దేశంలోనే రికార్డు స్థాయిలో అత్యధికంగా 81.86 % పోలింగ్ నమోదు.

 *దేశంలోనే రికార్డు స్థాయిలో అత్యధికంగా 81.86 % పోలింగ్ నమోదు


*

*రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా*

                                                                                                                                                                                     అమరావతి మే 15 (ప్రజా అమరావతి): దేశంలో జరిగిన నాలుగు దశల సార్వత్రిక ఎన్నికల్లో రికార్డు స్థాయిలో అత్యధికంగా రాష్ట్రంలోనే  81.86 శాతం పోలింగ్ నమోదు అయిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఈ నెల 13 న రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఈవిఎం ల ద్వారా 80.66 శాతం ఓట్లు నమోదు కాగా, పోస్టల్ బ్యాలెట్ ద్వారా 1.2 శాతం ఓట్లు నమోదు అయినట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల చరిత్రలో  ఇంత భారీ స్థాయిలో ఓట్లు నమోదు కావడం  రికార్డు అన్నారు.  బుధవారం  వెలగపూడి  రాష్ట్ర సచివాలయంలోని ఎన్నికల మీడియా సెంటర్ లో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ నెల 13 న రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో పోల్ అయిన ఓట్ల వివరాలను తెలిపారు.  


రాష్ట్రంలో ఈ నెల 13 న జరిగిన పోలింగ్ తో సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన ఘట్టం ముగిసిందన్నారు.  ఈ ఎన్నికల్లో  ఈవిఎం ద్వారా 80.66 శాతం పోలింగ్ నమోదు కాగా, ఉద్యోగులు, అత్యవసర సర్వీసు ఓటర్లు, 85+ వృద్దులు, దివ్యాంగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా 1.2 శాతం  పోలింగ్ సమోదు అయిందన్నారు.  ముందుగా తాము ఊహించినట్లుగానే ఈ రెండు కలుపుకుని అత్యధిక మొత్తంలో 81.86 శాతం ఓట్లు ఈ  సార్వత్రిక ఎన్నికల్లో నమోదు అయినట్లు ఆయన తెలిపారు.  ఈ ఎన్నికల్లో ఈవిఎం ల ద్వారా అత్యధిక మొత్తంలో 80.66 శాతం పోలింగ్ నమోదు కాదా, 2014  ఎన్నికల్లో 78.41 శాతం, 2019 ఎన్నికల్లో 79.77 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఆయన తెలిపారు.  తమ సహోద్యోగులు, జిల్లా ఎన్నికల అధికారు కృషి వల్లే ఈ సారి ఇంత  భారీ స్థాయిలో ఓటింగ్ శాతం నమోదు అయ్యేందుకు కారణం అంటూ వారిని అభినందించారు. 


రాష్ట్రంలో మొత్తం 4,13,33,702 మంది ఓటర్లు ఉన్నారని, వారిలో 3,33,40,560 మంది ఓటర్లు పార్లమెంటరీ ఎన్నికల్లోను, 3,33,40,333 మంది అసెంబ్లీ ఎన్నికల్లోనూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు.  ఈవిఎం ల ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్న వారిలో పురుషులు  1,64,30,359 మంది, మహిళలు 1,69,08,684 మంది మరియు ఇతరులు 1,517 మంది ఓటర్లు ఉన్నట్లు ఆయన తెలిపారు.  పార్లమెంటరీ నియోజక వర్గాలకు సంబందించి ఒంగోలులో  అత్యధికంగా 87.06 శాతం పోలింగ్ నమోదు కాగా, అత్యల్పంగా విశాఖపట్నంలో 71.11 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఆయన తెలిపారు. అదే విధంగా శాసన సభా నియోజక వర్గాలకు సంబందించి అత్యధికంగా  దర్శి నియోజక వర్గంలో 90.91 శాతం పోలింగ్ నమోదు కాగా, అత్యల్పంగా తిరుపతి నియోజక వర్గంలో 63.32 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఆయన తెలిపారు.  గత ఎన్నికల్లో తిరుపతి నియోజక వర్గంలో 65.9 శాతం పోలింగ్ నమోదు కాగా ఈ సారి 63.32 శాతానికి తగ్గడానికి ఆ నియోజక వర్గంలో బోగస్ ఓట్లను నియంత్రిచడమే ప్రధాన కారణమని ఆయన తెలిపారు.  విశాఖపట్నం పార్లమెంటరీ నియోజక వర్గానికి సంబందించి  గత ఎన్నికల్లో 67 శాతం పోలింగ్ నమోదు కాగా, ఈ సారి  ప్రత్యేకించి విశాఖ పట్టణ ప్రాంతంలో 71.11 శాతం పోలింగ్ నమోదు అవ్వడం ఎంతో శుభపరిణామం అన్నారు. 


