అభివృద్ధి, రాష్ట్ర ప్రయోజనాలే పార్లమెంటు సభ్యుల ప్రథమ కర్తవ్యం.





*అభివృద్ధి, రాష్ట్ర ప్రయోజనాలే పార్లమెంటు సభ్యుల ప్రథమ కర్తవ్యం



*


*విభజన హామీలు అమలకు ఎంపీలు కృషి చేయాలి*


*దేశంలోనే టాప్ 10 విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులు, పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకోవాలి*


*పార్లమెంటులో టీడీపీ ఎంపీలు అనుసరించాల్సిన విధివిధానాలపై చంద్రబాబు దిశానిర్దేశం*


*టీడీపీ పార్లమెంటరి పార్టీ నేతగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నియామకం*


అమరావతి (ప్రజా అమరావతి):- రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా పార్లమెంటు సభ్యులందరూ పని చేయాలని, స్ఫూర్తిదాయకంగా నిలవాలని తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. రాష్ట్ర ప్రయోజనాలే ఎంపీల ప్రథమ కర్తవ్యం కావాలని దిశానిర్దేశం చేశారు. శనివారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాయలంలో టీడీపీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ భేటీ జరిగింది. ఈ సమావేశంలో పార్లమెంటులో లేవనెత్తవలసిన అంశాలు, అనుసరించాల్సిన విధివిధానాలుపై చర్చించారు. రాష్ట్రాభివృద్ధికి అవసరమైన నిధులు, ప్రాజెక్టులు, పథకాలు తీసుకువచ్చేలా కృషి చేయాలని సూచించారు. రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా పెట్టుకొని సభ్యులందరూ వ్యవహరించాలని చంద్రబాబు సూచించారు. ఈసారి లోక్ సభలో తెలుగుదేశంకి 16 ఎంపీల బలం ఉన్నందున రాష్ట్రానికి ఎక్కువ నిధులు, మరిన్ని అభివృద్ధి ప్రాజెక్టులు వచ్చేలా చూడాలన్నారు. దేశంలోనే టాప్ 10 విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులు, పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకువచ్చేలా కృషి చేయాలని అన్నారు. ప్రతీ ఎంపీ కేంద్రలో ఒక శాఖతో, అదే శాఖతో రాష్ట్రంలో కూడా సమన్వయం చేసుకుంటూ రాష్ట్రాభివృద్ధికి తోడ్పడాలని అన్నారు. కేంద్ర పథకాలను పూర్తిగా సద్వినియోగం చేసుకునేలా ఎంపీలు పని చేయాలని అన్నారు. ప్రజా రాజధాని అమరావతి, ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టుల పూర్తికి సహకరించాలన్నారు. వీటితో పాటుగా విభజన చట్టంలోని హామీల అమలుకు కృషి చేయాలని సూచించారు. సేంద్రీయ వ్యవసాయంలో దేశానికి ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలవాలన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో కూడా ఆంధ్రప్రదేశ్‌లో పెద్దఎత్తున సేంద్రీయ వ్యవసాయం నిర్వహించి ప్రోత్సహించామన్నారు. ఉపాధి హామీ కింద గతంలో రికార్డు స్థాయిలో రాష్ట్రంలో రహదారులు నిర్మించామని, కేంద్ర పథకాలతో ఇళ్లు నిర్మాణం చేపట్టామని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా రహదారలు, ఇళ్ల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించి మరింత లబ్దీ చేకూర్చేలా కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో ఉన్న జాతీయ రహదారులు, పొరుగు రాష్ట్రాలతో అనుసందానమై ఉన్న రహదారులు అభివృద్ధికి తోడ్పడాలన్నారు. అమరావతి-అనంతపురం ఎక్స్‌ ప్రెస్ హైవే ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేసేలా కృషి చేయాలని చంద్రబాబు సూచించారు. ఈ భేటీలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్లగా చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాద్ రావు,  నంద్యాల ఎంపి బైరెడ్డి శబరి, కోశాధికారిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, పార్లమెంటరీ పార్టీ విప్‌గా గంటి హరీష్ నియమించారు.


ఈ భేటీలో కేంద్రమంత్రులు కింజరాపు రామ్మెహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్, మరియు ఇతర పార్లమెంటు సభ్యులు పాల్గొన్నారు.

Comments