*వికసిత్ భారత్ మోదీ కల, వికసిత్ ఎపి చంద్రబాబు, పవన్ లక్ష్యం!*
*ధ్వంసమైన రాష్ట్రాన్ని నమో సహకారంతో ముందుకు తీసుకెళ్తాం*
*రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి సహాయ, సహకారాలు అందించండి
*
*5 ట్రిలియన్ ఎకానమీలో మేము కూడా భాగస్వాములం అవుతాం*
*వేమగిరి ఎన్నికల ప్రచారసభలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్*
*మోడీకి వెంకన్న విగ్రహం బహుకరించి మంగళగిరి కండువాకప్పిన లోకేష్*
రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి): వికసిత్ భారత్ మోదీ గారి కల ... వికసిత్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లక్ష్యమని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. రాజమండ్రి సమీపంలోని వేమగిరిలో ప్రధాని మోడీతో కలిసి ఆయన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీకి వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని బహుకరించి మండగళగిరి కండువాతో సత్కరించారు. అనంతరం లోకేష్ మాట్లాడుతూ... ఈ వేదికపై విశ్వజిత్ నరేంద్ర మోడీజీ ఉన్నారు. విశ్వజిత్ అంటే విశ్వాన్ని జయించిన వారని అర్థం. నరేంద్రమోడీ గారి గొప్పతనం వల్ల ఈ రోజు ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తోంది. రాజమహేంద్రవరం పేరులోనే రాజసం ఉంది. గోదావరి జిల్లాల ప్రజలకు మంచి మనస్సు ఉంటుంది. మీ మమకారం, వెటకారం రెండూ సూపర్, నరేంద్ర మోదీ గారు మన ఆత్రేయపురం పూతరేకులు, తాపేశ్వరం ఖాజా రుచిచూడాలని కోరుతున్నా. మా స్వీట్లు కేవలం భారత్ లోనే కాదు, ప్రపంచదేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి. 2014 లో రాష్ట్ర విభజన తర్వాత కట్టుబట్టలతో మనల్ని బయటకి గెంటేశారు. కుర్చీ ఎక్కడుందో, టేబుల్ ఎక్కడుందో వెదుక్కోవడానికే 6 నెలలు పట్టింది. చంద్రబాబు గారి అనుభవంతో పరిస్థితులను చక్కదిద్దారు. అమరావతి నిర్మాణం ప్రారంభించారు. పోలవరం జెట్ స్పీడ్ తో 72 శాతం పూర్తి చేసారు. మోదీ గారి సహకారంతో అనేక జాతీయ సంస్థలను రాష్ట్రానికి తీసుకొచ్చారు. ఒకే రాజధాని - అభివృద్ధి వికేంద్రీకరణ అనే నినాదంతో అన్ని జిల్లాలను అభివృద్ధి చేసాం. విశాఖపట్నాన్ని ఐటీ హబ్ గా, రాయలసీమ ను ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ హబ్ గా, గోదావరి జిల్లాలను ఆక్వా హబ్ గా... ఇలా ప్రతి జిల్లా కు ఒక ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధి చేసాం. అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు. కియా, ఫ్యాక్స్ కాన్, టిసిఎల్, హెచ్ సి ఎల్, హీరో, అశోక్ లేల్యాండ్ లాంటి ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చింది మన బ్రాండ్ సిబిఎన్. ఆయన ప్రతి రోజు మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు..మీ పిల్లలకు ఉద్యోగాలు కల్పిస్తే మీ కుటుంబం పరిస్థితులు మారతాయని బలంగా నమ్ముతారు.
*ఒక్కఛాన్స్ మాయలో మోసపోయిన ప్రజలు*
2019 ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ మాయలో పడి ప్రజలు మోసపోయారు. ప్రపంచంలో ఉన్న అనేక దేశాలు మోదీ గారిని, ఇండియాని ఆదర్శంగా తీసుకుంటే, మన తుగ్లక్ ఆఫ్రికా ని ఆదర్శంగా తీసుకున్నారు. తాను కూర్చున్న కొమ్మనే తాను నరుకున్నాడు. మూడు రాజధానులు అని అమరావతి ని చంపేసారు. జగన్ పాలనలో మొదటి బాధితులు యువతే. ఒక్క కంపెనీ తీసుకురాకపోగా ఉన్న కంపెనీలను బెదిరించి తరిమేశారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకి కేంద్రం ఓకే అన్నా రాష్ట్రం భూమి కేటాయించలేదు, మంగళగిరిలో ఉన్న ఎయిమ్స్ కి కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదు. ఎన్నికల ముందు మాట తప్పను ... మడమ తిప్పను అన్నాడు. ఇప్పుడు మోసానికి ప్యాంటు , షర్ట్ వేస్తే అచ్చం జగన్ లా ఉంటుంది. ప్రజల్ని, రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ప్రజాగళం ఏర్పడింది. పొత్తు కోసం త్యాగం చేసి మొదటి అడుగు వేసింది మన పవర్ స్టార్ పవనన్న. ప్రశ్నించే గొంతుక పవనన్న... ప్రజల తరపున పోరాడేది పవన్ అన్న. రాష్ట్రాన్ని రాబోయేరోజుల్లో మీ సహకారంతో సంక్షేమం - అభివృద్ధిని జోడెద్దుల బండిలా ముందుకు తీసుకువెళతాం.
