డోన్ లో అంతర్జాతీయ ప్రమాణాలతో డ్రైవింగ్ శిక్షణ, పరిశోధన కేంద్రం : ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.



*డోన్ లో అంతర్జాతీయ ప్రమాణాలతో డ్రైవింగ్ శిక్షణ, పరిశోధన కేంద్రం : ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్*



*ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తొలి సెంటర్ గా ఖ్యాతి*


*ఐడీటీఆర్ ప్రారంభోత్సవంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్*


*విపక్షాల కుట్రల కూటమికి ప్రజల చేతుల్లో ఓటమే*


*డోన్ లోని ధర్మవరం గ్రామంలో రూ.2 కోట్లతో నిర్మించిన రహదారి ప్రారంభోత్సవం*


*ధర్మవరంలో 30 కుటుంబాలను పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్*


*ఎద్దుపెంట గ్రామంలో కేడీసీసీ బ్యాంకు కొత్త బ్రాంచ్ ప్రారంభం*


*అనుంపల్లె గ్రామంలో రూ.1.80 కోట్లతో నిర్మించిన రోడ్డు ప్రారంభం*


డోన్ , నంద్యాల జిల్లా, మార్చి, 09 (ప్రజా అమరావతి); రైతులు, మహిళల సంక్షేమం కోసం ఎద్దుపెంటలో కేడీసీసీ బ్యాంకు కొత్త బ్రాంచ్ ని ప్రారంభించినట్లు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. ఎన్నో ప్రహసనాలు దాటి నాబార్డు, రిజర్వ్ బ్యాంకులతో అనుమతులు పొంది డోన్ నియోజకవర్గంలోని సీతారామపురం, నేరేడుచెర్ల, ఎద్దుపెంటలో కేడీసీసీ బ్యాంకులను ఏర్పాటు చేశామన్నారు. గుండాల క్షేత్రం, బీసీ రెసిడెన్షియల్ స్కూల్,100 పడకల ఆస్పత్రి, ప్రతి ఊరిలో రహదారులు నిర్మించి అభివృద్ధికి చిరునామాగా డోన్ ను తీర్చిదిద్దినట్లు మంత్రి పేర్కొన్నారు. కొత్త ట్యాంకులు కట్టి గోరుకల్లు రిజర్వాయర్ ద్వారా కృష్ణా నది జలాలను 100 కి.మీ దూరం నుంచి శద్ధి చేసిన నీటిని ఇంటింటికి త్వరలోనే అందించనున్నట్లు స్పష్టం చేశారు. ఆస్పత్రి, రైతు మార్కెట్ లు కడితే ఏం అభివృద్ధి? అని ప్రశ్చించే అవగాహన లేని ప్రతిపక్ష నాయకులు, టీడీపీ అభ్యర్థులు దొరకడం డోన్ ప్రజల దురదృష్టమన్నారు. చాలా ఏళ్లుగా రాజకీయం చేస్తున్న విపక్ష నాయకులు ఫంక్షన్ హాల్ నుంచి పార్టీ వ్యవహారాలను నడిపించడం రాష్ట్రంలోనే ఎక్కడా లేదని మంత్రి బుగ్గన ఎద్దేవా చేశారు. కేఈ, కోట్ల కుటుంబాల కలయికే డోన్ అభివృద్ధిగా వారు చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఊళ్లల్లో ఎంతో మంది అమాయక మహిళల పసుపు కుంకాలు చెరిపేసి ఇప్పుడు మేమిద్దరం ఒకటని బహిరంగంగా చెప్పడం విడ్డూరమన్నారు. అదేదో అప్పుడే మీరు ఒక్కటయ్యింటే మీ కుటుంబాల మధ్యన నలిగి 200 కుటుంబాలు వారి కుటుంబ సభ్యులను కోల్పోయేవారా? అని మంత్రి బుగ్గన సూటిగా ప్రశ్నించారు. 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీలలో ఏ ఒక్కటి అమలు చేయలేదని, మహిళలే లక్ష్యంగా మళ్లీ హామీలు చెప్పడం వారిని మోసం చేసే కుట్రగా మంత్రి బుగ్గన పేర్కొన్నారు. దీనిపట్ల మహిళలు అప్పమత్తంగా ఉండాలని మంత్రి గుర్తు చేశారు. మహాలక్ష్మి పథకాలు, ఉచిత సిలిండర్లు, ఇంటి స్థలాలకు సంబంధించి మాట తప్పిన చరిత్ర చంద్రబాబుదన్నారు. మనసులో మాట పుస్తకంలో ఇలా ప్రజలకు ఏం చేయకూడదో ఎన్నో విషయాలను రాసి..ఇపుడు పుస్తకమే కనబడకుండా చంద్రబాబు కుట్ర పన్నారన్నారు. అనంతరం అనుంపల్లెలో రూ.1.80 కోట్లతో అనుంపల్లె గ్రామంలో నిర్మించిన రహదారిని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రారంభించారు. అంతకుముందు డోన్ లోని ధర్మవరం గ్రామంలో రూ.2 కోట్లతో నిర్మించిన రహదారి ప్రారంభోత్సవం చేసి పైలాన్ ఆవిష్కరించారు. ధర్మవరం గ్రామంలో 30 కుటుంబాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి  కండువా కప్పి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆహ్వానించారు.


డోన్ లో అంతర్జాతీయ ప్రమాణాలతో డ్రైవింగ్ శిక్షణ, పరిశోధన కేంద్రం ఏర్పాటు చేసినట్లు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒకే ఒక్క ఐడీటీఆర్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం ద్వారా డోన్  ఖ్యాతి గడిస్తుందన్నారు. కొత్తకోట గ్రామంలోని 20 ఎకరాల స్థలంలో రూ.20 కోట్లతో అంతర్జాతీయ డ్రైవింగ్ శిక్షణా కేంద్రం ఏర్పాటు చేసినట్లు మంత్రి బుగ్గన పేర్కొన్నారు. ఆధునిక టెక్నాలజీతో నడిచే వాహనాలను అత్యున్నత నిపుణుల ద్వారా యువతీ యువకులకు తర్ఫీదునిచ్చి వారికి ఉద్యోగాలు పొందేలా తీర్చిదిద్దనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే విశాలమైన డ్రైవింగ్ ట్రాక్ లు, రోడ్ల పనులు పూర్తి చేసుకుని సువిశాల   భవన నిర్మాణం కూడా తుది దశకు చేరుకుందని మంత్రి తెలిపారు. త్వరలోనే అందుబాటులోకి రానున్న నేపథ్యంలో జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది యువతకు సాంకేతికతతో కూడిన శిక్షణ అందుతుందన్నారు. నెలకు వందల్లో..ఏడాదికి వేలాది మంది యువతీయువకులు శిక్షణ పూర్తి చేసుకుని ఆ సర్టిఫికెట్లను అందుకుని డ్రైవింగ్ ద్వారానే నెలకు రూ.30 వేల జీతం కనీసం అందుకునే అవకాశం ఉంటుందని మంత్రి బుగ్గన తెలిపారు. రాష్ట్రంలోని ఏకైక ఐడీటీఆర్ శిక్షణ కేంద్రం పనులు మొదలుపెట్టిన కొన్నాళ్లకే ప్రారంభించుకోవడం ఆంధ్రప్రదేశ్ కు మణిహారంగా నిలుస్తుందని మంత్రి బుగ్గన అన్నారు. 


ఈ కార్యక్రమానికి కేడీసీసీ ఛైర్మన్ విజయ మనోహరి, జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, మీట్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీరాములు, డోన్ ఎంపీపీ రేగటి రాజశేఖర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

Comments