హోరాహోరీగా దులీప్‌ ట్రోఫీ.

 *హోరాహోరీగా దులీప్‌ ట్రోఫీ*



– ఫలితం దిశగా ఇండియా సీ, డీ మ్యాచ్‌

– తొలి ఇన్నింగ్స్‌లో 168 పరుగులకు ఆలౌట్‌ అయిన ఇండియా సీ 

– రెండో ఇన్నింగ్స్‌లోనూ తడబడ్డ ఇండియా డీ 

– లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ మనవ్‌ సుతార్‌ ధాటికి ఇండియా డీ 206/8 

– 5 వికెట్లు తీసిన మనవ్‌ సుతార్‌ 

– అర్ధసెంచరీలో రాణించిన శ్రేయస్స్‌ అయ్యర్, పడిక్కిల్‌

అనంతపురం, సెప్టెంబర్‌ 06  (ప్రజా అమరావతి):


 దులీప్‌ ట్రోఫీలో భాగంగా అనంతపురంలోని ఆర్డీటీ స్పోర్ట్స్‌ విలేజ్‌‡ ప్రధాన మైదానంలో జరుగుతున్న ఇండియా సీ, డీ మ్యాచ్‌ హోరాహోరీగా శుక్రవారం హోరా హోరీగా సాగింది. ఇరు జట్ల బౌలర్లు పోటాపోటీగా రాణిస్తుండడంతో మూడో రోజే ఫలితం వెలువడే అవకాశం కన్పిస్తోంది. శుక్రవారం ఆటముగిసే సమయానికి ఇండియా డీ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 49 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ  జట్టు 202 పరుగుల ఆధిక్యంతో కొనసాగుతోంది. 


*రాణించిన ఇంద్రజిత్‌..ఇండియా సీకి స్వల్ప ఆధిక్యం:*

   ఓవర్‌నైట్‌ స్కోర్‌ 91/4తో ప్రారంభించిన ఇండియా సీ జట్టు 48.3 ఓవర్లలో 168 ³రుగులకు ఆలౌట్‌ అయ్యింది. రెండో రోజు కేవలం 77 పరుగులు మాత్రమే చేసి మిగితా ఆరు వికెట్లను ఇండియా సీ జట్టు కోల్పోయింది. జట్టులో బాబా ఇంద్రజిత్‌ అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 149 బంతులు ఎదుర్కొన్న బాబా ఇంద్రజిత్‌ 9 బౌండరీ సహాయంతో 72 పరుగులు చేశాడు. వికెట్‌ కీపర్‌ అభిషేక్‌ పోరెల్‌ 34 పరుగులు మాత్రమే చేశారు. ఎక్స్‌ట్రాల రూపంలో 16 పరుగులు వచ్చాయి. ఇండియా డీ బౌలర్లలో పేసర్‌ హర్షిత్‌ రాణా 4, అక్షర్‌ పటేల్‌ 2, సరాన్ష్‌ జైన్‌ 2, అర్ష్‌దీప్‌ సింగ్, ఆదిత్య థాకరే చెరో వికెట్‌ తీసుకున్నారు. 


*ఇండియా డీ తడబాటు:* 

ఇండియా డీ జట్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ తడబడింది. ఇండియా సీ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ మనవ్‌ సుతార్‌ 5 వికెట్లు తీసి..ఇండియా డీను కట్టడి చేశాడు. 15 ఓవర్లలో 30 పరుగులిచ్చి 5 వికెట్లు తీసుకున్న సుతార్, పడిక్కిల్, శ్రీకర్‌భరత్,   సరాన్ష్‌జైన్, అర్ష్‌దీప్‌ సింగ్, రికీ బుయీలను పెవిలియన్‌కు పంపాడు. అతనికితోడుగా పేసర్‌ వైశాక్‌ రెండు వికెట్లు తీసి రాణించాడు. దీంతో ఇండియా డీ జట్టు ఆటముగిసే సమయానికి 8 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. క్రీజ్‌లో అక్షర్‌ పటేల్‌ 11, హర్షిత్‌ రాణా 0 ఉన్నారు. జట్టులో కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్, డేవదత్‌ పడిక్కిల్‌ అర్ధ సెంచరీలతో జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ నందించే ప్రయత్నం చేసినా..మిగితా బ్యాట్స్‌మెన్‌లు విఫలం కావడంతో డీ జట్టు భారీ స్కోర్‌ చేయలేకపోయింది. శ్రేయస్‌ అయ్యర్‌ కేవలం 44 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్‌ సహాయంతో 54,  పడిక్కిల్‌ 70 బంతుల్లో 8 బౌండరీల సహాయంతో 56 పరుగులు చేశారు. మరో బ్యాట్స్‌మెన్‌ రికీ బుయీ 44(5 ఫోర్లు, ఒక సిక్సర్‌) పరుగులు చేశాడు. ఇండియా డీ జట్టు 202 పరుగుల ఆధిక్యంలో ఉంది.


Comments