ఈ విద్యా సంవత్సరం నుండే రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఫ్యూచర్ స్కిల్స్ ఎక్స్ పర్ట్స్.



విజయవాడ (ప్రజా అమరావతి);


*ఈ విద్యా సంవత్సరం నుండే రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఫ్యూచర్ స్కిల్స్ ఎక్స్ పర్ట్స్*


*రాష్ట్రంలోని 7,094 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు 2,379 మంది ఫ్యూచర్ స్కిల్స్ ఎక్స్ పర్ట్స్*


*డిజిటల్ బోధన, మెరుగైన అభ్యసనం, విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించడంలో శిక్షణ అందించనున్న ఫ్యూచర్ స్కిల్స్ ఎక్స్ పర్ట్స్*    


*ప్రతి 3 పాఠశాలలకు ఒక ఫ్యూచర్ స్కిల్స్ ఎక్స్ పర్ట్ ఎంపిక, జూన్ 12వ తేదీ నుండి విధులు అప్పగింత* 


*ఫ్యూచర్ స్కిల్స్ ఎక్స్ పర్ట్స్ గా ఇంజినీరింగ్ 4వ విద్యా సంవత్సరం అభ్యసిస్తున్న విద్యార్థులు*


:- *పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్*


భవిష్యత్ లో అవకాశాలు, సాంకేతికతను అందిపుచ్చుకునే అంశంలో మన విద్యార్థులు ప్రపంచంతో పోటీపడేందుకు వీలుగా రాష్ట్రంలోని 7,094 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో జూన్ 12వ తేదీ నాటికి 2,379 మంది ఫ్యూచర్ స్కిల్స్ ఎక్స్ పర్ట్స్ ను ఎంపిక చేసి విధులు కేటాయిస్తామని పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ బోధన, అభ్యసనాన్ని మెరుగుపరిచేందుకు వీలుగా ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థులను ఫ్యూచర్ స్కిల్స్ ఎక్స్ పర్ట్స్ ను ఎంపిక చేయనున్నామన్నారు. ఫ్యూచర్ స్కిల్స్ ఎక్స్ పర్ట్స్ ఎంపిక విషయమై సంబంధిత కళాశాల ప్రిన్సిపల్స్ తో సంప్రదింపులు జరపాలని ఆర్జేడీలు, డీఈవోలకు సూచించారు. 


ఫ్యూచర్ స్కిల్స్ ఎక్స్ పర్ట్స్ విధుల నిర్వహణకు సంబంధించి ఇంజినీరింగ్ కాలేజీలు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల మధ్య మ్యాపింగ్ పూర్తయిందని, సంబంధిత జీవో ఇప్పటికే జారీ చేశామని ప్రవీణ్ ప్రకాష్ గుర్తుచేశారు. విద్యార్థుల్లో భవిష్యత్ తరాలకు అవసరమైన విద్యా నైపుణ్యాలను పెంపొందించేందుకు ఈ విద్యా సంవత్సరం (2024-25) నుండే మూడు పాఠశాలలకు ఒక ఎక్స్ పర్ట్ చొప్పున నియమించి అవసరమైన మార్గదర్శకత్వం అందించనున్నామన్నారు. 


 ఫ్యూచర్ స్కిల్స్ ఎక్స్ పర్ట్స్ పనితీరు, ఎంపికకు సంబంధించి ఆయా విద్యార్థుల నుండి డీఈవోలకు అందిన నివేదికలను 21 మే, 2024 నాటికి సమీక్షించి రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ఉత్తమమైన ముగ్గురిని ఎంపిక చేయాలన్నారు. వీరిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారి సమాచారాన్ని 2024 మే 22వ తేదీ నాటికి మిషన్ డైరెక్టర్ కు పంపించాలని డీఈవోలను ఆదేశించారు. అనంతరం 2024 మే 27న ప్రతి జిల్లా నుండి ఒకరి చొప్పున రాష్ట్ర ఎంపిక కమిటీ ఎంపిక చేసిన 26 మంది ఫ్యూచర్  స్కిల్స్ ఎక్స్ పర్ట్స్ తో వర్చువల్ గా మాట్లాడతానన్నారు. అదే విధంగా 2024 మే 31వ తేదీ నాటికి ఇంజినీరింగ్ కళాశాలల ప్రిన్సిపల్స్ తో సమన్వయం చేసుకోవాలని ఆర్జేడీలకు, డీఈవోలకు సూచించారు. 


8వ తరగతి విద్యార్థులకు బోధించేందుకు ఎంపికైన ఫ్యూచర్ స్కిల్స్ ఎక్స్ పర్ట్స్  కు మూడేళ్ల ఇంజినీరింగ్ కోర్సుకు సంబంధించిన ప్రాథమిక భావనలతో కూడిన ఫ్యూచర్ స్కిల్స్ పాఠ్య పుస్తకాన్ని ఈ-బుక్ ఫార్మాట్ లో అందించాలన్నారు. తద్వారా వారిని అంచనా వేసేందుకు వీలు కలుగుతుందని, జూన్ 10వ తేదీన ఫ్యూచర్ స్కిల్స్ ఎక్స్ పర్ట్స్ కు ఆన్ లైన్ పరీక్షను నిర్వహించనున్నామని తెలపాలని సూచించారు. ఫ్యూచర్ స్కిల్స్ ఎక్స్ పర్ట్స్ ఎంపిక విషయంలో ప్రతిరోజు వారి పురోగతిని పరిశీలించి సమీక్షించాలని కోరారు. 12 జూన్, 2024న రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ప్రతి మూడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఒక ఫ్యూచర్ స్కిల్స్ ఎక్స్ పర్ట్ ను నియమించాలని ఆర్జేడీలు, డీఈవోలకు పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సూచించారు.


Comments