ఈనెల 17న ఎపిపిఎస్సి గ్రూపు-1ప్రిలిమ్స్ పరీక్ష- పటిష్టమైన ఏర్పాట్లు:సిఎస్.

 ఈనెల 17న ఎపిపిఎస్సి గ్రూపు-1ప్రిలిమ్స్ పరీక్ష- పటిష్టమైన ఏర్పాట్లు:సిఎస్విజయవాడ,16 మార్చి (ప్రజా అమరావతి):ఈనెల 17వ తేది ఆదివారం నిర్వహించే ఎపిపిఎస్సి గ్రూపు-1స్క్రీనింగ్ పరీక్షకు  (ప్రిలిమ్స్) విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి పేర్కొన్నారు.గ్రూపు-1 ప్రిలిమ్స్ ఏర్పాట్లపై శనివారం విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి ఆయన జిల్లా కలెక్టర్లు,ఎస్పీలతో వీడియో సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా 301 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరగనున్నాయని తెలిపారు.మొత్తం లక్షా 48వేల 881మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారని చెప్పారు. ఆదివారం ఉదయం 10గం.ల నుండి మధ్యాహ్నం 12 గం.ల వరకూ పేపర్-1,మధ్యాహ్నం 2 గం.ల నుండి సాయంత్రం 4 గం.ల వరకూ పేపర్-2 పరీక్ష జరుగుతుందని సిఎస్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు.


గ్రూపు-1 పరీక్షలు జరిగే పరీక్షా కేంద్రాల పరిధిలో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించి ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లు,ఎస్పిలను సిఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు.ప్రతి పరీక్షగా కేంద్రం వద్ద ఇద్దరు పురుష,ఇద్దరు మహిళా పోలీసులతో తగిన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. అంతే గాక పరీక్షల పర్యవేక్షణకై ప్రతి జిల్లాకు ఒక ఐఏఎస్ అధికారిని ఇన్చార్జిగా పెట్టడం జరిగిందని తెలిపారు.ప్రతి పరీక్షా కేంద్రానికి జిల్లా స్థాయి సీనియర్ అధికారులను లైజన్ అధికారులుగా నియమించి పరీక్షలు సజావుగా జరిగేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లును సిఎస్ ఆదేశించారు.


అదే విధంగా అన్ని పరీక్షా కేంద్రాల్లోను నిరంతర విద్యుత్ సరఫరా,తాగునీరు వంటి కనీస సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూడాలని సిఎస్ జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.అంతేగాక అన్ని పరీక్షా కేంద్రాల్లో ప్రథమ చికిత్స సౌకర్యాన్ని అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను సిఎస్ ఆదేశించారు.


రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్ ద్వారా పరీక్షలు జరుగుతున్న తీరును నిరంతరం పర్యవేక్షించాలని ఎపిపిఎస్సి అధికారులను సిఎస్ ఆదేశించారు.అలాగే జిల్లాల్లో కూడా కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు. పరీక్ష అనంతరం ఆన్సర్ సీట్లు ఇతర సామాగ్రి కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్ లకు తరలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని  కలెక్టర్లు,ఎస్పిలను సిఎస్ ఆదేశించారు.


ఈసమావేశంలో వివిధ జిల్లాల కలెక్టర్లు,ఎస్పిలతో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.Comments