దేశమంతా మంగళగిరివైపు చూసేలా అభివృద్ధి చేసి చూపిస్తా.

 *దేశమంతా మంగళగిరివైపు చూసేలా అభివృద్ధి చేసి చూపిస్తా*


*మైనార్టీలకు రక్షణ, సంక్షేమం ఒక్క టిడిపితోనే సాధ్యం*

*2నెలల్లో అమరావతి పనులు ప్రారంభిస్తాం*

*మరోమారు ఆర్కే మాటలు నమ్మి మోసపోవద్దు*

*మంగళగిరి రచ్చబండ సభల్లో యువనేత నారా లోకేష్ భరోసా*


మంగళగిరి. (ప్రజా అమరావతి): మైనార్టీలను మోసం చేసింది జగన్ ప్రభుత్వమేనని నారా లోకేష్ అన్నారు. రాష్ట్ర చరిత్ర ఎప్పుడూ లేని విధంగా ముస్లీంలపై దాడులు, మైనార్టీ సంక్షేమ కార్యక్రమాల రద్దు, వక్ఫ్ ఆస్తుల కబ్జాలు వైకాపా హయాంలో జరిగాయని లోకేష్ అన్నారు. మంగళగిరి రూరల్ మండలం బేతపూడి, నవులూరు, తాడేపల్లి డోలాస్ నగర్ లలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన రచ్చబండ సభల్లో యువనేత పాల్గొన్నారు. మైనార్టీలకు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసింది టిడిపి ప్రభుత్వం మాత్రమేనని లోకేష్ అన్నారు.  రంజాన్ తొఫా, ఇమామ్, మౌజం లకు గౌరవ వేతనం, మసీదుల మరమత్తుల కోసం నిధులు, పెళ్లి కానుక, విదేశీ విద్య, షాదిఖానాల నిర్మాణం లాంటి అనేక కార్యక్రమాలు చేపట్టింది టిడిపి ప్రభుత్వం. జగన్ హయాంలో వైసిపి నాయకుల వేధింపులు తట్టుకోలేక ముస్లీం సోదరులు ఆత్మహత్యలు చేసుకున్నారని అబ్దుల్ సలామ్, మిస్బా ఘటనలు లోకేష్ గుర్తు చేశారు. టిడిపి గెలిచిన వెంటనే జగన్ ఆపేసిన మైనార్టీ సంక్షేమ కార్యక్రమాలు అన్ని తిరిగి ప్రారంభిస్తాం అని లోకేష్ అన్నారు.



*మరోమారు ఆర్కే మాటలు నమ్మి మోసపోవద్దు*


ఇక్కడ రెండు సార్లు ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించారు. మీ జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా? 2నెలల క్రితం ఆర్కే వైసిపికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటిస్తూ జగన్ మంగళగిరి నియోజకవర్గానికి ఇచ్చిన ఏ హామీ నిలబెట్టుకోలేదు, అందుకే పార్టీ మారుతున్నాని  చెప్పారు. కొండ, కాలువ పోరంబోకు, రైల్వే, అటవీ, దేవాదాయ భూముల్లో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న వారికి పట్టాలిస్తానని  అన్నారు. చేనేతలను ఆదుకుంటానని, మంగళగిరికి ప్రతి ఏడాది 2వేల కోట్ల ప్రత్యేక నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తానన్నారు. ఈ హామీలన్నీ ఏమయ్యాయి? ప్రత్యేక నిధులు, ఇళ్ల పట్టాలు ఏమయ్యాయి? ప్యాకేజి కుదిరాక మళ్లీ వైసిపిలో చేరి జగనంతటోడు లేడంటున్నాడు. అందుకే ఆయనకు కరకట్ట కమలహాసన్ అని పేరుపెట్టా. అమరావతే రాజధానిగా ఉంటుందని చెప్పి, ఎన్నికల్లో గెలిచాక మూడు రాజధానులకు మొదట ఓటేసింది ఆర్కేనే. ఆయన మాటలు నమ్మి మంగళగిరి ప్రజలు మరోసారి మోసపోవద్దు. 


