అభివృద్ధి బాటలో ఏపీని నడిపించుకుందాం.

 ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం..

అమరావతి (ప్రజా అమరావతి);


తెలుగు ప్రజలందరికీ నమస్కారం. మీ అభిమానానికి కృతజ్ఞుడిని. నిన్ననే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. వెను వెంటనే ఏపీకి రావడం సంతోషంగా ఉంది. కోటప్పకొండ దగ్గర బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఆశీర్వాదం లభిస్తున్నట్లు భావిస్తున్నాను. ఈ ముగ్గురి ఆశీర్వాదం మనకి లభించి మనం అధికారంలోకి రావాలి. దృడమైన నిర్ణయాలు తీసుకునేందుకు దైవబలం ఉండబోతోంది. ఈ సారి ఎన్నికల ఫలితాలు జూన్ 4న రాబోతున్నాయి. ఈ ఫలితాల్లో ఎన్డీఏ కూటమి 400కి పైగా సీట్లు సాధించుకోవాలి. అభివృద్ధి చెందే భారత్ సాకారం చేసుకుందాం. అభివృద్ధి బాటలో ఏపీని నడిపించుకుందాం. మీరంతా నడుం బిగించి ఎన్డీఏకి 400 సీట్లు వచ్చేలా చూడాలి. ప్రాంతీయ భావాలతో పాటు జాతీయ భావంతో ఎన్డీఏ నడుచుకుంటుంది. ఎన్డీఏ కూటమి భాగస్వామ్యం పెరిగింది. చంద్రబాబు గారు, పవన్ కల్యాణ్ రాష్ట్ర భవిష్యత్తుకు చేసిన కృషి అనిర్వచనీయం. ఎన్డీఏ కూటమి లక్ష్యం వికసిత భారత్. అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యంతో అడుగులు వేస్తున్నాం. ఆ లక్ష్యంలో భాగంగా ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేసుకుందాం. డబుల్ ఇంజిన్ తో రాష్ట్రాన్ని పురోభివృద్ధిలో నడిపించుకుందాం. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశంలోని ప్రజలందరికీ సేవ అందించడమే లక్ష్యంగా పని చేస్తోంది. ప్రతి పేద గురించి ఆలోచించే ప్రభుత్వం మాది. దేశ జనాభాలో 30 కోట్ల మందిని పేదరికం నుండి బయటకు తీసుకొచ్చాం. ఎన్డీఏ ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్రానికి 10 లక్షల ఇళ్లు ఇచ్చాం. పల్నాడు ప్రాంతంలోని పేదలకు 5 వేల పక్కా ఇళ్లు కేటాయించాం. జల్ జీవన్ మిషన్ ద్వారా ఏపీలోని కోటి మందికి శుద్ధమైన తాగునీరు అందించేందుకు కృషి చేశాం. ఆయుష్మాన్ భారత్ పథకంతో పేదల ఆరోగ్యాన్ని పరిరక్షించాం. ఏపీలో కోటిన్నర మందికి ఉచిత వైద్యం అందించాం. చిన్న సన్నకారు రైతులకు కిసాన్ సమ్మాన్ నిధిగా రూ.700 కోట్లు ఇచ్చాం. ఇది ప్రజా సంక్షేమం, అభివృద్ధిపై ఎన్డీఏకు ఉన్న చిత్తశుద్ధి. ఎన్డీఏను సభ్యుల్ని గెలిపించుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత ఏంటో ఈ నివేదికలు చాటిచెబుతున్నాయి. కూటమిపట్ల మీకున్న అభిమానం, జగన్ రెడ్డి ప్రభుత్వంపై మీకున్న కోపం ఇక్కడకు వచ్చిన జనాభాతో బయటపడింది. ఏపీలో యువతలోని నైపుణ్యాన్ని తట్టిలేపి విద్యా కేంద్రంగా మార్చాలని భావించాం. గుంటూరులో ఎన్ఐడీఎం, పాలసముద్రంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, తిరుపతిలో ఐఐటీ, కర్నూలు, శ్రీసిటీలో ట్రిపుల్ ఐటీలు,  విశాఖపట్నంలో ఐఐఎం, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ, మంగళగిరిలో ఎయిమ్స్, విజయవాడలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్స్, తాడేపల్లిగూడెంలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, విజయనగరంలో ట్రైబల్ యూనివర్శిటీ ఏర్పాటు చేశాం. ఆ సంస్థలన్నీ ఏపీలో ఏర్పాటు చేసి, రాష్ట్ర యువతను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టేలా ఏర్పాటు చేశాం. ఎన్డీఏ కూటమిలోని ప్రతి భాగస్వామిని కలుపుకుని ముందుకు వెళ్తాం. 


