స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికల నిర్వహణే లక్ష్యం.

 *స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికల నిర్వహణే లక్ష్యం*


- 18న నామినేషన్లకు నోటిఫికేషన్‌

- పూర్తిస్థాయిలో ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం

- నెల్లూరులో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ పనితీరు బాగుంది

- పక్కాగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు

- రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా


నెల్లూరు, ఏప్రిల్‌ 11 (ప్రజా అమరావతి): రాష్ట్రంలో 2024 సార్వత్రిక ఎన్నికలను ఎటువంటి లోటుపాట్లు లేకుండా పారదర్శకంగా స్వేచ్ఛగా, నిర్భయంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా పేర్కొన్నారు. 

గురువారం నెల్లూరు మున్సిపల్‌ కార్యాలయంలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ హరినారాయణన్‌, ఎస్సీ కె ఆరీఫ్‌ హఫీజ్‌తో కలిసి సిఇవో ముఖేష్‌ కుమార్‌ మీనా పరిశీలించారు. ఈ సందర్భంగా సిఇవో ముఖేష్‌ కుమార్‌ మీనా మీడియాతో మాట్లాడుతూ ఈనెల 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు పూర్తిస్థాయిలో సన్నద్ధమైనట్లు చెప్పారు. మాడల్‌ కోడ ఆఫ్‌ కాండక్ట్‌, ఎక్స్‌పెండిచర్‌ మానిటరింగ్‌, ఫ్లయ్యింగ్‌ స్వ్కాడ్‌లు, విఎస్‌టిలు, ఎస్‌ఎస్‌టి బృందాలను ఏర్పాటు చేసి ఎన్నికల సంఘం నిబంధనలు పక్కాగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈనెల 18 తరువాత పూర్తిస్థాయిలో ఎన్నికల ప్రక్రియ మొదలవుతుందని ఈ సందర్భంగా మీనా చెప్పారు.  పైస్థాయి నుంచి కిందిస్థాయి అధికారుల వరకు సమన్వయంతో పనిచేసి ఎన్నికల ప్రక్రియను విజయంతం చేయాలని పిలుపునిచ్చారు. 


*కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ పనితీరు బాగుంది : సిఇవో*

.................... 

నెల్లూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ పనితీరు బాగుందని మీనా అన్నారు. కంట్రోల్‌ సెంటర్‌ను పరిశీలించిన సిఈవో పలు విభాగాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. సి విజిల్ ఫిర్యాదులు, సోషల్ మీడియా ఫిర్యాదులను ఎలా పరిష్కారం చేస్తున్నారు? కోడ్ ఉల్లంఘన పై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?  సిబ్బందికి శిక్షణ పూర్తి చేశారా? మొదలైన విషయాలను అడిగి తెలుసుకొని ఎలా పరిష్కరిస్తున్నారు అని ఆరా తీశారు.  ఎస్‌ఎంఎస్‌లు, వాట్సప్‌, సి విజిల్‌, 1950 కాల్‌సెంటర్లకు వస్తున్న ఫిర్యాదులపై సత్వరమే చర్యలు తీసుకుని పరిష్కరించడం పట్ల జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. ప్రతిరోజూ వస్తున్న ఫిర్యాదులపై సంబంధిత రిటర్నింగ్‌ అధికారులకు తెలియజేయడం, పరిష్కరించడం బాగుందన్నారు. నగదు, మద్యం, ఇతర సామగ్రి అక్రమ తరలింపులపై నిఘాపెట్టాలన్నారు. సీజర్ల సంఖ్య పెంచాలన్నారు. ఏ చిన్న సందేహాం వున్నా నివృత్తి చేసుకోవాలని, ఎన్నికల అధికారులు శిక్షణా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సిఇవో సూచించారు. 


*ఓటహక్కు వినియోగం అవగాహన మస్కట్ ను ఆవిష్కరించిన సిఈవో*

................ 

ఓటు హక్కు ఆవశ్యకత, వినియోగం తెలుపుతూ ప్రత్యేకంగా రూపొందించిన అవగాహన మస్కట్ ను సిఈవో ముఖేష్‌కుమార్‌ మీనా ఆవిష్కరించారు. ఓటుహక్కును వినియోగిద్దాం...ప్రజాస్వామ్యాన్ని గెలిపిద్దాం, మే 13న ఓటు హక్కు వినియోగించుకుందా వంటి నినాదాలతో రూపొందించిన మస్కట్ అందరి దృష్టిని ఆకర్షించింది. 


ఈ కార్యక్రమంలో  నెల్లూరు, కోవూరు, నెల్లూరు రూరల్‌ అసెంబ్లీ  నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులు వికాస్‌ మర్మత్‌, సేదు మాధవన్‌. మలోల,  ఎఎస్పీ సౌజన్య, నోడల్‌ అధికారులు శర్మద, ప్రసాదరావు,  సదారావు, బాపిరెడ్డి, సాలెం రాజు, చందర్, అనిత, పద్మాదేవి, పివిజె రామారావు, సురేష్‌కుమార్‌, శ్రీనివాసులు, వెంకట్రావు, పద్మావతి తదితరులు పాల్గొన్నారు. 


Comments