కరువు మండలాల్లో తాగునీరు,ఉపాధిహామీ పనులు కల్పనలో ఇబ్బంది లేకుండా చూడండి .

 కరువు మండలాల్లో తాగునీరు,ఉపాధిహామీ పనులు కల్పనలో ఇబ్బంది లేకుండా చూడండి 


సమ్మర్ స్టోరేజి ట్యాంకులన్నీ సమీప నీటి సోర్సుల ద్వారా పూర్తిగా నిటితో నింపాలి

ప్రవేట్ బోరులను అద్దె ప్రాతిపదికన తీసుకుని ప్రజల దాహార్తిని తీర్చాలి

తాగునీటి దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రజల్లో అవగాహన పెంచాలి

80 శాతం పైగా పూర్తయిన తాగునీట పధకాలను పూర్తిచేసి అందుబాటులోకి తేవాలి

ట్యాంకులు ద్వారా నీటిసరఫరా పర్యవేక్షణకై వచ్చేవారం అందుబాటులోకి ప్రత్యేక యాప్ 

మల్టీ,సింగిల్ విలేజి తాగునీటి పధకాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించండి

                  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి

అమరావతి,22 మార్చి (ప్రజా అమరావతి):రాష్ట్రంలో ముఖ్యంగా కరువు మండలాల్లో ఎక్కడా తాగునీరు,ఉపాధి హామీ పనుల కల్పనలో ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి జిల్లా కలక్టర్లను ఆదేశించారు.కరువు మండలాల్లో ఉఫాదిహామీ పనులు,తాగునీటి సరఫరా అంశాలపై శుక్రవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయం నుండి ఎన్టిఆర్,ప్రకాశం,కర్నూలు,అనంతపురం,శ్రీ సత్యసాయి,నెల్లూరు, నంద్యాల,అన్నమయ్య,చిత్తూరు జిల్లాల కలెక్టర్లు,పంచాయితీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, జలవనరులు,విపత్తుల నిర్వహణ శాఖల అధికారులతో సిఎస్ సమీక్షించారు.ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ జూన్ నెలాఖరు వరకు కరువు మండలాల్లో తాగునీటి కొరత లేకుండా చూడడం తోపాటు పెద్ద ఎత్తున ఉపాధి హామీ పథకం కింద కూలీలకు పనులు కల్పించాలని ఆదేశించారు.వేసవి ఎండల దృష్ట్యా ఉపాధి హామీ పధకం పనులను ఉదయం 5.30 గం.ల నుండి ఉ.10.30 గం.ల వరకూ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను సిఎస్ ఆదేశించారు.

నీటి ఎద్దడి గల ఆవాసాలకు ట్యాంకులు ద్వారా తాగునీటిని సరఫరా చేయాలని కలక్టర్లను సిఎస్ ఆదేశించారు.ట్యాంకులు ద్వారా నీటిసరఫరాను పర్యవేక్షించేందుకు వచ్చే వారానికి ప్రత్యేక యాప్ ను కూడా అందుబాటులోకి తేనున్నట్టు చెప్పారు.కరువు మండలా ల్లోని సమ్మర్ స్టోరేటి ట్యాంకులన్నిటినీ సమీప నీటి సోర్సుల ద్వారా నీటిని మళ్ళించి వాటిని పూర్తిగా నీటితో నింపాలని ఆదేశించారు.అదే విధంగా వివిధ ప్రవేట్ బోర్లను అద్దె ప్రాతిపదికన తీసుకుని నీటి ఎద్దడి గల ఆవాసాలకు తాగునీటిని సరఫరా చేయాలని స్పష్టం చేశారు. భూగర్భ జల మట్టాలను నిరంతరం మానిటర్ చేస్తూ తీవ్ర నీటి ఎద్దడి గల ప్రాంతాలకు ప్రతిరోజు ట్యాంకులు ద్వారా మంచినీటి సరఫరా చేయాలని చెప్పారు.ట్యాంకరుల ద్వారా నీటి సరఫరాకు సంబంధించి ప్రత్యేకంగా ఎస్ఓపి రూపొందించి సక్రమంగా నీటి సరఫరా జరిగేలా చూడాలని ఆదేశించారు.తాగునీటిని దుర్వినియోగం చేయకుండా జిల్లాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.

