నంద్యాల జిల్లా ప్యాపిలిలో రూ.50 కోట్లతో భారీ టెర్మినల్ మార్కెట్ యార్డ్ : ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.






*నంద్యాల జిల్లా ప్యాపిలిలో రూ.50 కోట్లతో భారీ టెర్మినల్ మార్కెట్ యార్డ్ : ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్*


*ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే తలమానికంగా తీర్చిదిద్దుతాం*


*ఏడాదిన్నరలోగా ఉద్యానవన పంటలకు ఉజ్వల భవిష్యత్*


*బీఆర్ అంబేడ్కర్, బీపీ శేషారెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి విగ్రహాల ఆవిష్కరణ*


ప్యాపిలి, నంద్యాల జిల్లా, మార్చి, 15 (ప్రజా అమరావతి); నంద్యాల జిల్లా ప్యాపిలి మండలంలో రూ.50 కోట్లతో భారీ టెర్మినల్ మార్కెట్ యార్డ్ నిర్మాణానికి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ భూమి పూజ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలమానికంగా మార్కెట్ ను తీర్చిదిద్దనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఏడాదిన్నరలోగా నిర్మాణాన్ని పూర్తి చేసి ఉద్యానపంటలకు ఉజ్వల భవిష్యత్ ను అందించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ముంబయ్ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ తరహాలో ఏపీలోనే మొట్టమొదటి భారీ మార్కెట్ ను నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు. నంద్యాల జిల్లాలో 45వేల హెక్టార్లలో, డోన్ లో 27వేల ఎకరాలలో  అరటి,  మామిడి, బొప్పాయి, టమోట, ఉల్లిగండ పంటలు, పూలు పండుతున్న నేపథ్యంలో ఈ మార్కెట్  ఆ పంటల మీద ఆధారపడిన రైతన్నలకు తమ పంటను తామే గిట్టుబాటు ధరకు అమ్ముకోవడంలో ఎంతో తోడ్పాటునిస్తుందన్నారు. దేశంలో మూడో అతిపెద్ద మార్కెట్ గా తీర్చిదిద్దుతున్న ఈ మార్కెట్ యార్డులో బ్యాంకు, పోస్ట్ ఆఫీస్, ఎలక్ట్రిక్ రూమ్, పార్కింగ్ వంటి సౌకర్యాలన్నీ అక్కడే ఏర్పాటు చేస్తామన్నారు. రోడ్డు, రైలు, పోర్టు, ఎయిర్ పోర్టు వంటి అన్ని కనెక్టివిటీలకు ఏ ఇబ్బంది లేని ప్యాపిలి ప్రాంతంలో నిర్మించే మార్కెట్ లో వే బ్రిడ్జి, ఓవర్ హెడ్ ట్యాంక్, వాటర్ ప్లాంట్ ఇలా కనీస సదుపాయాలన్నింటినీ ఏర్పాటు చేస్తామన్నారు.  గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలను, వ్యవసాయ, ఉద్యాన పంటల సాగుపై ఆధారపడిన రైతాంగానికి ఏడాదిన్నరలోనే మార్కెట్ ను ఏర్పాటు చేసి అంకితమివ్వనున్నట్లు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు. రాష్ట్రానికే తలమానికంగా తీర్చిదిద్దే మార్కెట్ యార్డ్ నిర్మాణంలో రాజీ పడకూడదనే ఎంతో కృషి చేసి భూమిపూజ నిర్వహిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. దేశంలోని అగ్రశ్రేణి ఎగుమతిదారుల ఆధ్వర్యంలో నడిచే విధంగా 86 రిటైల్ షాప్ లు, 36 హోల్ సేల్ దుకాణాలు, పండ్లు కూరగాయలు, పూలు పాడవ్వకుండా ప్రీకూలింగ్ చాంబర్లు, కోల్డ్ స్టోరేజ్ లను నాణ్యతగా నిర్మించేందుకు అనువుగా మార్కెట్ యార్డును నిర్మించనున్నట్లు పేర్కొన్నారు.


ఆర్థిక మంత్రిగా అనేక పనులతో తీరిక లేకుండా ఉన్నప్పటికీ రైతులకు మంచి చేయాలనే తపనతో ఏడాది కాలం మార్కెట్ యార్డును నెలకొల్పేందుకు తీవ్ర కసరత్తు చేసిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ను హార్టికల్చర్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నాగరాజు ఈ సందర్భంగా ప్రశంసించారు. దేశంలోనే మొట్టమొదటి సారిగా పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మించనున్న ప్రాజెక్టును 31 ఎకరాల విస్తీర్ణంలో ప్యాపిలి టెర్మినల్ మార్కెట్ యార్డును నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు.  


అంతకు ముందు ప్యాపిలి పట్టణంలో గతంలో రోడ్డు విస్తరణలో తొలగించిన మహనీయుల విగ్రహాలకు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పున: ప్రతిష్ట చేశారు. శుక్రవారం సంఘసంస్కర్తలైన బీఆర్ అంబేడ్కర్, బీపీ శేషారెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి విగ్రహాలను మంత్రి బుగ్గన ఆవిష్కరించారు. స్వార్థం కోసం కాకుండా ప్రజల మంచికోసం తపించిన మహనీయుల మార్గాల్లో నేటి తరం నడవాలని ఆయన పిలుపునిచ్చారు.



Comments