ఓటరు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ.



కాకినాడలోని ఐడియల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌లో ఓటరు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ



కాకినాడ, ఏప్రిల్ 20 (ప్రజా అమరావతి);


సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కాకినాడలోని ఐడియల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌లో ఓటరు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజాస్వామ్యంలో ఓటు యొక్క కీలక పాత్రను నొక్కిచెప్పడమే కాకుండా; ఎన్నికలలో ఓటరు వేసే ఓటు యొక్క ప్రాముఖ్యతను సైతం అందరికీ అర్థమయ్యేలా వివరించారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర PIB & CBC అదనపు డైరెక్టర్ జనరల్‌గా వ్యవహరిస్తున్న శ్రీ. రాజేందర్ చౌదరి మాట్లాడుతూ- మన ప్రజాస్వామ్య దేశంలో దేశాభివృద్ధికి ఓటు చాలా కీలకమని పేర్కొన్నారు. యువకులు బాధ్యతాయుతంగా ఓటు వేయాలని, చిత్తశుద్ధి గల అభ్యర్థులను ఎన్నుకోవాలని, తద్వారా మన దేశాన్ని ప్రగతిని దిశగా నడిపించాలని అక్కడ ఉన్న యువతను కోరారు.

విద్యావంతులైన వ్యక్తులను వారి ఓటుకు విలువనివ్వమని ప్రోత్సహిస్తూ- దేశ భవిష్యత్తును రూపొందించడానికి యువత రాబోయే ఎన్నికలలో పాల్గొనాలని ఈ సందర్భంగా చౌదరి పిలుపునిచ్చారు. 2024 సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య కసరత్తులో పాల్గొనాలని ఆయన దేశంలోని యువతను ప్రేరేపించారు.

కాకినాడ జిల్లాకు 'స్వీప్' నోడల్ అధికారి అయిన శ్రీ. విజయ్ భాస్కర్ మాట్లాడుతూ- ఓటింగ్ ప్రక్రియ ద్వారా నాయకులను ఎంపిక చేయడంలో పౌరుల పాత్రను హైలైట్ చేశారు. ఓటు హక్కుపై విద్యార్థులు తమ సంఘాల్లో అవగాహన కల్పించాలని ఆయన కోరారు.


 కాకినాడ CBC ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ అయిన శ్రీ. శ్రీరామ మూర్తి ఖండాల ఒక ఓటు యొక్క పరివర్తనా శక్తి గురించి నొక్కిచెప్పారు. అలాగే ఓటు ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించడానికి భారత ఎన్నికల సంఘం ద్వారా రూపొందించిన సందేశాత్మక చిత్రాలను సైతం ప్రదర్శించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన వివిధ పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డు ప్రజెంటేషన్‌లు మరియు ఓటింగ్ గురించి అవగాహన పెంచడానికి CBC నుండి కళాకారులచే సంగీత ప్రదర్శనలు సైతం నిర్వహించారు.

ఈ కార్యక్రమ వేదిక ద్వారా ఐడియల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ సహా ప్రముఖులు ఓటు ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు మరియు వాటాదారులు చురుకుగా పాల్గొన్నారు. అందరూ ఓటరు అవగాహన మరియు పౌర భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి కట్టుబడి ఉంటామని అన్నారు.


Comments