సంస్కృతం విద్య మాత్రమే కాదు, ఉన్నతికి మార్గం కూడా - ఉపరాష్ట్రపతి.



సంస్కృతం విద్య మాత్రమే కాదు, ఉన్నతికి మార్గం కూడా - ఉపరాష్ట్రపతి


యువత సంస్కృత భాషకు రాయబారులుగా మారి, ముందు తరాలకు చేరవేయాలి.


వినూత్న మార్గాల్లో అభివృద్ధి, పరిశోధనల ప్రోత్సాహం ద్వారా సంస్కృతాన్ని ఆధునిక ప్రపంచానికి మరింత చేరువ చేయాలని పిలుపు


వలసవాద మనస్తత్వం, ధోరణుల కారణంగా సంస్కృతం ప్రధాన విద్యా స్రవంతికి సంస్కృతం దూరమైంది


పురాతన రాత ప్రతుల సంరక్షణలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవటం మీద విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని సూచన


తిరుపతిలో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం మూడవ స్నాతకోత్సవంలో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి



తిరుపతి, ఏప్రిల్ 26, (ప్రజా అమరావతి);


సంస్కృతం దైవిక భాష అని, ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగే వారికి పవిత్ర వారధిగా సంస్కృతం మహోన్నత మార్గమని భారతదేశ గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ జగదీప్ ధన్ ఖడ్ పేర్కొన్నారు. తిరుపతిలో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం మూడవ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన, తుఫాను వంటి ప్రస్తుత సామాజిక పరిస్థితుల్లో సంస్కృతం ఓ ప్రత్యేకమైన సాంత్వనను అందిస్తుందని పేర్కొన్నారు. మానసిక బలం, ఆధ్యాత్మిక ప్రశాంతత, లోతైన పరిజ్ఞానాలనను ఏక కాలంలో అందిచగల శక్తి సంస్కృతానికి ఉందని తెలియజేశారు. 


శుక్రవారం ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి తిరుపతి చేరుకున్న ఉపరాష్ట్రపతి, ముందుగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల శ్రీనివాసుని సేవ భాగ్యం ఆ పరమాత్మునికి మరింత దగ్గరగా ఉన్నామన్న భావనని కలిగించిందని, నేరుగా భగవంతుని ఆశీస్సులు లభించిన అనుభూతి కలిగిందని, దేశ ప్రజలందరి క్షేమం కోసం ఆ కలియుగ ప్రత్యక్ష దైవాన్ని ప్రార్థించినట్లు తెలిపారు. సతీసమేతంగా తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న ఆయన సామాజిక మాధ్యమంలో తన అనుభూతిని పంచుకున్నారు. తిరుమల శ్రీనివాసుని దర్శన భాగ్యం తన అదృష్టమని, శేషాచలం పర్వతాల మధ్య నిర్మలమైన వాతావరణంలో నెలకొన్న ఈ ప్రసిద్ధ పుణ్యం క్షేత్రం, భారతదేశ ఆధ్యాత్మిక వారసత్వానికి మహోన్నత చిహ్నమని, దేశ పౌరుల ఆనందం, శ్రేయస్సు కోసం స్వామి వారిని ప్రార్థించినట్లు అందులో పేర్కొన్నారు. 


భారతీయ సనాతన విజ్ఞాన పునరుద్ధరణ, ప్రచారంలో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వంటి సంస్థల పాత్రను నొక్కి చెప్పిన ఉపరాష్ట్రపతి, సంస్కృత వారసత్వానికి - ఆధునిక విద్యా విధానాల అవసరాలకు మధ్య అంతరాన్ని తగ్గించేందుకు వినూత్న మార్గాలను అవలంబించటంతో పాటు... కొత్త పాఠ్యాంశాలను అభివృద్ధి చేయటం, పరిశోధనలను ప్రోత్సహించటం మీద దృష్టి నిలపాలని పిలుపునిచ్చారు. విలువైన ప్రాచీన రాత ప్రతులను పరిరక్షించటంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవలసిన అవసరాన్ని నొక్కి చెప్పిన ఉపరాష్ట్రపతి, సంస్కృతం మనల్ని దైవిక మార్గంలో ముందుకు నడపటమే గాక, అనేక విషయాల గురించి సమగ్రమైన అవగాహన పెంపొందించుకోవటంలో తోడ్పడుతుందని అభిప్రాయపడ్డారు. 


సంస్కృతాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపదగా అభివర్ణించిన ఉపరాష్ట్రపతి, సంస్కృత పరిరక్షణ, ప్రచారం వంటివి జాతీయ ప్రాధాన్యతగా తీసుకోవాలని సూచించారు. నేటి అవసరాలకు అనుగుణంగా సంస్కృతం అభివృద్ధి చెందాలన్న ఆయన, సంస్కృత అభ్యాసాన్ని మరింత సులభతరం చేయాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. ఓ భాషనైనా సమాజం వినియోగించి, సాహిత్యాన్ని కూర్చినప్పుడే ఆ భాష మనుగడ సాగుతుందన్న ఆయన, భారతీయ వారసత్వానికి మూలమైన సంస్కృత వినియోగం మన దైనందిన జీవితంలో మరింత పెరగాలని సూచించారు.


మతపరమైన తాత్విక గ్రంథాలే కాక వైద్యం, నాటకం, సంగీతం, విజ్ఞానం వంటి అంశాల్లో లౌకిక రచనా సంపదనకు కలిగిన ఉన్న సంస్కృత భాష వైవిధ్యతను ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, ప్రధాన విద్యా స్రవంతిలో సంస్కృతం భాగం కాకపోవటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. భారతీయ విజ్ఞాన సంస్థల్లో వలసవాద మనస్తత్వ ధోరణి పెరగటమే దీనికి కారణమని, ఈ పరిస్థితిని అధిగమించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సంస్కృత అధ్యయనం కేవలం విద్యకు మాత్రమే పరిమితం కాదని, దీని ద్వారా మానసిక బలం, ఆధ్యాత్మిక ప్రశాంతత, లోతైనా పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవచ్చని పేర్కొన్నారు. సంస్కృత వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చిన ఉపరాష్ట్రపతి, అది విద్యా పరమైన జ్ఞానమే కాదు... ఉన్నతికి మార్గమని పేర్కొన్నారు. ఈ అమూల్య వారసత్వానికి యువతరం రాయబారులుగా మారి, ముందు తరాలకు అందజేయాలని అభిలషించారు.


Comments