ఇక పోస్టల్ బ్యాలెట్ విషయానికి వస్తే అన్ని రకాల కేటగిరీలు కలుపుకుని మొత్తం 4.97 లక్షల మంది ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు.  వీరిలో ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు 4.44 లక్షల పోస్టల్ బ్యాలెట్ లను, 85+ వృద్దులు 13,700, దివ్యాంగులు 12,700 మరియు అత్యవసర సర్వీసు ఓటర్లు 27,100 పోస్టల్ బ్యాలెట్లను వినియోగించుకోవడం జరిగిందని ఆయన తెలిపారు.  మొత్తం మీద పోస్టల్ బ్యాలెట్ ద్వారా 1.2 శాతం  పోలింగ్ సమోదు అయినట్లు ఆయన తెలిపారు.  2019 ఎన్నికల్లో 2.62 లక్షల పోస్టల్ బ్యాలెట్లను వినియోగించుకోగా ఈ సారి 4.97 లక్షల పోస్టల్ బ్యాలెట్లను వినియోగించుకోవడం జరిగిందన్నారు. గత ఎన్నికల్లో 56 వేల పోస్టల్ బ్యాలెట్లను తిరస్కరించడం జరిగిందని,  అయితే ఉద్యోగులు ఎంతో జాగ్రత్తగా ఉన్నందున ఈ సారి అటు వంటి పరిస్థితి తలెత్తలేదన్నారు. 


*పోలింగ్ శాతం ప్రకటన ఆలస్యానికి కారణం….*

                                                                                                                                                                                           దేశ, విదేశాల నుండి ఓటర్లు పెద్ద ఎత్తుకు ఓటింగ్ కు తరలి రావడం మరియు చివరి రెండు గంటల ముందు క్యూలైన్లో ఓటర్లు ఎక్కువగా ఉండటం వల్ల నిర్ణీత సమయానికి మించి అర్థరాత్రి వరకూ ఓటింగ్ ప్రక్రియ కొనసాగిందన్నారు. దీనికితోడు 5,600 పోలింగ్ స్టేషన్లలో 1,200 కు పైబడి ఓటర్లు ఉండటం కూడా ఓటింగ్ ప్రక్రియ ఆలస్యానికి కారణమైందన్నారు.  దాదాపు 3,500 పోలింగ్ స్టేషన్లలో నిర్ణీత సమయమైన సాయంత్రం 6.00 గంటలకు మించి పోలింగ్ కొనసాగిందని, చివరి పోలింగ్ స్టేషన్ లో తదుపరి రోజు తెల్లవారు జామున 2.00 గంటలకు పోలింగ్ ముగిసిందన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తదుపరి  ఎలక్షన్ టీమ్ లు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కు మరియు స్ట్రాంగ్ రూమ్ల వద్ద కు వచ్చే సమయంలో  శ్రీకాకుళం, కోనసీమ, ఉదయగిరి తదితర ప్రాంతాల్లో వాతావరణం సహకరించపోవడం కూడా  ఆలస్యానికి కొంత కారణం అయిందన్నారు.  ఎన్నికలు ముగిసిన తదుపరి రోజు సంబందిత ఆర్.ఓ., పరిశీలకులు అభ్యర్థులతో సమావేశం నిర్వహించి రీపోలింగ్ కు ఏమన్నా అవసరం ఉందా? లేదా? అనే విషయాన్ని సమీక్షిస్తారన్నారు.   ఈ సమీక్షలు అనంతరం ఏ ఒక్క పరిశీలకుడు రీపోలింగ్ ను సిఫార్సు చేయకపోవడం వల్ల  25 పీసీలు, 175 ఏసీల్లో పోల్డు అయిన ఈవీఎం లను అన్నింటినీ మంగళవారం రాత్రి 33 ప్రాంతాల్లో నున్న 350 స్ట్రాంగ్ రూమ్ లలో  త్రీ టైర్ భద్రత నడుమ సురక్షితంగా భద్రపర్చడం జరిగిందన్నారు.  ఈ ప్రక్రియ అంతా ముగిసిన తదుపరే అసలైన పోలింగ్ శాతాన్ని ఖరారు చేయడం జరుగుతుందన్నారు.  అందువల్లే పోలింగ్ శాతాన్ని ప్రకటించడంలో కొంత ఆసల్యం జరిగిందన్నారు. 



