సమస్యలపై ప్రశ్నించినందుకు ఎట్రాసిటీ కేసుపెట్టారు!.



*సమస్యలపై ప్రశ్నించినందుకు ఎట్రాసిటీ కేసుపెట్టారు!*



*పెనుమూలి రచ్చబండ సభలో మైనారిటీ మహిళ ఆవేదన*


దుగ్గిరాల (ప్రజా అమరావతి): సమస్యలపై ప్రశ్నించినందుకు మహిళను అని కూడా చూడకుండా వైసిపి నాయకులు తనపై ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు బనాయించారని ఓ మైనారిటీ మహిళ యువనేత నారా లోకేష్ ఎదుట వాపోయింది. దుగ్గిరాల మండలం పెనుమూలి గ్రామంలో రచ్చబండ సందర్భంగా సానియా సుల్తానా అనే మహిళ తమ గోడు విన్పిస్తూ... నేను సంగం డెయిరీ పార్లర్ నడుపుకుంటూ ఇద్దరు బిడ్డలతో జీవనం సాగిస్తున్నాను. వర్షం పడితే మా బిడ్డలు స్కూలుకి వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నారు, గ్రామంలో కనీసం కాల్వల్లో పూడిక తీయడంలేదు. ఉర్దూ స్కూలుకు నిధులు విడుదల చేయాలని ఎమ్మెల్యేని అడిగినందుకు నాపై ఎస్సీ,ఎస్టీ ఎట్రాసిటీ కేసు బనాయించారు. వేళపాళా లేకుండా ఇంటికి పోలీసులు వచ్చి వేధిస్తుండటంతో కొద్దిరోజులు ఊరువదిలి పొరుగు ఊళ్లో తలదాచుకోవాల్సి వచ్చింది. సమస్యలపై ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడతారా అంటూ సుల్తానా ఆక్రోశం వ్యక్తంచేసింది. యువనేత లోకేష్ స్పందిస్తూ... జగన్ అధికారంలోకి వచ్చాక వ్యవస్థలను రాజకీయాల కోసం ఉపయోగిస్తూ భ్రష్టు పట్టించారు. నాపై కూడా ఎస్సీ,ఎస్టీ ఎట్రాసిటీ, హత్యాయత్నం కేసుతో సహా 23 కేసులు బనాయించారు. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడకూడదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకు కూడా పలువురిపై కేసులు బనాయించి ఇబ్బందులు పెట్టారని తెలిపారు. మరికొద్ది రోజుల్లో ప్రజాప్రభుత్వం వచ్చాక ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజలను ఇబ్బంది పెట్టారో వారిపై జ్యుడీషియల్ ఎంక్వయిరీ వేసి ఉద్యోగాలనుంచి తొలగిస్తాం, జైలుకు కూడా పంపిస్తాం, కొద్దిరోజులపాటు ధైర్యంగా ఉండాలని లోకేష్ భరోసా ఇచ్చారు.


Comments