ఇండియా కూటమిలోని వారంతా ఒకర్నొకరు వాడుకుని అంత వరకే పరిమితం చేసేలా వ్యవహరిస్తున్నారు. వారి వ్యవహారం యూజ్ అండ్ త్రో మాత్రమే. కాంగ్రెస్ పార్టీకి ముందు చూపు లేదు. కూటమి భావజాలంపై దృష్టి పెట్టండి.. కేరళలో, లెఫ్ట్ కాంగ్రెస్ ఏ విధంగా తిట్టుకుంటారో చూడండి. బెంగాల్ లో తృణమూల్, లెఫ్ట్ పరిస్థితేంటి? పంజాబ్ లో కాంగ్రెస్ ఆప్ దూషణలు గమనించండి. తమయొక్క స్వలాభం, స్వార్ధం తప్ప దేశ ప్రయోజనాలు లేని వారు దేశానికి ఏం చేస్తారో ఆలోచించండి.


ఒక్కసారి మనం తిరిగి చూసుకుంటే.. భవ్యమైన శ్రీరాముడిని మందిరం నిర్మించుకున్నాం. మన కళ్ల ముందు సాక్షాత్కరించేది నందమూరి తారకరామారావు. శ్రీరాముడిగా, శ్రీ కృష్ణుడిగా నటించడం కాదు జీవించారు. తారక రామారావు గారు వారి జీవితాన్ని పేదల కోసం రైతుల హక్కుల కోసం చేసిన పోరాటాన్ని, వారికి అందించిన సేవను గుర్తు చేసుకోవాలి. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్టీఆర్ ను ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో చూశాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన ఘటనలు గుర్తు చేసుకోవాలి. ఆంధ్రుల ముద్దు బిడ్డ పి.వి.నరసింహరావు గారికి ఎన్డీఏ ప్రభుత్వం భారతరత్న ఇచ్చి గౌరవించింది. కానీ, కాంగ్రెస్ పార్టీ పివి నరసింహరావును ఏ విధంగా అవమానించిందో తెలుసుకోవాలి. పార్టీలకు అతీతంగా భారత ముద్దుబిడ్డల్ని గౌరవించుకునేలా ఎన్డీఏ ఎప్పుడూ అడుగులు వేస్తుంది. 


ఆంధ్రప్రదేశ్ ప్రజలు రెండు సంకల్పాలు తీసుకున్నారని భావిస్తున్నా. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం గురించి, రెండో ది రాష్ట్రంలో అవినీతిలో కూరుకున్న ప్రభుత్వాన్ని పెకలించి తీసి వేయడానికి నిర్ణయించుకున్నట్లు అర్ధమవుతోంది. రాష్ట్రంలోని మంత్రులు పరిపాలన కంటే.. ఎవరు ఎక్కువ అవినీతి చేస్తారో అనే అంశంపైనే దృష్టి పెట్టారు. రాష్ట్ర అభివృద్ధి ఆకాంక్షించే వారంతా కూటమిని గెలిపించుకోవాలి. ఐదేళ్లలో కుంటుపడిన రాష్ట్ర అభివృద్ధి నేను చెప్పాల్సిన అవసరం లేదు. రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలంటే ఎన్డీఏ కూటమికి ఓటు వేయాలని కోరుతున్నా.


ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీరు గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే.. కాంగ్రెస్, వైసీపీ రెండు పార్టీలు కాదు. ఒకే వరలో ఉన్న పార్టీలు. ఒకే కుటుంబం నుండి వచ్చిన వారు నాయకత్వం వహిస్తున్నారు. జగన్ రెడ్డిపై ఉన్న కోపాన్ని కాంగ్రెస్ వైపు మళ్లించడానికి చూస్తున్నారు. కార్యకర్తలు, ప్రజలకు ఒకటే విన్నపం మన ఓటు ఎన్డీఏకు వేసినపుడే అభివృద్ధి జరుగుతుంది. రాబోయే ఐదళ్ల కాలం మనకు ఎంతో కీలకం. ఎన్డీఏకు ఓటు వేస్తే.. ఇక్కడ అభివృద్ధికి పునాదులు వేసుకుంటాం. పేదల సంక్షేమాన్ని పునరుద్దరించుకుంటాం. రాష్ట్రంలోని యువత, మహిళలకు మరిన్ని అవకాశాలకు పునాదులు వేసుకుంటాం. రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు పునాదులు వేసుకున్నట్లే. పోర్టులు, నీలి విప్లవానికి పునాది వేసుకున్నట్లు. డబుల్ ఇంజిన్ సర్కార్ తో రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుంది. మీ ఓటు అభివృద్ధికి పడాలే తప్ప.. అరాచకానికి కాదు. పండుగ రూపంలో ఎన్నికలను ఎదుర్కోబోతున్నాం. సెల్ ఫోన్లు ఉన్న వారంతా ఫ్లాష్ లైట్లు వెలిగించి ప్రజాస్వామ్యలో వెలుగులు నింపేందుకు సంఘీభావం తెలపండి. ఈ రోజు నింపే వెలుగులు రాష్ట్రాభివృద్ధి, దేశ పురోభివృద్ధికి దారులు చూపేలా ఉండాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నా.

Comments