తాగునీటి చెరువులకు 6న ప్రకాశం బ్యారేజి,8న నాగార్జున సాగర్ నుండి నీరు విడుదల.

 తాగునీటి చెరువులకు 6న ప్రకాశం బ్యారేజి,8న నాగార్జున సాగర్ నుండి నీరు విడుదల


తాగునీటికై విడుదల చేసే నీరు ఇతర అవసరాలకు మళ్ళించకుండా గట్టి నిఘా పెట్టండి

ట్యాంకులు ద్వారా నీటి సరఫరాను సక్రమంగా పర్యవేక్షించండి

సిపిడబ్ల్యుఎస్ పధకాలన్నీ సమక్రమంగా పనిచేసేలా చూడండి

ఎండ వేడిమి దృష్ట్యా ఉపాధి హామీ పనులు ఉ.10 గం.ల లోపు పూర్తి చేయాలి

ఉపాధిహామీ పనులకు వెళ్ళేవారు వెంట సరపడిన మంచినీటిని తీసుకువెళ్ళాలి

            ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి

అమరావతి,4 ఏప్రిల్ (ప్రజా అమరావతి):వేసవి తాగునీటి అవసరాల దృష్ట్యా సమ్మర్ స్టోరేజి ట్యాంకులను పూర్తిగా నీటితో నింపేందుకు ఈనెల 6వ తేదీన ప్రకాశం బ్యారేజి నుండి ఏలూరు కాలువ,బందరు కాలువ,రైవస్ కాలువల ద్వారా ఎన్టిఆర్,కృష్ణా,ఏలూరు జిలాల్లకు,బకింగ్ హాం కాలువ ద్వారా గుంటూరు,బాపట్ల జిల్లాలకు నీటిని విడుదల చేయడం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి చెప్పారు.అలాగే నాగార్జున సాగర్ కుడి ప్రధాన కాలువ ద్వారా పల్నాడు,గుంటూరు,బాపట్ల జిల్లాలకు ఈనెల 8నుండి 18వ తేదీ వరకూ 10 రోజుల పాటు నీటిని విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు.రాష్ట్రంలో తాగునీటి సరఫరా  పరిస్థితులు,ఉపాధి హామీ పథకం పనులపై గురువారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో సంబంధిత శాఖల అధికారులతో సిఎస్ సమీక్షించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి దృష్ట్యా వివిధ వివిధ తాగునీటి చెరువులను నింపేందుకు ప్రకాశం బ్యారేజి మరియు నాగార్జున సాగర్ కుడి ప్రధాన కాలువ ద్వారా విడుదల చేసే నీటిని శివారు ప్రాంతాల వరకూ సమక్రంగా చేరి ఆయా సమ్మర్ స్టోరేజి ట్యాంకులను పూర్తిగా నీటితో నింపేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత జిల్లాల కలక్టర్లు,ఇతర అధికారులను సిఎస్ ఆదేశించారు.

తాగునీటి చెరువులు నింపేందుకు కాలువల ద్వారా విడుదల చేసే నీటిని చేపల, రొయ్యల చెరువులు తదితర తాగునీటేతర అవసరకాలకై కాలువలపై ఇంజన్లు,మోటార్లు వేసి అక్రమంగా నీటిని మళ్ళించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సిఎస్ జవహర్ రెడ్డి ఆయా జిల్లా కలక్టరలతో పాటు సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.ఇందుకై కాలువల వెంబడి గట్టి నిఘాను ఏర్పాటు చేసి సకాలంలో చెరువులను నింపేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అదే విధంగా నీటి ఎద్దడి గల ఆవాసాలకు ట్యాంకులు ద్వారా మంచినీటిని సరఫరా చేసే విధానాన్ని కట్టుదిట్టంగా పర్యవేక్షించాలని ఆర్డబ్ల్యుఎస్ తదితర విభాగాల అధికారులను సిఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు.రాష్ట్రంలోని అన్ని సిపిడబ్ల్యుఎస్ పధకాలన్నీ సక్రమంగా పనిచేసే విధంగా చూడాలని చెప్పారు.గ్రామీణ,పట్టణ ప్రాంతాల్లో ఎక్కడా తాగునీటికి ఇబ్బంది రాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పధకం అమలు తీరును సమీక్షిస్తూ వేసవి ఎండ తీవ్రత దృష్ట్యా కూలీలెవరు వడదెబ్బకు లోను కాకుండా ఉండేందుకు ఉపాధి హామీ పనులను ఉదయం 10.గం.లలోపు పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను సిఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు.పనులకు వచ్చే కూలీలు అందరూ వారివెంట సరిపడిన మేరకు తాగునీటిని వెంట తీసుకువెళ్ళాలని సూచించారు.ఉపాధి పనులు నిర్వహించే వర్కు సైట్లలో కూలీలకు తగిన నీడ ఉండేలా చూడడంతో పాటు అత్యవసర మెడికల కిట్లను ఇతర సౌకర్యాలను అందుబాటులో ఉంచాలని సిఎస్.జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో రాష్ట్ర జలవనరులు,పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశి భూషణ్ కుమార్ రాష్ట్రంలో ప్రస్తుతం తాగునీటి పరిస్థితులు,ఉపాధి హామీ పధకం పనులు జరుగుతున్న తీరును సిఎస్ కు వివరించారు.

ఇంకా ఈసమావేశంలో పంచాయితీరాజ్ శాఖ కమీషనర్ కె.కన్నబాబు,ఆర్డబ్యుఎస్ సిఇ గాయిత్రి, భూగర్భ జల వనరుల శాఖ డైరెక్టర్ జాన్ సత్యరాజ్ తదితర అధికారులు పాల్గొన్నారు.అలాగే వర్చువల్ గా ఆర్ధికశాఖ కార్యదర్శి డా.కెవివి.సత్యనారాయణ,మున్సిపల్ పరిపాలన శాఖ కమీషనర్ మరియు డైరెక్టర్ శ్రీకేష్ బాలాజీరావు,జలవనరులు శాఖ ఇఎన్సి నారాయణ రెడ్డి పాల్గొన్నారు.


Comments