అత్యుత్తమ విద్యాబోధనలు నేర్చుకొని ప్రభావవంతమైన ఉపాధ్యాయుడిగా మారేందుకు టీచర్లకు సదవకాశం.
విజయవాడ  (ప్రజా అమరావతి);


*అత్యుత్తమ విద్యాబోధనలు నేర్చుకొని ప్రభావవంతమైన ఉపాధ్యాయుడిగా మారేందుకు టీచర్లకు సదవకాశం**47 రోజుల వేసవి సెలవుల్లో ప్రముఖ విద్యా నిపుణుడు  డౌగ్ లెమోవ్ రాసిన "టీచ్ లైక్ ఏ ఛాంపియన్" అనే పుస్తకం ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు చదవాలని సూచన*


*తద్వారా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన దాదాపు 49 బోధనా పద్ధతులు నేర్చుకోవచ్చని హితువు*


*విద్యార్థులకు ప్రపంచ స్థాయి బోధన అందించాలన్నదే లక్ష్యం*


*ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు తమ అత్యుత్తమ బోధన ద్వారా విద్యార్థుల భవిష్యత్ కు బంగారు బాటలు వేస్తారని ఆకాంక్ష*     


*ఏప్రిల్ 23న ముగియనున్న 2023-24 విద్యా సంవత్సరం*


*జూన్ 12వ తేదీన పునఃప్రారంభం కానున్న పాఠశాలలు*


:- *పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ. ప్రవీణ్ ప్రకాష్*


వచ్చే విద్యా సంవత్సరం నుండి మరింత మెరుగైన, ప్రభావవంతమైన ఉపాధ్యాయుడిగా పేరు తెచ్చుకునేందుకు రాబోయే వేసవి సెలవులు చాలా కీలకమని పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ. ప్రవీణ్ ప్రకాష్ ఉపాధ్యాయులకు సూచించారు. ఏప్రిల్ 23న 2023-2024 విద్యా సంవత్సరం ముగియడం, కొత్త విద్యా సంవత్సరం జూన్ 12వ తేదీన ప్రారంభం కానుండటంతో ఈ మధ్యకాలంలో ఉండే 47 రోజుల సమయాన్ని విద్యాబోధనలో మెలుకువలు నేర్చుకునేందుకు వినియోగించాలని ఉపాధ్యాయులను కోరారు. ప్రముఖ విద్యా నిపుణుడు డౌగ్ లెమోవ్ రాసిన "టీచ్ లైక్ ఏ ఛాంపియన్" అనే పుస్తకం (డౌన్ లోడ్ కోసం https://teachlikeachampion.org/resources/grab-and-go/)  ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు చదవితే ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన దాదాపు 49 బోధనా పద్ధతులు నేర్చుకునేందుకు అవకాశం కలుగుతుందన్నారు. తద్వారా ప్రభావవంతమైన ఉపాధ్యాయుడిగా తమను తాము మార్చుకొని విద్యార్థులకు మరింత గొప్పగా బోధన చేయవచ్చన్నారు. ఆ పుస్తకం చదువుతుంటే ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి  తాము బీఈడీ చదివే రోజుల్లో వచ్చిన ఆలోచనలు జ్ఞప్తికి వస్తాయన్నారు. పుస్తకంలో పొందుపరిచిన 1-10 స్కేల్ ద్వారా ఇప్పటికే ఉపాధ్యాయులు తాము బోధిస్తున్న పద్ధతులను తనిఖీ చేసుకోవడంతో పాటు టెక్నికల్ గా ఎంత ప్రభావవంతంగా బోధిస్తున్నామన్న విషయం నిర్ధారించుకొని స్వీయ విశ్లేషణ చేసుకోవచ్చన్నారు. అంతిమంగా మన విద్యార్థులకు ప్రపంచ స్థాయి బోధనతో పాటు బంగారు భవిష్యత్ అందించేందుకు ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు తమ అత్యుత్తమ బోధన ద్వారా  బాటలు వేస్తారని భావిస్తున్నానని ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు.  ఉపాధ్యాయులు తప్పనిసరిగా పుస్తకం చదవాలన్నది తన ఉద్దేశం కాదని, చదివితే అత్యుత్తమ ఉపాధ్యాయులుగా ఎదుగుతారని ఒక స్నేహితుడిగా, సహోద్యోగిగా ఇస్తున్న సలహాగా భావించాలని  ప్రవీణ్ ప్రకాష్ స్పష్టం చేశారు.


Comments