సెంట్రల్ ఎక్స్చేంజి ద్వారా 80,111 ఫారం - 12 లు, 10,123 ఫారం - 12 డి లు మార్పిడి.

 *సెంట్రల్ ఎక్స్చేంజి  ద్వారా  80,111 ఫారం - 12 లు, 10,123 ఫారం - 12 డి లు మార్పిడి


*


అమరావతి ఏప్రిల్ 28 (ప్రజా అమరావతి): పోస్టల్ బ్యాలెట్ సెంట్రల్ ఎక్స్చేంజ్ కార్యక్రమంలో భాగంగా తొలి విడతలో 80,111 ఫారం -12 లు, 10,123 ఫారం-12డి లు మార్పిడి చేసుకోవడం జరిగింది.  ఎన్నికల విధుల్లో ఉన్న రెగ్యులర్ (ఫారం -12) మరియు అత్యవసర సేవల   (ఫారం -12డి) ఉద్యోగులకు పనిచేసే జిల్లా లోనే పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ఆధ్వర్యంలో వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో పోస్టల్ బ్యాలెట్ల తొలి ఎక్స్చేంజి కార్యక్రమం ఆదివారం జరిగింది. అదనపు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఏం.ఎన్.హరింద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సెంట్రల్ ఎక్స్చేంజ్ కార్యక్రమంలో 26 జిల్లాలకు చెందిన పోస్టల్  బ్యాలెట్ నోడల్ అధికారులు పాల్గొన్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన ఈ ఎక్స్చేంజ్ కార్యక్రమంలో 26 జిల్లాలకు చెందిన పోస్టల్ బ్యాలెట్ నోడల్ ఆఫీసర్లు వారి జిల్లాలో సేకరించబడిన  

ఫారం -12 లు మరియు ఫారం-12డి లతో హాజరయ్యారు. ఏ ఏ జిల్లాలకు చెందిన పోస్టల్ బ్యాలెట్ లను ఆయా జిల్లాల పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారులకు అందజేసుకున్నారు.


ఈ ఎక్సేంజ్ కార్యక్రమంలో అందిన దరఖాస్తులకు అనుగుణంగా ఆయా జిల్లాల పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారులు ఖాళీ పోస్టల్ బ్యాలెట్ లతో మే 3 వ  తారీఖున తిరిగి ఈ సెంట్రల్ ఎక్స్చేంజ్ కార్యక్రమానికి హాజరై ఏ జిల్లాలకు చెందిన పోస్టల్ బ్యాలెట్ లను ఆ జిల్లాల పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారులకు అందజేస్తారు. ఈ విధంగా అందిన ఖాళీ పోస్టల్ బ్యాలెట్ లను సంబధిత ఉద్యోగులకు అందజేసి, ఆయా ఉద్యోగులు ఓటు వేసిన తదుపరి మళ్లీ ఆ పోస్టల్ బ్యాలెట్ లను  మే 10 వ తేదీన తిరిగి ఈ సెంట్రల్ ఎక్సైజ్ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాలకు పంపించడం జరుగుతుంది.


తొలిసారిగా జరిగిన ఈ సెంట్రల్ ఎక్స్చేంజ్ కార్యక్రమంలో ఫారం - 12 లకు సంబంధించి అత్యధిక మొత్తంలో విశాఖపట్నం జిల్లా నుండి 5,625 దరఖాస్తులు రాగా, అత్యల్పంగా 969 దరఖాస్తులు అల్లూరి సీతారామరాజు జిల్లా నుండి వచ్చాయి. ఫారం -12 డి లకు సంబంధించి అత్యధిక మొత్తంలో 999 దరఖాస్తులు పల్నాడు జిల్లా నుండి రాగా, అత్యల్పంగా 25 దరఖాస్తులు శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చాయి. 


జాయింట్ సీఈఓ వెంకటేశ్వరరావు, డిప్యూటీ సీఈవో మల్లిబాబు తదితరులతోపాటు అన్ని జిల్లాలకు చెందిన పోస్టల్ బ్యాలేట్ నోడల్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.



Comments