ఇంటి స్థలాలపై పేదలకు సర్వహక్కులు ఇచ్చిన ప్రభుత్వం మనదే: ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.



*ఇంటి స్థలాలపై పేదలకు సర్వహక్కులు ఇచ్చిన ప్రభుత్వం మనదే: ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్*



*పేదలు ఆత్మగౌరవంతో బతకాలన్నదే ముఖ్యమంత్రి సంకల్పం*


*రేపటి నుంచే బేతంచెర్లకు పుష్కలంగా స్వచ్ఛమైన కృష్ణా జలాలు*


*గత ప్రభుత్వంలో అర్హులకు పథకాలందాలన్నా.. కమిటీలు,లంచాలు,ప్రదక్షిణలు*


*బేతంచెర్లలో 1250 మంది లబ్ధిదారులకి హక్కు పత్రాల పంపిణీ*


*పేదల సంక్షేమం వల్ల డబ్బు వృథా అన్న ప్రతిపక్షాల హామీలను ప్రజలు నమ్ముతారా?*


*ప్రజలే మా బలం..వారికి చేసిన మంచే మా ధైర్యం*


*ఊరి పేర్లు తెలియని కొత్త కృష్ణులు ఊరూరా తిరగడం ఎన్నికల స్టంట్*


*ప్రభుత్వం  చేసిన అభివృద్ధి చూడడానికి కూడా విపక్షాలు గూగుల్ మ్యాప్ పెట్టుకుని పోవాలి*


*పట్టణంలో రూ.40 లక్షలతో నిర్మించిన డిజిటల్ లైబ్రరీ ప్రారంభోత్సవం*


*ప్రజలు విజ్ఞతతో ఆలోచించి మంచి చేసిన వారినే ఆశీర్వదించాలని మంత్రి బుగ్గన పిలుపు*


బేతంచెర్ల, నంద్యాల జిల్లా, మార్చి, 04 (ప్రజా అమరావతి); పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా చరిత్రలో తొలిసారి వాటిపై పూర్తి హక్కు కల్పించింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వమని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. పదేళ్ల తర్వాత ఇంటి స్థలంపై అన్ని హక్కులు ఉండేలా లబ్ధిదారులకు ఉచితంగా స్థలాలు రిజిస్ట్రేషన్ చేసి కన్వేయన్స్ డీడ్స్ అందజేసినట్లు ఆయన స్పష్టం చేశారు. బేతంచెర్ల పట్టణంలోని షిరిడీ సాయిబాబా కల్యాణ మండపంలో నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఇచ్చిన ఇళ్ల స్థలాలపై సర్వ హక్కులు కల్పించే దస్తావేజు పత్రాలను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పంపిణీ చేశారు.  సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చేతుల మీదుగా 1250 మంది కుటుంబాలు హక్కు పత్రాలను పొందారు. ప్రక్రియ పూర్తి కాగానే మరో 1750 మంది లబ్ధిదారులకి సంపూర్ణ హక్కు పత్రాలు అందించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. బేతంచెర్లలో సెంటు స్థలం సగటున మూడు నుంచి ఐదు లక్షల పలుకుతున్న నేపథ్యంలో మహిళలకు ఒక్కొక్కరికి సెంటున్నర స్థలం రూపంలో విలువైన ఆస్తిని ప్రభుత్వం అందజేస్తుందన్నారు. వసతి దీవెన, విద్యా దీవెన, అమ్మఒడి, చేయూత, చేదోడు ప్రతి పథకంలో మహిళలను భాగస్వామ్యం చేసి అసలైన మహిళా సాధికారత ఏంటో చేసి చూపించారన్నారు. నా అక్క, చెల్లెమ్మలు, నా బీసీలు, నా ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలు అని సంబోధించే ముఖ్యమంత్రిని గతంలో చూశామా అని మహిళలను మంత్రి బుగ్గన ప్రశ్నించారు.


