సుర‌క్షిత ప్రాంతాల‌కు 154 మంది గ‌ర్భిణుల త‌ర‌లింపు.

 


 

సుర‌క్షిత ప్రాంతాల‌కు 154 మంది గ‌ర్భిణుల త‌ర‌లింపు

పున‌రావాస కేంద్రాల‌కు అనుబంధంగా 14 వైద్య శిబిరాలు

అద‌నంగా 20 సంచార వైద్య శిబిరాలు

వైద్య శిబిరాల ద్వారా 17538 మంది రోగుల‌కు సేవ‌లు

108 అంబులెన్స్ లు 25 అందుబాటులో ఉంచాం


ప్రభుత్వాసుపత్రుల్లో అదనంగా 100 పడకలు


75 వేల అత్యవసర మందుల కిట్లు 


-వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎం.టి.కృష్ణ‌బాబు


అమ‌రావ‌తి (ప్రజా అమరావతి):

తదుపరి 10 రోజుల్లో ప్రసవించే  154 మంది గర్భిణిల‌ను వైద్య ఆరోగ్య శాఖ సురక్షిత  ప్రాంతాలకు చేర్చింద‌ని వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎం.టి.కృష్ణ‌బాబు నేడొక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఈ ఏర్పాటులలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ ప్రజలకు అత్యవసర ఆరోగ్య సేవల్ని అందించేందుకు అనేక కార్యక్రమాల్ని చేపట్టింద‌న్నారు. పునరావాస కేంద్రాలకు అనుబంధంగా 14 వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించడంతో పాటు వీటికి అదనంగా 20 సంచార వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేసి వైద్య సేవల్ని అందించింద‌న్నారు. ఈ  వైద్య శిబిరాల ద్వారా  ఇప్పటివరకు 17,538  మంది రోగులు సేవ‌ల్ని అందుకున్నార‌న్నారు. ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాల కార‌ణంగా విజ‌య‌వాడ న‌గ‌రంలో ప‌లు ప్రాంతాలు జ‌ల దిగ్బంధంలో చిక్కుకోవ‌డంతో ప్ర‌భుత్వం అనేక కార్య‌క్ర‌మాల్ని చేప‌ట్టి, ప్ర‌జ‌ల్ని సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించి త‌గిన వ‌స‌తుల్ని క‌ల్పించింద‌ని ఆయ‌న పేర్కొన్నారు.  ముఖ్య‌మంత్రి శ్రీ నారా చంద్ర‌బాబునాయుడు ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తూ తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై దిశానిర్దేశం చేస్తున్నార‌న్నారు .  విజయవాడ నగరంలో  32 వార్డ్స్ జలదిగ్బంధం లో చిక్కుకొన్న దృష్ట్యా అందరకి 6 రకములైన అత్యవసరమైన మందులను, వాటిని వాడే విధానం తెలియచేసే కర పత్రాన్ని జత చేస్తూ సుమారు 75,000 కిట్స్ ను హెలికాప్టర్ ద్వారా, బోట్స్ ద్వారా మరియు  రోడ్డు మార్గములో  అందించడం జరుగుతోంద‌న్నారు. . అత్యవసర వైద్య సేవల కోసమై అదనంగా ఇరవై అయిదు 108 అంబులెన్సులను అందుబాటులో ఉంచామ‌న్నారు.  వరదల కారణము గా  వ్యాధులు  పెరిగి , ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవల కోసమై వచ్చే రోగుల సౌలభ్యం కోసం  అదనంగా 100 పడకలను ఏర్పాటు చేశామ‌న్నారు.


వివిధ కాలనీల్లో  నీటిమట్టం తగ్గు ముఖం  పడుతున్న దృష్ట్యా సంక్రమిత వ్యాధులు  ప్రబ‌లే అవకాశం వున్నందున విస్తారమైన వైద్య సహాయక ఏర్పాట్లు చేయడం జరుగుతోంద‌న్నారు.  వీటిలో భాగంగా 32 వార్డ్స్ లో 64 వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతోంద‌ని, ఈ వైద్య శిబిరాలలో రోగులకు అవసరమగు వైద్య పరీక్షలు చేసి ఉచితముగా మందులను అందిస్తార‌న్నారు.   ఈ 32 వార్డ్స్ లు మరియు అధిక నష్టమైన 5 సమీప గ్రామీణ ప్రాంతాలలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తూ అనుబంధంగా సంచార వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతోంద‌న్నారు. ఈ శిబిరాలలో  200 రకముల మందులను సిద్ధంగా ఉంచామ‌న్నారు. వైద్య సేవలు అందించడం లో తగిన సూచనలు మరియు సౌకర్యాలు పొందుపరచడం కోసమై ఉన్నత అధికారులతో 10 బృందాలను ఏర్పాటు చేశామ‌న్నారు. ప్రజలకు ఆరోగ్య సూచనలు ,సలహాలు మరియు సేవలు అందించడం కోసమై విస్తృతమైన ప్రచార కార్యక్రమాల్ని చేప‌డుతున్నామ‌ని, పై కార్యక్రమాల పర్యవేక్షణ కోసం  ఒక ప్రత్యేకమైన కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేశామ‌న్నారు.

         


Comments