వెబ్ క్యాస్టింగ్, జీపీఎస్ ద్వారా మద్యం సరఫరాపై నియంత్రణ.

 *వెబ్ క్యాస్టింగ్, జీపీఎస్ ద్వారా మద్యం సరఫరాపై నియంత్రణ


*

*•మద్యం అక్రమ నిల్వలు, అమ్మకం, పంపిణీని నిరోదించాలి*

*రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా*

                                                                                                                                                 అమరావతి, ఏప్రిల్ 11 (ప్రజా అమరావతి):    రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో మద్యం అక్రమ నిల్వలు, అమ్మకం, పంపిణీని నిరోదించాలని, వెబ్ క్యాస్టింగ్, జీపిఎస్  ద్వారా మద్యం సరఫరాను నియంత్రించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సంబందిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు.  రాష్ట్రంలో అక్రమ మద్యం సరఫరాను అరికట్టేందుకు వెబ్ క్యాస్టింగ్, జీపీఎస్ సాంకేతికత ద్వారా నిఘా పెంచేందుకు తగు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ను ఆదేశించారు.  రాష్ట్రంలోని డిస్టీలరీలు-బ్రెవరీలు (మద్యం తయారీ సంస్థలు), మద్యం గోడౌన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు, మద్యం తయారీ-నిల్వ చేసే స్థలాల వంటి కీలక స్థానాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఆయా సంస్థలు, గోడౌన్లకు వచ్చి వెళ్లే వాహనాలు మరియు మద్యం తరలించే వాహనాలకు జీపీఎస్ కనెక్టివిటీని ఏర్పాటు చేయాలన్నారు.  మద్యం తయారీ సంస్థల నుండి మద్యం షాపులు, బార్లు లేదా ఇతర సంస్థలకు సరఫరా చేస్తున్న వాహనాలపై జీపీస్ ట్రాకింగ్ ద్వారా నిఘా ఉంచాలన్నారు. ఈ ప్రక్రియను అంతా వెబ్ క్యాస్టింగ్ ద్వారా గమనించేలా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం మరియు జిల్లా ఎన్నికల అధికారుల కార్యాలయాలకు అనుసంధానం చేయాలన్నారు.   ఈ నెల 15 లోగా వెబ్ క్యాస్టింగ్, మద్యం సరఫరా చేసే వాహనాల జీపీఎస్ ట్రాకింగ్ కు సంబంధించిన ఏర్పాట్లు అన్నింటినీ పూర్తి చేయాలని ఆదేశించారు.


అదే విదంగా పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికలను అమలు చేయడం ద్వారా మద్యం అక్రమ నిల్వలు, అమ్మకం, పంపిణీని నిరోదించాలని, తనిఖీలను ముమ్మరం చేయాలని  ఆబ్కారీ శాఖ కమిషనర్కు మరియు స్పెషల్ ఎన్ఫోర్సుమెంట్ బ్యూరో కమిషనర్కు ఆదేశాలు జారీచేశారు. మద్యాన్ని దుర్వినియోగ పర్చడం ద్వారా ఓటర్లను ప్రలోభపర్చేందుకు ఏమాత్రం అవకాశం లేకుండా అన్ని మార్గాలను మూసివేయాలని ఆదేశించారు. ఈ విషయంలో భారత ఎన్నికల సంఘం మరియు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం జారీచేసిన మార్గదర్శకాలను పటిష్టంగా అమలు పర్చాలని ఆదేశించారు.

                                                                                                                                       

Comments