2024-25 వ్యవసాయ మరియు ఉద్యాన పంచాంగాలను ఆవిష్కరించిన సిఎస్.

 2024-25 వ్యవసాయ మరియు ఉద్యాన పంచాంగాలను ఆవిష్కరించిన సిఎస్.
విజయవాడ,9 ఏప్రిల్  (ప్రజా అమరావతి):శ్రీ క్రోధి నామ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం,డా.వైయస్సార్ ఉద్యాన వన విశ్వ విద్యాలయాలు రూపొందించిన వ్యవసాయ మరియు ఉద్యాన పంచాంగాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈమేరకు మంగళవారం విజయవాడ లోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ పంచాంగాలను ఆవిష్క రించించారు. 


వ్యవసాయ పంచాంగంలో ముఖ్యంగా రాష్ట్రంలో పండే ప్రధాన పంటలైన వరి,మొక్క జొన్న,జొన్న,చిరుధాన్యాలు (రాగులు,కొర్రలు,సజ్జలు మొదలగు),కంది,మినుము, పెసర వంటి అపరాలు,వేరు శెనగ,ప్రొద్దుతిరుగుడు వంటి నూనె గింజల పంటలు,ప్రత్తి, చెరకు వంటి వాణిజ్య పంటలు, కలప వృక్ష పంటలు మరియు అనుబంధ అంశాలైన వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం,భూసార పరీక్షలతో పాటు సామాజిక విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన పలు అంశాలను ఈ వ్యవసాయ పంచాంగంలో పొందుపర్చారు.


అలాగే ఉద్యాన వన పంచాంగం 2024-25 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల భూవాతావరణ పరిస్థితులను అనుసరించి సాగు చేయగల 17 రకాల పండ్ల తోటలు,9 రకాల తోట పంటలు,30 రకాల కూరగాయల పంటలు,7 రకాల సుగంధ ద్రవ్యాల పంటలు,23 రకాల ఔషధ మరియు సుగంధ తైల పంటలు మరియు 13 రకాల పూలు పంటల సాగుకు సంబంధించిన సమాచారాన్ని ఈపంచాంగంలో పొందు పరచడం జరిగింది.అదే విధంగా ఉద్యాన పంటల్లో ఎరువులు పురుగు మందుల కలయిక పట్టికలు,భూసార పరీక్షా విధానం,జీవ ఎరువులు, సుస్థిర వ్యవసాయం వంటి అదనపు సమాచారాన్ని దీనిలో పొందుపర్చారు.


ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ,ఉద్యాన వన పంచాంగాలు రాష్ట్రంలోని రైతులకు,ఉద్యానవన పంటలు సాగు చేసే రైతులకు అలాగే మహిళా రైతులకు ఎంతగానో ఉపయోగ పడతాయని  పేర్కొన్నారు.శ్రీ క్రోధి నామ సంవత్సరంలో రాష్ట్రంలోని రైతాంగమంతా మంచి దిగుబడులు సాధించి సుఖ శాంతులతో జీవనం సాగించాలని ఆకాంక్షించారు.


ఈ పంచాంగాల ఆవిష్కరణ కార్యక్రమంలో ఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం ఉప కులపతి డా.ఆర్.శారద జయలక్ష్మి, డా.వైయస్సార్ ఉద్యాన విశ్వ విద్యాలయం ఉప కులపతి డా.టి.జానకీ రామ్,విస్తరణ సంచాలకులు డా.కెఎస్.ఎస్ నాయక్,డా.ఇ.కరుణ శ్రీ, రిజిస్ట్రార్ డా.బి.శ్రీనివాసులు, విస్తరణ శాస్త్రం ప్రధాన శాస్త్రవేత్త డా.బి.ముకుంద రావు,ప్రధాన వ్యవసాయ సమాచార అధికారి డా.జె.శారద,సీనియర్ శాస్త్రవేత్త డా.యం.వెంకట రాములు,తదితరులు పాల్గొన్నారు.Comments