*హింసాత్మక ఘటనలకు తీవ్రంగా స్పందించిన ఈసీ….*


ఇక హింసాత్మక ఘటనలకు సంబందించి ఆయన మాట్లాడుతూ  పోల్ రోజు కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు జరినప్పటికీ ఎన్నికల, పోలీస్  యంత్రాంగం వెంటనే స్పందించి తక్షణ చర్యలు తీసుకోవడం వల్ల ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయన్నారు. ఎన్నికల  రోజు తొమ్మి ప్రాంతాల్లో ఈవిఎం లను ద్వంసం చేయడం జరిగిందని, సిసి ఫుటేజీ ఆధారంగా అందుకు బాద్యులైన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అయితే ఎన్నికల  తదుపరి ప్రత్యేకించి తాడిపత్రి, మాచర్ల, చంద్రగిరి, నర్సరావుపేట ప్రాంతాల్లో పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయన్నారు. ఇటు వంటి హింసాత్మకమైన ఘటనలను ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణిస్తూ వెంటనే డి.జి.పి.తో చర్చలు జరపడం జరిగిందని, పోలీస్ యంత్రాంగం నిన్నటి నుండి ప్రత్యేకమైన చర్యలు చేపట్టిందని, అయా ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నదని ఆయన తెలిపారు.  ఈ నాలుగు ప్రాంతాలకు సీనియర్ అధికారులతో పాటు అదనపు పోలీస్ బలగాలను పంపడం జరిగిందన్నారు.  సానికంగా జనసంచారాన్ని నియంత్రించడమే కాకుండా సంబందిత పార్టీల అభ్యర్థులను గృహ నిర్బందం చేయడం జరిగిందన్నారు.  తదుపరి విచారణ జరిపి పోలిస్ కేసులను కూడా పెట్టడం జరుగుతుందన్నారు. అదే విధంగా 715 ప్రాంతాల్లో పోలీస్ పికెట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో పరిస్థితి పూర్తి స్థాయిలో నియంత్రణలో ఉందని ఆయన తెలిపారు. 


ఎన్నికల రోజు నాంధేడ్ – విశాఖపట్నం  రైలు ఆలస్యంగా నడవడం వల్ల అందులో ప్రయాణించే ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు.  అటు వంటి పరిస్థితిలో తమ సూచనల మేరకు అదనపు  సీఈఓ  పి.కోటేశ్వరరావు ఎంతో చాకచక్యాన్ని ప్రదర్శిస్తూ విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం డి.ఆర్.ఎం.లతో మాట్లాడి ఆ ట్రైన్ గ్రీన్ చానల్ లో వేగంగా గమ్యాన్ని చేరుకునేలా చేశారని అభినందించారు. అదే విధంగా మహరాష్ట్రలో ఎన్నికల విధులకు వెళ్లిన వారికి  ప్రత్యేక సి.ఎల్. మంజూరు చేయడమే కాకుండా ,వారు నేరుగా ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. 


అదనపు ప్రధాన ఎన్నికల అధికారులు పి.కోటేశ్వరరావు, ఎం.ఎన్. హరేంధర ప్రసాద్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. 



Comments