమలు చేస్తామన్నారు. ఈ సందర్శనలో జాంబియా ప్రతినిధులతో పాటు ప్రథమ్ ప్రతినిథులు పి.రాంబాబు, జి.వినోద్ హరిబాబు, తదితరులు పాల్గొన్నారు.



Comments