సీజర్లపై దృష్టిపెట్టండి... కోడ్‌ ఉల్లంఘనలపై చర్యలు తీసుకోండి.

 *సీజర్లపై దృష్టిపెట్టండి... కోడ్‌ ఉల్లంఘనలపై చర్యలు తీసుకోండి*- జిల్లా యంత్రాంగానికి సిఈవో ముఖేష్‌కుమార్‌ మీనా ఆదేశం

- జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌

నెల్లూరు, ఏప్రిల్ 11 (ప్రజా అమరావతి):  ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో కోడ్‌ ఉల్లంఘనలు, సీజర్లపై ప్రత్యేక దృష్టిపెట్టాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా అధికారులను ఆదేశించారు. గురువారం  నెల్లూరు కార్పొరేషన్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో  జిల్లా కలెక్టర్‌ హరినారాయణన్‌, జిల్లా ఎస్పీ కె.ఆరీఫ్‌ హఫీజ్‌, నెల్లూరు, కోవూరు, నెల్లూరు రూరల్‌ అసెంబ్లీ  నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులు వికాస్‌ మర్మత్‌, సేదు మాధవన్‌. మలోల, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు, విఎస్‌టి బృందాలతో సిఈవో ముఖేష్‌ కుమార్‌ మీనా ప్రత్యేకంగా సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా మీనా మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల ప్రక్రియలో భాగంగా మాడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ను పక్కాగా అమలు చేయాలని, కోడ్‌ ఉల్లంఘిస్తే నిబంధనల మేరకు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో మద్యం విక్రయాలు, గోడౌన్లలో మద్యం నిల్వలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. చెక్‌పోస్టుల వద్ద గట్టి నిఘా వుంచి సీజర్లను పెంచాలని ఆదేశించారు. ఎలాంటి ఘర్షణలకు తావులేకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. 


*జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు : కలెక్టర్‌ హరి నారాయణన్‌*

..................................... 

ఎన్నికల నిర్వహణకు జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాలను కలెక్టర్‌ ఎం హరినారాయణన్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా సీఈవో మీనాకు వివరించారు. జిల్లాలో ఓటరు దరఖాస్తులను సత్వరమే పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో 2460 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో ఓటర్లు ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు చెప్పారు. మూడు కంటే ఎక్కువ పోలింగ్‌ కేంద్రాలున్న ప్రాంతాల్లో ఓటరు ఫెసిలిటేట్‌ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఎన్నికల సిబ్బందికి కార్యక్రమాలు పూర్తి చేస్తున్నట్లు చెప్పారు. ఈవీఎంలు పూర్తిస్థాయిలో ఉన్నాయని పేర్కొన్నారు. క్యూలైన్లు, బారికేడిరగ్‌, మంచినీరు, సిసి కెమెరాలు ఏర్పాట్లపై దృష్టిసారించామన్నారు. ఈనెల 12న రాజకీయ పార్టీల ప్రతినిధులతో ర్యాండమైజేషన్‌ నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ చెప్పారు. ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేసేందుకు అన్ని చర్యలు సకాలంలో చేపడుతున్నట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని పక్కాగా అమలు చేస్తున్నామని చెప్పారు. కలెక్టరేట్లో ఎం సి ఎం సి కమిటీని ఏర్పాటుచేసి రాజకీయ పార్టీల ప్రకటనలకు అనుమతులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు 137 ముందస్తు అనుమతులను మంజూరు చేసామన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన పై వస్తున్న ఫిర్యాదులను సకాలంలో పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. పోస్టల్ బ్యాలెట్, హోమ్ ఓటింగ్ పై ఎన్నికల అధికారులకు అవగాహన కల్పించినట్లు చెప్పారు.  

ఈ కార్యక్రమంలో ఎఎస్పీ సౌజన్య, నోడల్‌ అధికారులు శర్మద, ప్రసాదరావు,  సదారావు, బాపిరెడ్డి, సాలెం రాజు, చందర్, అనిత, పద్మాదేవి, పివిజె రామారావు, సురేష్‌కుమార్‌, శ్రీనివాసులు, వెంకట్రావు, పద్మావతి తదితరులు పాల్గొన్నారు. Comments