గత ప్రభుత్వంలో  అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు అందాలంటే కూడా జన్మభూమి కమిటీలు లోపభూయిష్టంగా ఎంపిక చేయడం , దళారులు లంచాలు తీసుకోవడం,నాయకులు , అధికారుల చుట్టూ పేద ప్రజలు ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి ఉండేదని మంత్రి బుగ్గన గుర్తు చేశారు. సీఎం జగన్ నాయకత్వంలోని ప్రభుత్వం వచ్చాక సచివాలయం, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా అర్హులను పారదర్శకంగా ఎంపిక చేసి కుల,మత, ప్రాంత, పార్టీలకు అతీతంగా సంక్షేమం ప్రజల ముంగిటకు చేరుస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఊర్ల పేర్లు తెలియని వారు కొత్తగా  ఊరూరా పాంప్లెట్లు పట్టుకుని తిరగడం ఎన్నికల స్టంట్ మాత్రమేనని డోన్ లో టీడీపీ ప్రతిపక్షాలను ఉద్దేశించి మంత్రి బుగ్గన విమర్శించారు. ప్రభుత్వం కోవిడ్ ను తీసేసి మూడేళ్ల కాలంలోనే  అభివృద్ధి చేసిన ప్రాంతాలు చూడడానికి కూడా విపక్షాలు గూగుల్ మ్యాప్ పెట్టుకుని పోవాలని ఆయన ఎద్దేవా చేశారు. గతంలో ఎన్నికల సమయంలో హామీల వర్షం కురిపించి నిలబెట్టుకోని తెలుగుదేశం పార్టీని మహిళలు నిలదీయాలన్నారు. 2014 ఎన్నికల్లో 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, 3 సెంట్ల స్థలాలు,మహాలక్ష్మి పథకం పేరుతో రూ.25వేలు, పసుపు-కుంకుమ పేరుతో డ్వాక్రా రుణాల వడ్డీ మాఫీ వంటి హామీలిచ్చి ఒక్కటి కూడా నెరవేర్చని టీడీపీ మోసాన్ని ప్రశ్నించాలన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు రాసిన మనసులో మాట పుస్తకం ఆయనకు ప్రజలు, విలేకర్లు, స్వాతంత్ర్య సమరయోధులు, ప్రభుత్వ ఉద్యోగుల పట్ల గల వ్యతిరేక అభిప్రాయానికి నిదర్శనమన్నారు. తాగునీరు, సాగునీరు, రహదారులు, విద్యాలయాలు లేక వెనుకబడిన ప్రాంతాన్ని సకల సదుపాయాలున్న అభివృద్ధి ప్రాంతంగా తీర్చిదిద్దిన తీరును ప్రజలు విజ్ఞతగా గమనించాలన్నారు. ప్రజలు రెండు పర్యాయాలు తనను నమ్మి ఓటేసి గెలపించినందుకే ఇదంతా చేయగలిగినట్లు మంత్రి తెలిపారు. ప్రజలే తమ బలమని, వారికి ప్రభుత్వం చేసిన మంచే తమ ధైర్యమని మంత్రి  బుగ్గన స్పష్టం చేశారు.


 గత ప్రభుత్వాల పాలనను, ప్రస్తుత ప్రభుత్వ పరిపాలనను పోల్చుకుని మంచి అనిపించిన వారికే మరో పర్యాయం అవకాశమివ్వాలని మంత్రి బుగ్గన పిలుపునిచ్చారు.పేదల సంక్షేమం వల్ల డబ్బు వృథా అన్న ప్రతిపక్షాలు ఇపుడు కొత్తగా  హామీలను నెరవేరుస్తామని అబద్ధాలు చెబితే ప్రజలు నమ్ముతారా అని మంత్రి బుగ్గన ప్రశ్నించారు. మంగళవారం నుంచే బేతంచెర్ల ప్రజలకు స్వచ్ఛమైన కృష్ణా జలాలను తాగునీటిగా సరఫరా చేస్తున్నట్లు మంత్రి బుగ్గన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బేతంచెర్ల మహిళలంతా తాగునీటి కుళాయిల వద్ద గంగమ్మకు పూజలు చేసి తమ సంఘీభావం తెలియజేయాలన్నారు. అంతకుముందు బేతంచెర్ల పట్టణంలో రూ.40 లక్షలతో తీర్చిదిద్దిన డిజిటల్ లైబ్రరీని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రారంభించారు. 


ఈ కార్యక్రమంలో ఎంపీపీ బుగ్గన నాగభూషణం రెడ్డి, బేతంచెర్ల మున్సిపల్ ఛైర్మన్ చలం రెడ్డి, వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ మురళీకృష్ణ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ డైరెక్టర్ బాబుల్ రెడ్డి, ఆర్డీవో మహేశ్వరరెడ్డి, రెవెన్యూ, గ్రంథాలయ అధికారులు, బేతంచెర్ల ప్రజలు పాల్గొన్నారు.



Comments