స్వచ్ఛమైన, పరిశుభ్రమైన భారతదేశానికై అందరూ కృషి చెయ్యాలి -జిల్లా క్షేత్ర ప్రచార అధికారి శ్రీ శ్రీరామ మూర్తి కందాళ ఐ.ఐ.ఎస్ .






స్వచ్ఛమైన, పరిశుభ్రమైన భారతదేశానికై అందరూ కృషి చెయ్యాలి -జిల్లా క్షేత్ర ప్రచార అధికారి శ్రీ శ్రీరామ మూర్తి కందాళ ఐ.ఐ.ఎస్ 



*పారిశుధ్య కార్మికులకు ఆప్రాన్లు పంపిణీ 

* స్వచ్ఛభారత్ పై  నిర్వహించిన వివిధ పోటీలలో గెలిచిన విద్యార్థులకు బహుమతులు  అందజేత 

* "అమ్మ పేరిట ఒక మొక్క" కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన అధికారులు 

* అలరించిన సాంగ్ అండ్ డ్రామా కళాకారుల మ్యాజిక్ షో 


కాకినాడ, సెప్టెంబర్ 28 (ప్రజా అమరావతి):

 స్వచ్ఛమైన, పరిశుభ్రమైన భారతదేశానికై కృషి చెయ్యాలని కేంద్ర ప్రభుత్వ క్షేత్ర ప్రచార అధికారి శ్రీరామ మూర్తి కందాళ ఐ.ఐ.ఎస్ అన్నారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, కాకినాడ, స్థానిక ఐడియల్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ  లో  స్వచ్ఛతే సేవ కు సంభందించి  మినీ ఐసివోపి కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సెప్టెంబరు 17 వ తేదీ నుంచి అక్టోబర్ 2 వ తేదీ వరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ స్వచ్ఛతా హీ సేవా  కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజలు భాగస్వాములై పరిసరాలను,  పనిచేస్తున్న కార్యాలయాలను, గ్రామాలను, పట్టణాలను పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, తద్వారా స్వచ్ఛ కాకినాడ, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ భారత్ లుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. 


ఈ కార్యక్రమాన్ని గాంధీనగర్ సమీపంలో  నిర్వహించడం ఎందుకు ప్రత్యేకమో శ్రీ కందాళ వివరిస్తూ 1921 ఏప్రిల్ 2న, గాంధీ కోకనాడ (ప్రస్తుతం కాకినాడ)ను సందర్శించి, ఎల్విన్‌పేటలో 40,000 మందిని ఉద్దేశించి ప్రసంగించారని తెలిపారు. గాంధీ ప్రసంగించిన ఈ ప్రాముఖ్యమైన స్థలం, ఆయన స్మరణకు గుర్తుగా తదనంతరం గాంధీ నగర్‌గా పునర్నామం చెందిందని ఇది భారతదేశ స్వాతంత్య్ర పోరాటంపై మహాత్ముని నిరంతర ప్రభావానికి చారిత్రాత్మక, సాంస్కృతిక సంబంధాలను ప్రతిబింబిస్తుందని తెలిపారు.


కాకినాడ జిల్లా పంచాయతీ రాజ్ డీఎల్పీవో శ్రీ. వెంకట రెడ్డి మాట్లాడుతూ  మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణతోనే స్వచ్ఛ గ్రామాలుగా రూపుదిద్దుకుంటాయన్న మహాత్మా గాంధీ నినాదంతో స్వచ్ఛతా హీ సేవా' కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందన్నారు. స్వభావ్ స్వచ్ఛత - సంస్కార్ స్వచ్ఛత' నినాదంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.


కళాశాల డైరెక్టర్ శ్రీ కృష్ణం రాజు మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతను కాపాడుకోవడం, మహాత్మా గాంధీ వారసత్వాన్ని గౌరవించడం, స్వచ్ఛతను ఓ జీవన విధానంగా మార్చుకోవడమే.. లక్ష్యం గా ప్రతిజ్ఞ చేయాలనేది ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. 


 కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీ సుబ్రహ్మణ్య మూర్తి మాట్లాడుతూ 

 స్వచ్ఛతా కార్యక్రమాల్లో దేశ పౌరులను భాగస్వాములుగా చేయడం ద్వారా 

 'స్వచ్ఛభారత్' లక్ష్యం నెరవేరుతోందన్నారు.


 పరిసరాలను పరిశుభ్రం గా ఉంచేందుకు నిరంతరం కృషిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు ఆప్రాన్లను అందజేశారు.


భారత ప్రధానమంత్రి  పిలుపు మేరకు "అమ్మ పేరిట ఒక మొక్క" కార్యక్రమంలో భాగంగా  మొక్కలు నాటారు. అనంతరం కాలేజీ విద్యార్థులు, లెక్చరర్లు "స్వచ్ఛతే సేవ " స్వచ్ఛత వైపు  ఒక అడుగు ముందుకు వేయాలంటూ నినాదాలు చేశారు. సీబీసీకి చెందిన, సాంగ్ అండ్ డ్రామా కళాకారులు నిర్వహించిన మ్యాజిక్ షో చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. 


ఈ కార్యక్రమం లో భాగంగా సీబీసీ ఆధ్వర్యంలో ముందు రోజు విద్యార్థులకు స్వచ్ఛభారత్ పై వివిధ పోటీలు నిర్వహించగా, ఆయా పోటీలలో గెలిచిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేయడం జరిగింది. ముఖ్య అతిధులుగా హాజరైన అందరినీ సిబిసి అధికారి దుశ్శలువాలతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో  కాకినాడ జిల్లా స్థాయి అధికారులు, లెక్చరర్లు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Comments