జాతరను తలపించిన నారా లోకేష్ నామినేషన్ ర్యాలీ.

 [*జాతరను తలపించిన నారా లోకేష్ నామినేషన్ ర్యాలీ**తండ్రి బాటలోనే యువనేత నారా లోకేష్ నామినేషన్*


*లోకేష్ తరపున నామినేషన్ వేసిన కూటమినేతలు*


*2సెట్లు దాఖలు చేసిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నేతలు*


మంగళగిరి (ప్రజా అమరావతి): టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేష్ నామినేషన్ కార్యక్రమం వేలాది కార్యకర్తల కేరింతల నడుమ గురువారం మంగళగిరిలో ఉత్సాహంగా సాగింది. నామినేషన్ దాఖలులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సాంప్రదాయాన్ని లోకేష్ కొనసాగించారు. యువనేత లోకేష్ తరపున కూటమికి చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నేతలు 2సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలుచేశారు. మంగళగిరి టిడిపి సమన్వయకర్త నందం అబద్దయ్య, జనసేన సమన్వయకర్త చిల్లపల్లి శ్రీనివాసరావు, బిజెపి సమన్వయకర్త పంచుమర్తి ప్రసాద్ నేతృత్వంలో మధ్యాహ్నం 2.34 గంటలకు రిటర్నింగ్ అధికారి రాజకుమారి గనియాకు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఉదయం 10.30గంటల ప్రాంతంలో టీడీపీ-జనసేన-బీజేపీకి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నేతలు పాతమంగళగిరి సీతారామ కోవెల వద్దకు చేరుకున్నారు. నారా లోకేష్ నామినేషన్ పత్రాలతో కూటమినేతలు ఆలయంలో పూజలు నిర్వహించగా, వేదపండితులు ఆశీర్వచనాలు అందించారు. అనంతరం ఆలయం వెలుపల హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మతపెద్దలు సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. భారీగా తరలివచ్చిన కార్యకర్తలతో సీతారామకోవెల పరిసరాలు జాతరను తలపించాయి. నామినేషన్ కార్యక్రమంలో గుంటూరు పార్లమెంటు టిడిపి ప్రధానకార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, మంగళగిరి పట్టణ అధ్యక్షుడు దామర్ల రాజు, మంగళగిరి మండలపార్టీ అధ్యక్షులు తోట పార్థసారధి, రాష్ట్ర బిసిసెల్ ఉపాధ్యక్షుడు రేఖా సుధాకర్ గౌడ్, రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు దొప్పలపూడి జ్యోతిబసు, తెలుగుమహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల జయసత్య, గుంటూరు పార్లమెంటు ఎస్సీ సెల్ అధ్యక్షుడు వేమూరి మైనర్ బాబు, పట్టణ పార్టీ మాజీ అధ్యక్షుడు ఇట్టా పెంచలయ్య, నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ ఇబ్రహీం, నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు ఆరుద్ర భూలక్ష్మి, పార్టీ సీనియర్ నాయకుడు దొంతిరెడ్డి సాంబిరెడ్డి, జనసేన రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయశేఖర్, సంకా బాలాజీ గుప్త, నైనాల లావణ్య, చాగంటిపాటి పూర్ణ చంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

*జైత్రయాత్రలా సాగిన లోకేష్ నామినేషన్ ర్యాలీ*

మంగళగిరి సీతారామకోవెల వద్ద పూజల అనంతరం పట్టణంలో టిడిపి-జనసేన-బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ జైత్రయాత్రలా సాగింది. మంగళగిరి ప్రధాన వీధులు జనంతో హోరెత్తాయి.  మండుటెండలో సైతం కార్యకర్తలు, అభిమానులు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. సీతారామ కోవెల నుంచి మిద్దెసెంటర్, వైష్ణవి కళ్యాణమండపం, పాతబస్టాండు మీదుగా ర్యాలీ కొనసాగింది. ర్యాలీకి అడుగడగునా మంగళగిరి ప్రజలు సంఘీభావం తెలిపారు.  యువతీయువకులు, వృద్ధులు సైతం డ్యాన్సులు వేస్తూ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. నారా లోకేష్ తరపున నామినేషన్ ర్యాలీకి అడుగడుగునా మహిళలు నీరాజనాలు పట్టారు. నియోజకవర్గం నలుమూలల నుంచి వేలసంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు ద్విచక్రవాహనాలపై జెండాలు కట్టుకుని ర్యాలీలో పాల్గొన్నారు. డప్పు శబ్దాలు, డిజె సౌండ్లు, సంప్రదాయ నృత్యాలతో జనజాతరను తలపించింది. యువనేతకు సంఘీభావంగా ఎమ్మార్పీఎస్, దళిత సంఘాల నేతలు భారీగా తరలివచ్చారు. పసుపుజెండాలు, టోపీలు ధరించి తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు కార్యక్రమానికి హాజరయ్యారు.

*లోకేష్ లక్ష మెజారిటీతో గెలవడం ఖాయం!*

నామినేషన్ దాఖలు తర్వాత మంగళగిరి నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త నందం అబద్దయ్య మాట్లాడుతూ.. నియోజకవర్గ చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా అశేష ప్రజానీకం ర్యాలీకి హాజరయ్యారని ఆనందం వ్యక్తంచేశారు. లోకేష్ లక్ష మెజార్టీతో గెలుస్తారు. ఆయన రాలేకపోయినా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే సారధులై కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు. ఈ జనసందోహమే విజయానికి సూచిక అని అన్నారు. జనసేన సమన్వయకర్త చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఈ రోజు మంగళగిరి చరిత్రలో ఓ సువర్ణాధ్యాయం. స్థానిక ప్రజలకే పగ్గాలు ఇచ్చే దిశగా నారా లోకేష్ అడుగులు వేశారు. టిడిపి-జనసేన-బీజేపీ బలపర్చిన ఉమ్మడి అభ్యర్థి నారా లోకేష్ నామినేషన్ కార్యక్రమంలో బీసీ, ఎస్సీ, మైనార్టీ నాయకులు భాగస్వాములయ్యారు. మనకోసం పనిచేసే నారా లోకేష్ ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ సమన్వయకర్త పంచుమర్తి ప్రసాద్ మాట్లాడుతూ.. టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నారా లోకేష్ నామినేషన్ కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగింది. టీడీపీ-జనసేన-బీజేపీ నాయకులు, కార్యకర్తలతో పాటు వేలాది ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారన్నారు. ఎన్.లావణ్య మాట్లాడుతూ.. టీడీపీ-జనసేన-బీజేపీ ఆధ్వర్యంలో ప్రజాప్రభుత్వం కోసం 5కోట్లమంది ప్రజలు ఎదురుచూస్తున్నారు. బడుగు, బలహీనవర్గాల చేతులమీదుగా లోకేష్ నామినేషన్ వేయడం... ఆయా వర్గాలకు టిడిపి ఇచ్చే ప్రాధాన్యతకు అద్దంపడుతోందని అంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.


Comments