*2నెలల్లో అమరావతి పనులు ప్రారంభిస్తాం*


2014లో అమరావతి రాజధాని బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టే సమయంలో చిన్న రాష్ట్రం, ప్రాంతాల మధ్య విద్వేషాలు పెంచడం ఇష్టంలేదని, రాజధానికి కనీసం 30వేల ఎకరాలు కావాలని, అమరావతికి సంపూర్ణ మద్దతు పలుకుతున్నాని జగన్ చెప్పారు. గత ఎన్నికల్లో విజయం సాధించాక మాటతప్పి మడమతిప్పి 3రాజధానుల నాటకానికి తెరలేపారు. అమరావతి పూర్తై ఉంటే లక్షలాది మందికి ఉద్యోగాలు వచ్చేవి. అయిదేళ్లలో ఒక్క పరిశ్రమ తీసుకురాలేదు. రాష్ట్ర భవిష్యత్ కోసం అమరావతి రైతులు 33వేల ఎకరాలు త్యాగం చేశారు. జగన్ అధికారంలోకి వచ్చాక రాజధాని రైతులను అనేక విధాలుగా ఇబ్బంది పెట్టారు. పెయిడ్ ఆర్టిస్టులని అన్నారు, మహిళలను వేధించారు. శాసనమండలిలో కూడా ఆనాడు మా గొంతు నొక్కారు. రెండునెలల్లో అమరావతిలో ఆగిపోయిన పనులు ప్రారంభిస్తాం. ఆగిపోయిన రాజధాని నిర్మాణపనులను పూర్తిచేసి తీరుతాం. ల్యాండ్ పూలింగ్ కింద భూములిచ్చిన రైతులకు న్యాయంచేస్తాం. 


*దేశమంతా మంగళగిరి వైపు చూసేలా అభివృద్ధి చేస్తా*


2019లో 21 రోజుల ముందు మంగళగిరి నియోజకవర్గానికి వచ్చాను. అప్పుడు మీ సమస్యలు నాకు తెలియవు, నా గురించి మీకు తెలియదు. అయినా బేతపూడిలో నాకు మెజార్టీ ఇచ్చారు. మంగళగిరిలో నేను ఓడిపోయినప్పటికీ ఇక్కడి ప్రజల కోసం 29 సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టా. రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపిస్తే దేశం మొత్తం మంగళగిరివైపు చూసేలా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను నిర్మిస్తాం. కాలువ, కొండ పోరంబోకు, దేవాదాయ, రైల్వే భూముల్లో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న వారికి ఇళ్ల స్థలాలను రెగ్యులరైజ్ చేసి పట్టాలిస్తాం. కృష్ణానది నుంచి పైప్ లైన్ వేసి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందిస్తాం. మంగళగిరి నియోజకవర్గంలో 20వేల ఇళ్లు కట్టించి ఇస్తాం. జగన్ రెడ్డి కటింగ్ అండ్ ఫిటింగ్ మాస్టర్. పది రూపాయలు అకౌంట్ లో వేసి, రెడ్ బటన్ తో వంద  లాగేసుకుంటున్నారు. కరెంట్ ఛార్జీలు 9 సార్లు పెంచారు, ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచారు. చెత్త పన్ను, ఇంటి పన్ను, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారు. పెళ్లి కానుక, అన్న క్యాంటీన్, చంద్రన్నబీమా, విదేశీ విద్య, ఫీజు రీయింబర్స్ మెంట్ లాంటి వంద పథకాలను కట్ చేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెంచిన కరెంట్ ఛార్జీలు, పన్నుల భారం తగ్గిస్తాం.  


*కళ్యాణమండపం, షాదీఖానా నిర్మిస్తాం*


బేతపూడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నారా లోకేష్ దృష్టికి తెస్తూ... వర్షాకాలంలో గ్రామంలోని శివాలయం గర్భగుడిలోకి వర్షపునీరు వస్తోంది. హిందూ, క్రిష్టియన్ స్మశాన వాటికను అభివృద్ధి చేయాలి. చెరువుకట్టపై నివాసం ఉంటున్న వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలి. వేణుగోపాల స్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేయడంతో పాటు కల్యాణ మండపాన్ని నిర్మించాలని కోరారు. నవులూరు ప్రజలు సమస్యలను చెబుతూ... డ్రైనేజీ, వీధిలైట్లు, రోడ్ల సమస్యను పరిష్కరించాలి. మైనారిటీలకు షాదీఖానా నిర్మించాలి. టిడ్కో ఇళ్ల సముదాయాల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు. స్మశాన వాటిక అభివృద్ధి చేయడంతో పాటుప్రహరీగోడ ఏర్పాటుచేయాలని కోరారు. మైనార్టీల కోసం షాదీఖానా నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. అధికారంలోకి వచ్చా బేతపూడిలో కళ్యాణమండపం, నవులూరులో షాదీఖానా నిర్మిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. మంగళగిరి నియోజకవర్గ జనసేన సమన్వయకర్త చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికలు ఏకపక్షంగా జరుగుతాయి. మంగళగిరిలో లోకేష్ ను లక్ష మెజార్టీతో ఘన విజయం సాధిస్తారని అన్నారు.


Comments