పూర్వ విద్యార్థులతో ప్రత్యక్ష సంభాషణ కార్యక్రమం.



విజయవాడ (ప్రజా అమరావతి);



*ప్రస్తుత విద్యార్థులకు స్ఫూర్తినిచ్చేలా, వారిని మరింత ప్రోత్సహించే లక్ష్యంతో జూన్ 15వ తేదీన పూర్వ విద్యార్థులతో ప్రత్యక్ష సంభాషణ కార్యక్రమం*


*“జడ్.పి. ఉన్నత పాఠశాల నుండి జాతీయ పోలీసు అకాడమీ వరకు తన ప్రయాణం” పై విద్యార్థులతో మాట్లాడనున్న మహిళా ఐ.పి.ఎస్ అధికారిణి శ్రీమతి శాలి గౌతమి*


*యూట్యూబ్ ఛానెల్, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ ల ద్వారా పరస్పర చర్చా కార్యక్రమం*


*ఈ కార్యక్రమానికి నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనున్న రాష్ట్ర విద్యా నిర్వహణ, శిక్షణ సంస్థ (SEIMAT)* 


*పూర్వ విద్యార్థులతో పరస్పర చర్యలు విద్యార్థుల జీవితాలపై విద్యాపరమైన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉందని పలు పరిశోధనలు వెల్లడి*


:- *పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్*


పూర్వ విద్యార్థులతో ప్రస్తుత విద్యార్థులకు ప్రత్యక్ష సంభాషణ కార్యక్రమం నిర్వహించడం ద్వారా అనేక విద్యాపరమైన ప్రయోజనాలున్నాయని పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ బుధవారం ఒక ప్రకటనలో అన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత విద్యార్థులకు స్ఫూర్తినిచ్చేలా, వారిని మరింత ప్రోత్సహించే లక్ష్యంతో జూన్ 15వ తేదీ, శనివారం మధ్యాహ్నం 3 గంటలకు పూర్వ విద్యార్థులతో ప్రత్యక్ష సంభాషణ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించామని వెల్లడించారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వహణపై జిల్లా విద్యా శాఖాధికారులు, జిల్లా వృత్తి విద్యా శిక్షణాధికారులకు పలు సూచనలు చేశారు. 


జడ్.పి. ఉన్నత పాఠశాల నుండి జాతీయ పోలీసు అకాడమీ వరకు తన ప్రయాణం, ఎదిగిన విధానం, ఎదుర్కొన్న పరిస్థితులు, తలెత్తిన సవాళ్లు, విజయాలపై 2015 బ్యాచ్ కు చెందిన మహిళా ఐ.పి.ఎస్ అధికారిణి, ప్రస్తుతం విశాఖపట్టణం, 16వ బెటాలియన్ కు చెందిన కమాండెంట్ శ్రీమతి శాలి గౌతమి ప్రసంగిస్తారని, అనంతరం విద్యార్థులతో యూట్యూబ్ ఛానెల్, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ ల ద్వారా మాట్లాడనున్నారని ప్రవీణ్ ప్రకాష్ వెల్లడించారు. గౌతమి తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం పెద్దకన్నలి గ్రామంలోని జిల్లా పరిషత్ స్కూల్ లో 10వ తరగతి పూర్తి చేసుకుందని తెలిపారు. 6-10వ తరగతి చదువుతున్న విద్యార్థులు తరగతి గదుల్లోని ఐఎఫ్ పీల ద్వారా కార్యక్రమాన్ని చూడటంతో పాటు ప్రసంగాన్ని విన్న తర్వాత  ఉపాధ్యాయుల సహాయంతో వాట్సాప్ ద్వారా ప్రశ్నలు పంపిస్తే ప్రత్యక్షంగా గౌతమి వారి ప్రశ్నలకు సమాధానాలు అందిస్తుందన్నారు. ప్రస్తుత విద్యార్థులకు గొప్ప రోల్ మోడల్‌లు గా, తమ భావి జీవితానికి పూర్వ విద్యార్థుల అనుభవం ఒక పాఠంగా ఉపయోగపడుతుందని తాము భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం అనంతరం వచ్చే అభిప్రాయం ఆధారంగా భవిష్యత్ లో ఈ తరహా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ నేపథ్యంలో కార్యక్రమానికి అవసరమైన ఇంటర్నెట్, ఐఎఫ్ పీలను సంసిద్ధంగా ఉంచుకునేలా కళాశాల ప్రిన్సిపల్స్ కు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సూచించాలని జిల్లా విద్యా అధికారులు, జిల్లా వృత్తి విద్యా శిక్షణాధికారులకు తెలిపారు. రెసిడెన్షియల్ విద్యా సంస్థల విద్యార్థులు సైతం కార్యక్రమంలో పాల్గొనేలా సమాచారం చేరవేయాలని జిల్లా విద్యా అధికారులకు సూచించారు. రాష్ట్ర విద్యా నిర్వహణ, శిక్షణ సంస్థ (SEIMAT) ను ఈ కార్యక్రమానికి నోడల్ ఏజెన్సీగా నియమించడం జరిగిందని, వారు తమ యూట్యూబ్ ఛానల్ లో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తారన్నారు. 


వెస్టర్న్ కెంటక్కి విశ్వవిద్యాలయానికి చెందిన ఆరన్ డబ్ల్యూ. హగ్హే "విద్యార్థి జీవితంలో పూర్వ విద్యార్థుల సంఘం యొక్క పాత్ర" అనే అంశంపై నిర్వహించిన పరిశోధనలో  విద్యార్థులు తమ సంస్థ యొక్క పూర్వ విద్యార్థులతో సంభాషించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని తేలిందని ప్రవీణ ప్రకాష్ గుర్తుచేశారు. అదే విధంగా 2018-19లో కాలిఫోర్నియా శాన్ డియాగోలో ఉన్న సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఎడ్యుకేషనల్ ఈక్విటీ, అసెస్ మెంట్ అండ్ ట్రైనింగ్ ఎక్స్ లెన్స్ (CREATE) నిర్వహించిన మరొక అధ్యయనం ప్రకారం  పూర్వ విద్యార్థులతో పరస్పర చర్యలు విద్యార్థుల జీవితాలపై విద్యాపరమైన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉందని నిర్ధారించిందని వివరించారు.  

Comments