*జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కోసం విస్త్రృత ఏర్పాట్లు....*
*16.37 లక్షల మంది ఓటుహక్కు వినియోగించుకునేందుకు 1744 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు...*
*ఏలూరు నియోజకవర్గ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్...*
ఏలూరు,మే, 12 (ప్రజా అమరావతి)... జిల్లాలో సాధారణ ఎన్నికలకు సంబంధించి ఈనెల 13వ తేదీన జరిగే పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వె. ప్రసన్న వెంకటేష్ చెప్పారు. ఆదివారం ఏలూరు కోటదిబ్బలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ పరిశీలించారు.
ఈ సందర్బంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 1744 పోలింగ్ కేంద్రాల్లో ఈనెల 13వ తేది సోమవారం ఉదయం 7.00 గంటల నుంచి పోలింగ్ జరుగుతుందన్నారు. జిల్లాలో అన్ని నియోజకవర్గాలను 193 సెక్టార్లుగా విభజించి ఆయా పోలింగ్ కేంద్రాలకు ఈవిఎం, వివిప్యాట్ లతోపాటు న్యాయబద్దమైన పత్రాలు, ఇతర ఎన్నికల సామాగ్రిని ఆయా నియోజకవర్గాల ప్రధాన మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల ద్వారా పంపిణీ చేసే ప్రక్రియ ఆదివారం ఉదయం ప్రారంభమయిందన్నారు. ఎన్నికల విధుల నిర్వహణకు 16 వేల మంది సిబ్బందితోపాటు 4 వేల మంది పోలీస్ సిబ్బందితో కలిపి 20 వేల మంది సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు. 7 నియోజకవర్గాలకు సంబంధించి ఆయా ఎన్నికల సిబ్బంది డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు చేరేందుకు ఆర్ టి సి బస్సు సౌకర్యాలను కూడా కల్పించిందన్నారు. ఎన్నికల సామాగ్రి తీసుకున్న పిదప వాటిని పరిశీలించుకుని ఆయా పోలింగ్ కేంద్రాలకు సంబంధిత సిబ్బంది వారికి కేటాయించిన వాహనాల్లో వెళ్లడం జరుగుతుందన్నారు. సాయంత్రానికి పోలింగ్ కేంద్రానికి సంబంధిత టీమ్ చేరుకుని పోలింగ్ కేంద్రంలో ఏర్పాట్లను చేసుకోవడం జరుగుతుందన్నారు. అందుకు సంబంధించిన లేఅవుట్ ను కూడా వారికి అందించడం జరిగిందన్నారు. ఈనెల 13వ తేదీ సోమవారం ఉదయం 5.30 గంటలకు మాక్ పోల్ నిర్వహించడం జరుగుతుందని అనంతరం ఉదయం 7.00 గంటల నుండి పోలింగ్ ప్రారంభమౌతుందన్నారు. ఈవిఎం ల్లో ఏవైనా సాంకేతిక లోపాలు తలెత్తితే వెంటనే పరిష్కరించేందుకు సెక్టార్ ఆపీసర్ల వద్ద ఒకటి నుంచి రెండు ఈవిఎంలు అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. మాక్ పోల్ జరిగే సమయంలోకూడా ఇటువంటి సమస్య వస్తే వెంటనే వాటి స్ధానంలో మరో ఈవిఎం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. పోలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ స్టేషన్లు దూరంగా ఉండటం మూలంగా అక్కడ సెక్టార్ ఆఫీసర్ల వద్ద రెండు స్పేర్ ఈవిఎంలను అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. ఎక్కడైనా ఈవిఎం సాంకేతిక సమస్య తలెత్తితే 15 నుండి 20 నిషాలలోపు వాటి స్ధానంలో ఏదో ఒకటి ఉంచడం జరుగుతుందన్నారు. సాంకేతిక సమస్యల పరిష్కారానికి ప్రతి నియోజకవర్గానికి ముగ్గురు చొప్పున బెల్ అధికారులు అందుబాటులో ఉంటారన్నారు. ఐటిడిఏ పరిధిలో ఫోన్ సౌకర్యం లేని 13 పోలింగ్ కేంద్రాల్లో విహెచ్ఎఫ్ సెట్లను ఏర్పాటు చేయడంతోపాటు మైక్రో అబ్జర్వర్, వీడియోగ్రఫీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో 415 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, లైవ్ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయడమైనదన్నారు. పోలవరం నియోజకవర్గంలో కుక్కునూరు మండలం కాకీస్నూర్ గ్రామానికి గోదావరి నది దాటి వెళ్లవలసివున్నందున ఎన్నికల సిబ్బందికి బోటు సౌకర్యం కల్పించామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద షామియానాలు, త్రాగునీరు సౌకర్యంతోపాటు హెల్త్ క్యాంపు కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. అదే విధంగా విభిన్న ప్రతిబావంతులు ఓటుహక్కు వినియోగించుకునేందుకు 1100 వీల్ చైర్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.జిల్లాలో 1744 పోలింగ్ కేంద్రాల్లో 1069 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియ పరిశీలనకు లైవ్ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామన్నారు.జిల్లాలో ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ పంపిణీ చేశామని, అయితే ఇంకా ఎవరైన మిస్ అయితే సంబంధిత బి ఎల్ వో వద్ద పొందవచ్చునన్నారు.జిల్లాలో 15 వేల 615 మంది సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించు కున్నారన్నారు. హోమ్ ఓటింగ్ ద్వారా 896 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారన్నారు.పోలింగ్ సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు 150 ఆర్టీసీ,350 ప్రైవేటు వాహనాలు ఏర్పాటుచేశమన్నారు.జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7 మహిళా పోలింగ్ కేంద్రాలు,పోలవరం,చింతలపూడి నియోజక వర్గాల్లో యువత కోసం రెండు ప్రత్యేక కేంద్రాలు,విభిన్న ప్రతిభ వంతులకు ఏలూరు,దెందులూరు నియోజక వర్గాల్లో రెండు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.
*ప్రతిఒక్క ఓటు ప్రధానమే...* ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రానికి వెళ్లి తమ ఓటుహక్కు వినియోగించుకున్నపుడే ప్రజాస్వామ్య పండుగకు సార్దకత చేకూరుతుందని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కఓటు విలువైనదని అది ప్రజాస్వామ్యానికి పునాది అన్నారు. ఓటుహక్కును వినియోగించుకోవడం ప్రతి పౌరుని భాద్యత అని ఆయన స్పష్టం చేశారు. ప్రతి ఓటరు మే 13వ తేదీ సోమవారం పోలింగ్ కేంద్రానికి వెళ్లి తమ ఓటుహక్కు వేసే బాధ్యతను నెరవేర్చాలన్నారు. ఓటుహక్కు వినియోగంపై ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 2 వేలకు పైగా స్వీప్ కార్యక్రమాలు, కళాజాతలు నిర్వహించామన్నారు.
జిల్లా కలెక్టర్ వెంట ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి యం. ముక్కంటి. జెడ్పి సిఇఓ కె.ఎస్.ఎస్. సుబ్బారావు, నగరపాలక సంస్ధ కమీషనరు యస్ వెంకటకృష్ణ, డిపివో టి. శ్రీనివాస విశ్వనాధ్ తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment