శ్రీవారి ఆలయంలో వేడుకగా ఉగాది ఆస్థానం.

 శ్రీవారి ఆలయంలో వేడుకగా ఉగాది ఆస్థానం


తిరుమల, 09 ఏప్రిల్ (ప్రజా అమరావతి): తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది ఆస్థానం వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో శ్రీ ఏవి.ధ‌ర్మారెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి, విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేశారు. విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశించారు. శ్రీవారి ఉత్సవర్లను బంగారు వాకిలిలో గరుడాళ్వారుకు అభిముఖంగా సర్వభూపాల వాహనంపై వేంచేపు చేశారు. శ్రీవారి ఉత్సవర్ల పక్కనే మరో పీఠంపై స్వామివారి సర్వసైన్యాధ్యక్షులు శ్రీ విశ్వక్సేనుల వారిని వేంచేపు చేశారు. ఆ తరువాత శ్రీవారి మూలవిరాట్టుకు, ఉత్స‌వ‌మూర్తులకు నూతన వస్త్రాలను ధరింపచేశారు. అనంతరం పంచాంగ శ్రవణం జరిగింది. బంగారు వాకిలి వ‌ద్ద‌ ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా ఉగాది ఆస్థానం నిర్వహించారు.

ఆలయం వెలుపల ఈవో మీడియాతో మాట్లాడుతూ, భక్తులందరికీ నూతన తెలుగు శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచం, దేశం, రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు. శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు వివరించారు.

ఈ కార్య‌క్ర‌మంలో డిఎల్ఓ శ్రీ వీర్రాజు, ఎస్ఇ-2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, విజివో శ్రీ నంద కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

Comments