*మోడీ అంటే పవర్ ఆఫ్ ఇండియా*
తెలుగు జాతి పౌరుషాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారు, భారత దేశం పౌరుషాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది శ్రీ నరేంద్రమోడీ గారు.విశ్వజిత్ నరేంద్రమోడీ గారి వల్ల ఈనాడు ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోంది. దేశానికి నరేంద్ర మోదీ గారి అవసరం ఎందుకో ప్రజలంతా తెలుసుకోవాలి. నమో (నరేంద్రమోడీ) అనే అక్షరాలు ఈరోజు భారతదేశం దశదిశ మార్చేశాయి. మోదీ అంటే పవర్ ఆఫ్ ఇండియా. మోదీ అంటే ప్రైడ్ ఆఫ్ ఇండియా. మోదీ అంటే ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడ్రన్ ఇండియా. మోదీ గారు ఒక సామాన్య కుటుంబం నుండి ఎదిగిన వ్యక్తి అందుకే సామాన్యుడు పడే కష్టం ఆయనకు తెలుసు. మన దేశానికీ ఏం కావాలో మోదీ గారికి తెలుసు ... పేదరికం లేని భారతదేశం మోదీ గారి కల. ఒక మనిషికి కేవలం చేపలు ఇస్తే అతనికి ఒక రోజు ఆహారం లభిస్తుంది. చేపలు పట్టడం నేర్పిస్తే జీవితకాలం అతడికి ఆహారం దొరుకుతుంది. మొదటిరోజు నుంచే మోడీజీ ఈ లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తూనే, మరో పక్క పేదరిక నిర్మూలనకు అనేక కార్యక్రమాలు చేపట్టారు. సంక్షేమం, అభివృద్ధిని బ్యాలెన్స్ చేసి దేశాన్ని ఒక బలమైన శక్తిగా నిలబెట్టారు. ప్రధాన మంత్రి అన్న యోజన, ఆవాస్ యోజన, ఉజ్వల్ యోజన, కిసాన్ సమ్మాన్ నిధి, పిఎం ఆయుష్మాన్ భారత్, జల్ జీవన్ మిషన్ వంటి పథకాలతో సంక్షేమానికే కొత్త నిర్వచనం చెప్పారు. సంక్షేమ పథకాలను అందిస్తూనే.....దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా మార్చడానికి మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా, గతి శక్తి, భారత్ మాల వంటి అభివృద్ది కార్యక్రమాలు తెచ్చి సంపద సృష్టించారు. ఈరోజు సౌత్ , నార్త్ , ఈస్ట్ , వెస్ట్ అందరి నోటా ఒకటే మాట... నమో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్.
*రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధికి సహకరించండి*
ఈరోజు రాష్ట్రం ఎదుర్కొంటున్న కొన్ని కీలక సమస్యలను మోడీజీ దృష్టికి తీసుకువస్తున్నాను. 1. నిరుద్యోగం (నా పాదయాత్రలో ఎంతోమంది ప్రజలు తమ బిడ్డలకు ఉద్యోగాలు కల్పించాలని కోరారు). రాబోయే అయిదేళ్లలో మేము 20 లక్షల ఉద్యోగ కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందుకు మీవంతు సహకారం కావాలి. 2. గంజాయి - డ్రగ్స్ ( ప్రస్తుత పాలక పక్షం మన రాష్ట్రాన్ని గంజాయి రాజధానిగా చేసింది) గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ కు మీ సహకారం అందించాలి. 3. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం పూర్తికి సహకారం అందించండి. 4. కేంద్రం నుండి వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు కేటాయించండి. 5. దేశాన్ని 5 ట్రిలియన్ ఎకానమీగా తయారుచేయాలన్న మీ సంకల్పంలో మేము భాగస్వాములమవుతాం. 6. రాష్ట్రాలుగా పోటీపడి దేశాన్ని బలోపేతం చేయాలన్న మీ మాటలు నాకు స్పూర్తి. 7. ఇతర రాష్ట్రాలతో పోటీపడి అభివృద్ధి సాధించేందుకు మీవంతు సహాయ,సహకారాలు అందించండి. 8. ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్... అబ్కీ బార్ 400 పార్. 400 సీట్లు అధిగమించాలన్న మీ లక్ష్యసాధనలో ఎపి ప్రజలు భాగస్వామలవుతారు. రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధికి మీ వంతు సహాయ, సహకారాలు అందించాలని లోకేష్ విజ్ఞప్తిచేశారు.
addComments
Post a Comment