80 శాతం పైగా పనులు పూర్తయిన వివిధ మంచినీటి పధకాలను యుద్ద ప్రాతి పదిక పూర్తి చేసి వాటిని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలని సిఎస్ జవహర్ రెడ్డి కలక్టర్లకు స్పష్టం చేశారు.వీటికి సంబంధించి ఎలాంటి నిధుల కొరత ఉండబోదని స్పష్టం చేశారు.అంతే గాక మల్టీ విలేజి మరియు సింగిల్ విలేజి మంచినీటి సరఫరా పధకాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ద తీసుకుని చిన్నపాటి మర్మత్తులు ఉంటే నిర్వహించి అవి సక్రమంగా పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులతోపాటు కలక్టర్లను సిఎస్ ఆదేశించారు.

తాగునీటి సరఫరాకు సంబంధించి తాగునీటి వనరుల వారీగా కార్యాచరణ సిద్ధం చేసుకుని నిరంతరం మానిటర్ చేయాలని సిఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు.తాగునీటిని పొదుపుగా వినియోగించేలా ప్రజల్లో  అవగాహన కల్పించాలని ఆదేశించారు.ముఖ్యంగా అవసరానికి మించి తాగునీటిని నిల్వ చేయడం,కుళాయిల ద్వారా నీటిని వృధాగా వదిలి వేయడం లేదా తాగునీటి యేతర అవసరాలకు నీటి దుర్వినియోగాన్నిఅరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.దీనిపై సోషల్ మీడియా ద్వారాను,గ్రామ,వార్డు సచివాలయాల ద్వారా పెద్ధ ప్రజల్లో పెద్దఎత్తున అవగాహన కల్పించాలని చెప్పారు.కరువు మండలాల్లోని భూగర్భ జలాల పరిస్థితులను ఎప్పటికప్పడు అంచనా వేసి అందుకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని సిఎస్ జవహర్ రెడ్డి కలెక్టర్లుకు స్పష్టం చేశారు.

ఈసమావేశంలో రాష్ట్ర జలవనరులు,పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి శశి భూషణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యంగా కరువు మండలాల్లో తాగునీటి ఎద్దడిని అధికమించేందుకు వచ్చే వారం నాటికి సమ్మర్ స్టోరేజి ట్యాంకులు వారీగా,మంచినీటి సోర్సులవారీగా జల వనరులు,ఆర్డబ్ల్యుఎస్,మున్సిపల్ శాఖల సమన్వయంతో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి అవసరమైన చర్యలు తీసుకుంటామని సిఎస్ కు వివరించారు.అలాగే ట్యాంకులు ద్వారా నీటి సరఫరాపై ప్రత్యేక యాప్ ను కూడా అందుబాటులోకి తేవడం తోపాటు ప్రత్యేకంగా ఎస్ఓపిని సిద్దం చేస్తామని తెలిపారు.ట్యాంకులు ద్వారా మంచినీటి సరఫరా చేసే వాహన్నాలన్నిటినీ జియో ట్యాగింగ్ చేసి నిరంతరం పర్యవేక్షించడం ద్వారా మంచినీటి వృధాను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటాని చెప్పారు.నీటిని పొదపుగా వినియోగించుకోవాలని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కూడా చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు.

అనంతరం కరువు ప్రభావిత 9 జిల్లాల కలక్టర్లు ఈసమావేశంలో వర్చువల్ గా పాల్గొని ఉపాధిహామీ పధకం ద్వారా ప్రజలకు కల్పిస్తున్నపనులు,నీటి ఎద్దడి గల ఆవాసాలు, ప్రాంతాలకు మంచినీటిని సరఫరా చేస్తున్నవిధానాలను సిఎస్ కు వివరించారు.

ఇంకా ఈసమావేశంలో పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ కమీషనర్ కె.కన్నబాబు,విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ ఆర్.కూర్మనాధ్,ఆర్డబ్యుఎస్ ఇఎన్సి కృష్ణారెడ్డి తదితర అధికారులు పాల్గొనగా వర్చువల్ గా జలవనరుల శాఖ ఇఎన్సి నారాయణ రెడ్డి పాల్గొన్నారు.

Comments